అందరూ శ్రద్ధగా చదవండి. "మూడు వజ్రాలు"
💎💎💎💎💎
ఒకరోజు శివపురం ప్రక్కనే ఉన్న కృష్ణాపురం నుండి ముగ్గురు గ్రామస్థులు న్యాయం కోసం మర్యాద రామన్న దగ్గరకు వచ్చారు. ముగ్గురినీ సాదరంగా ఆహ్వానించి కాఫీ ఫలహారాలు పెట్టాక “ఇప్పుడు చెప్పండి! మీ ముగ్గురూ ఏ పని మీద నన్ను చూడటానికి వచ్చారు?” అనడిగాడు.
“అయ్యా! నా పేరు శివుడు. నేను కుమ్మరిని. కుండలు తయారుచెయ్యటానికి మట్టిని ఎప్పుడూ ఈ భూషయ్య దగ్గరే కొంటుంటాను. నిన్న ఉదయం కుండలు చెయ్యటానికి నేను మట్టిని జల్లిస్తుంటే అందులో విలువైన మూడు వజ్రాలు దొరికాయి.
రెక్కాడితే గానీ డొక్కాడని పేదవాడ్ని. ఆ భగవంతుడే ఇన్నాళ్ళకి నన్ను కరుణించాడని ఆనందపడ్డాను. కానీ ఈ భూషయ్య నాకు దొరికిన ఈ వజ్రాలు తనకి చెందుతాయని నిన్నటి నుండి నాతో తగవు పడుతున్నాడు. తమరు ధర్మప్రభువులు. నాకు న్యాయం జరిపించండి” అంటూ మొలలో భద్రపరచిన వజ్రాలను రామన్నకు అందించాడు.
శివుడు చెప్పింది శ్రద్ధగా విన్న రామన్న భూషయ్య వంక చూస్తూ "ఏం భూషయ్యా! శివుడు చెప్పింది నిజమేనా...?” అనడిగాడు. అందుకు భూషయ్య ఈ విధంగా చెప్పాడు.
"అయ్యా! శివుడు చెప్పింది నూటికినూరు పాళ్ళు నిజమే. కానీ శివుడు మీకు ఓ విషయం చెప్పకుండా దాటేశాడు. అదే అసలు కిటుకు. శివుడికి తోలిన మట్టిని ధర్మయ్య పొలం నుండి డబ్బు పెట్టి కొన్నాను. కానీ శివుడు మాత్రం నా దగ్గర అరువుకి తోలించుకున్నాడు. ఆ డబ్బులు నాకింతవరకు ముట్టనేలేదు. తమరే చెప్పండి. శివుడికి వజ్రాలు దొరికిన మట్టికి హక్కుదారుడు శివుడా... నేనా?
ఆ మట్టిలో దొరికిన సొత్తు హక్కుదారుడిగా శివుడికి చెందటం న్యాయమా? నాకు చెందటం న్యాయమా? తమరు ఏం న్యాయం చెప్పినా తు.చ తప్పకుండా పాటిస్తాను.'
“దొరికిన సొత్తు హక్కుదారుడికి చెందటమే న్యాయం... ఇప్పుడు మట్టిలో దొరికిన ఈ మూడు వజ్రాలకి మీ ఇద్దరిలో నిజమైన హక్కుదారుడెవరో తేల్చాలి... ఇదేనా మీ తగవు?” అనడిగాడు మర్యాదరామన్న.
ఇంతలో మూడవ వ్యక్తి ముందుకు వచ్చి ఇలా చెప్పాడు. "అయ్యా! వాళ్ళిద్దరూ చెప్పింది విని తీర్పు చెప్పకండి....నేను చెప్పింది కూడా పూర్తిగా విన్నాక న్యాయం చెప్పండి”
"నా పేరు ధర్మయ్య. ఈ భూషయ్యకి మట్టి అమ్మింది నేనే. ఆ మట్టికి తగ్గ డబ్బులు భూషయ్య నాకు చెల్లించాడు. కానీ అందులో ఒక చెల్లని నోటు ఉంది. చెల్లని నోటును నాకు అంటగట్టిన భూషయ్య ఆ మట్టికి ఎలా హక్కుదారుడవుతాడు? అతని దగ్గర అరువుకి ఆ మట్టిని పోయించుకున్న శివుడు ఎలా హక్కుదారుడవుతాడు? కావాలంటే ఈ నోటును పరిశీలించండి" అంటూ చిరుగులు పడ్డ ఒక నోటును మర్యాదరామన్నకు అందించాడు.
ఆ నోటును అందుకుని పరిశీలించిన రామన్న “నిజమే ఈ నోటు చెల్లుబాటు కాదు. ధర్మయ్య చెప్పిన దాంట్లో ధర్మం ఆలోచించ వలసిందే” అన్నాడు.
