Sunday, September 4, 2022

ధ్యానమన్ననేమి?

 ధ్యానమన్ననేమి?

నేడు ధ్యానము చేయడం ఒక సరదా అయింది. పరిపాటి, హోదా, గొప్పతనమూ కూడా అయ్యింది. అసలు ధ్యానం అంటే ఏమిటి? మనకి ఎన్నో సమాధానాలు వస్తాయి. 

ప్రాణాయామముతో మొదలయ్యి మార్కెట్ లో దొరికే ఎన్నో విధానాలు ధ్యానముగా మనకు పరిచయం చేయబడతాయి. ఆధ్యాత్మిక ఆశ్రమములు అయితే ఆశ్రమమానికొక్క ధ్యాన ప్రక్రియ మనకు అందిస్తున్నాయి.

ఇందరు ధ్యాన వ్యాపారములో ప్రవేశించి అసలు ధ్యానం అంటే ఏమిటి? అనే విషయంలో గందరగోళము, సంక్లిష్టత సృష్టించారు. ధ్యాన వ్యాపారము ధాన్య వ్యాపారముగా తయారయింది. యోగా చెయ్యడంలా, ధ్యానం చెయ్యడం
ఒక స్టేటస్ సింబల్ లా తయారయింది. అందరూ ఇందుకు తమవంతు సాయం చేస్తూ విరివిగా ధ్యాన వ్యాపారములు చేసికుంటున్నారు.

మనబోంట్లము ధ్యానం గురించి తెలుసుకొని, అవగాహన ఏర్పరచుకొని ధ్యానమగ్నులమైతే కావలసిన ఫలితం లభిస్తుంది. 

ముందుగా శ్రీ రమణులు చెప్పిన రెండు మాటలు. మన ఊపిరితీతకు మనసుకు పరస్పర సంబంధం ఉంది. ఊపిరి నెమ్మదిస్తే మనసు నెమ్మదిస్తుంది. నిజానికి ఊపిరికి మనసుకు జన్మ స్థానము ఒకటే. 

ఊపిరి ప్రాణ శక్తి (స్వరశక్తి) విభూతి అని, మనసు జ్ఞానశక్తి (దివ్యశక్తి) విభూతి అని ఉపనిషత్తులు చెప్పాయి. 

ఉపనిషత్తులలో ఈ రెండు విభాగముల మీద ఆధారపడి పది దశమహావిద్యలున్నాయి. అవి భూమవిద్య, శాండిల్యవిద్య, అక్షరోద్గీథ విద్య, సంవర్గవిద్య, మధువిద్య మొదలైనవి.  

వీటిలో భూమవిద్య ఆధారముగా శ్రీ శంకరాచార్యులు, శాండిల్యవిద్య ఆధారముగా శ్రీ రామానుజాచార్యులు ప్రస్థాన త్రయ వ్యాఖ్యానములు చేశారు. ఈ దశ మహావిద్యల గురించి మరొకసారి ముచ్చటించుకుందాం. ఒక మూడు నిర్వచనములతో ధ్యానావగాహనను పూర్తిచేసుకుందాం.

1 ఏక వస్తు చింతనమ్ ఏవ ధ్యానమ్

ఒకే వస్తువును గురంచి చింతించడం (తలచడం, భావించడం, విచికిత్స చేయడం, స్మరించడం) ధ్యానము. ఈ ఒకే వస్తువు ఆత్మ / బ్రహ్మము. 

ఆత్మ సత్-చిత్-ఆనందం. ఆత్మ యొక్క ఈ మూడు లక్షణములలో - నిజానికి ఆత్మకు లక్షణములుండవు, కాని మనకు సులువుగా అవగాహన కావడానికి ఈ పదం ఉపయోగించబడింది - ఒక లక్షణం మన మనస్తత్త్వాన్ని బట్టి మనకు నచ్చుతుంది. ఉపనిషత్ దశ మహా విద్యలూ ఈ మూడు వైశిష్ట్యములలో ఒక వైశిష్ట్యమును ఎన్నుకొని దాని చుట్టూ పరిభ్రమిస్తూ ధ్యాన ప్రక్రియను అందిస్తాయి. 

ఒకే విషయమును గురించి తలచడమూ ధ్యానమే. 

రూపము, నామము, రుచి, వాసన, స్పర్శ - ఇవి విషయములు. మనము వీటిలో ఎక్కువగా నామ, రూపములను ధ్యానమునకు ఉపయోగించుకుంటాం.
వీటిలో నామస్మరణం సులభమైన, తీవ్ర ప్రభావము కల, పరమ ప్రయోజనకర ధ్యాన సాధనము.

2. ధ్యానమ్ అర్థభావమ్

ఇది మరియొక నిర్వచనము. పండితులు, దార్శనికులు, జ్ఞానమార్గావలంబికులు ఈ విధముగా‌ ధ్యానము చేస్తారు.

వారు ఉపనిషత్తులు, దర్శనములు, ఇతర తర్క, మీమాంసా, వేదాంత గ్రంథములను పఠించి అందలి సారాన్ని, తాత్పర్యములను నిగ్గుతేలుస్తారు. ఇదీ ధ్యాన‌ ప్రక్రియే.

కౌపీనము పంచకమ్ లో శంకరులు ఈ మాటనే స్మరిస్తారు.

వేదాంత వాక్యేషు సదా రమంతో - అంటూ.

3. తైలధారావత్ అనుసంధాన‌ నైరంతర్యం‌ ధ్యానమ్.

నూనెను ఒక పాత్రనుంచి మరొక పాత్రలోనికి పోస్తున్నప్పడు నూనె ధారలా ఎలా పడుతుందో అలా విరామము లేక నిరంతరంగా వస్తు, నామ, రూప చింతనం, స్మరణం చేయడాన్ని ధ్యానము అంటారు.

ప్రాణాయామ ప్రక్రియ గురించి సంవర్గవిద్య లో విపులంగా చర్చించ బడింది. 

ధ్యానమునకు మనం మన అంతఃకరణములైన మనోబుద్ధ్యహంకారచిత్తములలో దేనినైనా ఉపయోగించుకోవచ్చు. ధ్యేయ వస్తువు / విషయాన్ని బట్టి ధ్యాన ప్రక్రియని బట్టి అంతఃకరణమును ఎన్నుకోవచ్చు. ధ్యానం చేస్తున్నప్పుడు తెలిసీ, తెలియక మనం ఈ నాలుగు అంతఃకరణములలో ఒకదానిని ధ్యాన సాధనంగా
ఉపయోగించుకుంటూంటాం.

ఇప్పుడు మా స్వంతం అంటూ మార్కెట్ లో ప్రవేశ పెడుతున్న ధ్యాన ప్రక్రియలు, ఉపనిత్ దశ మహావిద్యల లో ఏదో ఒకదానికి అనుకరణ. ధ్యానము గురించి అవగాహన లేకుండా ధ్యానం చేయడం ఆశించిన ఫలితములను ఈయదు. 

జాగరూకులమై ఉందుముగాక!

శ్రీరస్తు! శుభమస్తు! సమస్త సన్మంగళాని భవంతు!
ఏతత్సర్వమ్ పరబ్రహ్మార్పణమస్తు!

Dr. Rama brahmam

No comments:

Post a Comment