Saturday, September 17, 2022

సంకల్ప సిద్ధి

 *సంకల్ప సిద్ధి*
🌈💫🌈💫🌈💫🌈💫🌈💫🌈💫🌈

💐 సంకల్పం అంటే మంచి ఆలోచన, మంచి నిర్ణయం. ఆలోచనలు మారుతూ ఉంటాయి, సంకల్పం దృఢంగా ఉంటుంది. ఆలోచనలు రెండు రకాలు - మంచి ఆలోచన, చెడు ఆలోచన. అందరికీ ఉపయోగపడేలా ఏదైనా కార్యక్రమాన్ని చేపట్టాలనుకోవడం మంచి ఆలోచన. స్వార్థంతో, పర్యవసానంతో పనిలేకుండా సాగించే మనో వ్యాపారం చెడు ఆలోచన. ఆలోచన మంచిదైతే మంచి ఫలితం, చెడు ఆలోచన అయితే అందుకు తగ్గ ఫలం అనుభవించక తప్పదు.

💐 మనం అనుకున్నది జరగాలంటే అందుకు తగ్గట్టుగా పాటుపడాలి, ప్రయత్నించాలి. దాన్నే పురుషకారం లేక మానవ ప్రయత్నం అంటారు. తలదాచుకోవడానికి ఇల్లు, ఒళ్లు కప్పుకోవడానికి బట్ట, కడుపు నిండటానికి తిండి, ఏదో రకంగా సంపాదించుకోక తప్పదు. అవసరాల మేరకు కష్టపడి సంపాదించుకోవడం మానవ ధర్మం. స్వార్థం మితిమీరి సంపాదన అడ్డదారి పట్టితే జరిగేది వికల్పం. సంకల్పాన్ని సాధించడానికి వేసే ప్రతి అడుగూ ఆచితూచి ముందుకు వేయాలి.

🌈 తెలివైన జీవులు తాము ఎటుపోవాలో ముందుగానే తెలుసుకుని ఆ దారిని అనుసరిస్తారు. తెలిసీ తెలియని జీవులు జీవితం ద్వారా పాఠాలు నేర్చుకోవాల్సి ఉంటుంది. సంకల్ప వికల్పాలు అంతవరకు వారిని వెంటాడుతూనే ఉంటాయి.

💐 ఏది మంచో, ఏది చెడో తెలుసుకోవడానికి రెండు ముఖ్యమైన పద్ధతులున్నాయి. వాటినే *జ్ఞానమార్గం, కర్మమార్గం* అంటారు. వేదాలు, శాస్త్రాలు జ్ఞానమార్గంలో నడిచేవారికి దారిదీపాల్లా పనికి వస్తాయి. అందుకు అవకాశం లేనివారికి జీవితానుభవాలే పాఠాలు నేర్పుతాయి. అలాగని, జ్ఞానులకు జీవిత పాఠాలు అనవసరం అనలేం. కర్మ జీవులకు జ్ఞానంతో పనిలేదనీ చెప్పలేం. దారులు వేరైనా గమ్యం ఒకటే కాబట్టి, శ్రద్ధాభక్తులు తోడు అయినప్పుడు- కర్మజ్ఞానాలు పరిపుష్టమై పూర్ణత్వం సాధిస్తాయి. సంకల్పసిద్ధికి భక్తి జ్ఞాన వైరాగ్యాలు త్రివేణీ సంగమంలా సహకరిస్తాయి.

🌈 వైరాగ్యం అంటే మామూలుగా విరక్తి అనే అర్థంలో ఆ పదాన్ని వాడతారు. ఒక వస్తువుపైన ఆసక్తి మితిమీరినప్పుడు కలిగేది విరక్తి. జీవితంలో ఎదురయ్యే *పురాణ, ప్రసూతి, శ్మశాన వైరాగ్యాలు* తాత్కాలికం. అనుభవించి రసహీనమని గ్రహించినప్పుడు నిజమైన వైరాగ్యం వరిస్తుంది. జీవిత సత్యాన్ని తెలుసుకున్నవాడే తెలివైనవాడు. సాధకుడు దూషణ భూషణ తిరస్కారాలకు అతీతంగా, నిరంతరం సాగిపోవాలంటారు విజ్ఞులు, ప్రాజ్ఞులు, అనుభవజ్ఞులు.

🌈 ఫలితం ఆశించకుండా పనిచేయమని కృష్ణుడు పరోక్షంగా మనల్ని ఆదేశిస్తున్నాడు. పనిమీద దృష్టి కేంద్రీకరిస్తే అదే యోగమై దైవానికి ప్రీతి కలిగిస్తుంది. పనికి తగ్గ ఫలితం తప్పకుండా ఏదోవిధంగా మనల్ని వరిస్తుంది. ఈ కర్మకౌశలం తెలుసుకున్నప్పుడే కర్మజీవి బుద్ధిజీవిగా మారతాడు. అతడికి సంకల్ప సిద్ధి కలుగుతుంది.

🌈 జీవితమే యోగంగా, పరహితం కోరుకునే వ్యక్తి సాధించేది జీవన్ముక్తి. జీవన్ముక్తుడికి కావలసింది తోటివారి హితం.

🌈 సంకల్పం అన్న పదానికి అర్థం మంచి ఆలోచన (సమ్యక్‌ + సంకల్పం). నిరంతర సాధనవల్ల ఆ వ్యక్తి తలపెట్టిన ప్రతి పనీ విశ్వ శ్రేయకార్యంగా విరచితం అవుతుంది. పరహితంకోసం పాటుపడే అతడి ప్రతి ఆలోచనా ఒక సదాశయం కలిగి ఉంటుంది. ఆ ఆలోచన ఆచరణీయమై మంచి ఫలితాన్నే ప్రసాదిస్తుంది. సూటిగా చెప్పాలంటే- అలాంటి వ్యక్తి బుర్రలో చెడు, కీడు, చేటు తెచ్చే ఆలోచనకే చోటుండదు.

🌈 మనో వ్యాపారం దృఢ సంకల్పమైనప్పుడు మనోరథం సిద్ధిస్తుంది. సంకల్పం సత్‌ సంకల్పమైనప్పుడు పారిజాతంలా
 గుబాళిస్తుంది!


*సేకరణ:*
🌈💫🌈💫🌈💫🌈💫🌈💫🌈💫🌈

No comments:

Post a Comment