వెంటనే భూషయ్య “అయ్యా ఈ ధర్మయ్య పేరులోనే కానీ ప్రవర్తనలో ధర్మం లేదు. నేను ఇతని పొలంలో మట్టి కొని పదిరోజులు అయింది. ఈ పదిరోజులలో నాకు మూడుసార్లు ఎదురుపడ్డాడు. కానీ ఈ నోటు గురించి ఒక్క మాట కూడా అడగలేదు. ఆ మట్టిలో వజ్రాలు దొరికాయని తెలియగానే ఆశపుట్టి దుర్బుద్ధితో ఈ పన్నాగం పన్నాడు. చెల్లని ఈ నోటుకు విలువలేనట్లే ధర్మయ్య మాటలలో ధర్మానికి విలువలేదు.
వెంటనే శివుడు కల్పించుకుంటూ "అయ్యా! ఆ మట్టిలో వజ్రాలు దొరికాయని తెలియగానే దుర్బుద్ధి పుట్టింది ధర్మయ్యకి మాత్రమే కాదు. ఈ భూషయ్యకి కూడా. నాకు మట్టి అరువుకి తోలేటప్పుడు కుండలు చేసి అమ్మినాక గానీ అతనికి డబ్బులు ముట్టచెప్పనని నేను ఖరాఖండిగా చెప్పాను. అందుకు ఒప్పుకున్నాకే మట్టిని నాకు అరువుకి తోలాడు. ఇప్పుడు డబ్బులు తనకి ముట్టలేదన్న సాకుతో ఈ మూడు వజ్రాలు తనవే అనటం దుర్బుద్ది కాక మరేమిటి?”
శివుడి మాటలకి ధర్మయ్య కల్పించుకుని "అయ్యా! వీళ్ళిద్దరూ తోడుదొంగల్లా కన్పిస్తున్నారు.... భూషయ్య చెప్పినట్లు మట్టి తోలుకు పోయిన తరువాత అతను నాకు మూడుసార్లు ఎదురుపడ్డా నేనీ నోటు గురించి అడగలేదు. ఎందువల్లనంటే భూషయ్య నాకిచ్చిన డబ్బుల బొత్తిని నేనలాగే బీరువాలో భద్రపరిచాను. నిన్న ఉదయమే కుటుంబ ఖర్చుల నిమిత్తం ఆ బొత్తిని తీస్తే ఈ నోటు బయటపడింది. ఇందులో దుర్బుద్ధి గానీ కుట్ర కుతంత్రాలు గానీ ఏమీలేవు" అని తనని తాను సమర్ధించుకున్నాడు.
ముగ్గురి వాదోపవాదాలు ప్రశాంతంగా విన్నాడు రామన్న. ఆ తరువాత “ఈ వజ్రాలు నా దగ్గర ఉంచి మీ ముగ్గురూ తగవు మాని మీ ఊరికి వెళ్ళండి. రేపటి ఉదయం మీ ఊరికి వచ్చి నా తీర్పు చెబుతాను” అని చెప్పాడు. ముగ్గురూ మర్యాదరామన్నకు నమస్కరించి వెళ్లిపోయారు. ఈ తగవంతా విన్న రామన్న మిత్రుడు సీతయ్య "మిత్రమా! సమస్య జఠిలమైనదే. ఎలా పరిష్కరిస్తావు?” అని సందేహం వెలిబుచ్చాడు.
“ఈ తగవంతా నువ్వనుకునేంత జఠిలమైందే కాదు మనిషిలో ఉండే ఆశకు, స్వార్థానికీ, మోసపూరిత మనస్తత్వానికి చక్కని ఉదాహరణ ...చూస్తూ ఉండు... రేపు ఉదయానికల్లా ఈ మూడు వజ్రాలకు అసలైన సొంతదారుడిని నిర్ణయించి మిగిలిన ఇద్దరితో వాళ్ళ తప్పును ఒప్పిస్తాను” చిరునవ్వుతో మిత్రుడికి చెప్పాడు రామన్న.
ఆ రాత్రి రామన్న కృష్ణాపురం వెళ్ళి ముందుగా ధర్మయ్యను కలుసుకున్నాడు.
“తమలాంటి వారు మా ఇంటికి రావటం ఆశ్చర్యంగాను, సంతోషంగాను ఉంది” అంటూ రామన్నను సాదరంగా ఆహ్వానించాడు ధర్మన్న.
"ధర్మన్నా! అనవసరమైన హడావిడి చేసి నేను వచ్చినట్లు పదిమందికీ తెలిసేటట్లు చెయ్యకు. నేను నిన్ను కలుసుకునేందుకు రహస్యంగా వచ్చాను” అన్నాడు రామన్న.
“అలాగా! అయితే రండి......” అంటూ రామన్నను మేడమీద గదిలోకి తీసుకుపోయి తలుపులు మూసి "అయ్యా! తమరు వచ్చిన కారణం చెప్పండి” అనడిగాడు ధర్మయ్య.
"ధర్మయ్యా! ముసుగులో గుద్దులాట ఎందుకు? విషయం సూటిగా చెబుతున్నాను విను! ఆ నోటు భూషయ్య ఇచ్చింది కాదన్న విషయం నీకూ తెలుసు నాకూ తెలుసు. ఆ మూడు వజ్రాలు కొట్టెయ్యటానికి నువ్వు వేసిన ఎత్తుకి నాకే మతిపోయింది.... రేపు నీ పక్షాన తీర్పు చెబుతాను. మరి నాకేమిస్తావు?”
"అయ్యా! మీరు చెప్పింది అక్షరాలా నిజం. ఉదయం నుంచి మీరు ఎవరిపక్షాన తీర్పు చెబుతారా అని సతమతమైపోతున్నాను. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకున్నట్లు తీర్పే నా ఇంటికి నడిచొచ్చింది. మీ ఋణం నేనుంచుకోను. మీరు తీర్పు నా పక్షాన చెప్పినట్లయితే ఆ మూడు వజ్రాలలో ఒక వజ్రం తమకి సమర్పించుకోవటానికి నాకేం అభ్యంతరం లేదు.”
"సంతోషం ధర్మయ్యా! కానీ ఇద్దరు తెలివైన వాళ్ళు ఏదైనా ఒప్పందం చేసుకుంటే అది నోటి మాటల్లో కాక రాతలలో ఉండాలంటారు. నీ తెలివితేటలు ఇవ్వాళ్ళ ఉదయం చూశాను కదా. అందుకే మనిద్దరి ఒప్పందాన్ని ఒక పత్రం మీద రాసుకుందాం” అన్నాడు రామన్న.
ఒక్కక్షణం ఆలోచించాడు ధర్మయ్య. పత్రం రాసిన తరువాత తను రామన్న వాటా ఎగ్గొట్టినా అతనేం చెయ్యలేడు. తన ఊళ్లోనే కాక చుట్టుప్రక్కల పదహారు ఊళ్ళలోనూ అతను సరైన న్యాయం చెబుతాడని పేరుంది. పత్రం బయటపడితే తనకంటే అతనికే నష్టం అని మనసులో తర్కించుకుని రామన్న కోరిన విధంగా పత్రం రాసి అందించాడు.
ఆ తరువాత భూషయ్యను కలుసుకున్నాడు.
"అయ్యా! ఇది కలా? నిజమా? తమ వంటివారు ఇంత రాత్రివేళ నా ఇంటికి రావటం. నా ఇల్లు పావనమైంది?” అంటూ సాదరంగా ఆహ్వానించాడు. “భూషయ్యా! సిరి ఎంతటి వ్యక్తినైనా తన దగ్గరకు నడిపించుకొస్తుంది. నేను వచ్చిన విషయం సూటిగా చెబుతాను విను!
మూడు వజ్రాల విషయంలో ఏం తీర్పు చెప్పాలా? అని ఎంతోసేపు ఆలోచించాను. న్యాయం ధర్మయ్య పక్షం ఉందనిపించింది. అందుకే ధర్మయ్యను కలుద్దాం అని బయలుదేరాను. కానీ దారిలో నా మనసు మారి నీ దగ్గరకు వచ్చాను. రేపు మీ పంచాయతీలో తీర్పు నీ పక్షం చెబుతున్నాను. ఇందుకు కృతజ్ఞతగా నువ్వు నాకేమిస్తావు?”
"అయ్యా! మీ అభిమానానికి కృతజ్ఞతగా ఆ మూడు వజ్రాలలో ఒక వజ్రం ఇచ్చుకుంటాను... అంతకుమించి వేరే ఏదన్నా ఇచ్చుకునేంత ధనవంతుడిని కాదు నేను" అన్నాడు భూషయ్య.
“భలేవాడివి భూషయ్యా! రోగి కోరింది వైద్యుడు ఇచ్చాడుట. నాకు కావలసింది అదే. కాకపోతే మన ఒప్పందం నోటి మాటల్లో కాకుండా ఓ పత్రం రాసుకుందాం. అప్పుడు మనలో ఎవ్వరు మాట తప్పినా ఆ పత్రం సాక్ష్యంగా ఉంటుంది.”
పత్రం అనగానే ఒక్క క్షణం ఆలోచనలో పడ్డాడు భూషయ్య. ధర్మయ్య ఆలోచించినట్లే భూషయ్య ఆలోచించాడు. పత్రం రాయటం వల్ల తనకి వచ్చే నష్టం ఏమీలేదు. ఆ మూడు వజ్రాలు మాత్రమే పోతాయి కానీ రామన్నకి పరువు మర్యాదలు పేరు ప్రఖ్యాతులు పోతాయి అనుకుని రామన్న కోరిన విధంగా పత్రం రాసి రామన్న చేతిలో పెట్టాడతను.
భూషయ్య ఇంటి నుంచి సరాసరి శివుడింటికి వెళ్లాడు రామన్న. శివుడు, అతని భార్య అప్పుడే భోజనానికి కూర్చున్నారు. రామన్నను చూసి కంచం ముందునుంచి లేవబోతున్న అతన్ని వారించి అతని ప్రక్కనే పీఠం వేసుకుని కూర్చుని "అమ్మా! నాకు ఆకలేస్తోంది. అన్నం వడ్డించు" అన్నాడు.
"క్షమించయ్యా! రెక్కాడితే గానీ డొక్కాడని వాళ్ళం. ఏ పండుగలకో, పబ్బాలకో తప్ప మా ఇంట్లో వరి అన్నం ఉంటుంది. మిగతా రోజుల్లో గంజి అన్నం, పచ్చి మిరపకాయలు మాకు పంచభక్ష్య పరమాన్నం. ఇది తమబోటి వారు తినలేరయ్యా" అందా ఇల్లాలు.
“ప్రేమాభిమానాలు నిండిన ఏ పదార్థమైనా పంచభక్ష్యపరమాన్నమేనమ్మా. నిద్ర సుఖమెరుగదు......ఆకలి రుచెరుగదు.... ఆ గంజి నాక్కూడా పోయమ్మా" అని గంజి త్రాగి బయటకు వచ్చి ఆరుబయట ఉన్న నులకమంచం మీద కూర్చున్నాడు.
రామన్న వెంటే బయటకు వచ్చిన శివుడు చేతులు కట్టుకొని నిల్చుని "అయ్యా! మీరు తీర్పు చెబుతానన్నది రేపు ఉదయం కదా! ఈ రాత్రి వేళ నా ఇంటికి రావటంలో ఏదో అర్థం ఉన్నట్లు తోస్తోంది. అదేమిటో చెప్పండి”
“శివుడూ నీకెలా చెప్పాలో నాకర్థం కావట్లేదు.... ఏం చెయ్యాలో తోచక నేను నీ దగ్గరకు వచ్చాను. ఉదయం నీవిచ్చి వెళ్ళిన వజ్రాలు ఇంట్లో బీరువాలో భద్రపరిచాను. ఇంటికి వచ్చిన చుట్టాలపిల్లాడు వాటిని గోలీలనుకుని తీసుకువెళ్ళి ఆడుకుని ఎక్కడో పారేసి వచ్చాడు. ఎంత వెదికినా అవి కనిపించలేదు... రేపు ఉదయం తీర్పు నీ పక్షాన చెబుతాను. మర్నాడొచ్చి ఆ వజ్రాలు తీసుకోమంటాను.... రేపు నువ్వురా...ఆ వజ్రాలకు తగ్గ మొత్తం నీకిస్తాను".
"అయ్యో! ఎంతపని జరిగిపోయిందయ్యా... న్యాయమో, ధర్మమో నాకు తెలియదు కానీ నాకు ఒక్క విషయం చెప్పండి. న్యాయంగా మీరు చెప్పాల్సిన తీర్పు ఆ మూడు వజ్రాలు నాకు చెందుతాయనా?..... ధర్మయ్యకి చెందుతాయనా? తేల్చి నాకు చెప్పండి అప్పుడు నా నిర్ణయం చెబుతాను.”
“శివుడూ న్యాయంగా నేను తీర్పుచెప్పాల్సి వస్తే ఆ మూడు వజ్రాలు ధర్మయ్యకు చెందుతాయని చెప్పాలి. ఎందుకంటే నువ్వు భూషయ్య దగ్గర అరువుకే ఆ మట్టిని పోయించుకున్నావు. భూషయ్య ధర్మయ్యకి చెల్లని నోటును ఇచ్చాడు. కనుక ఆ మట్టికి అందులో సొత్తుకి నిజమైన హక్కుదారుడు ధర్మయ్య అనటంలో సందేహం లేదు”.
"అయ్యా! రామన్న గారూ రేపు పంచాయతీలో ధర్మయ్య పక్షమే మీ తీర్పును చెప్పండి. పోయిన వజ్రాలను పోలిన గాజుముక్కలు ధర్మయ్యకు ఇవ్వండి. అవి వజ్రాలు కావు కనుక ధర్మయ్య మిమ్మల్ని నిలదీస్తే అవి నేనిచ్చినవే అని చెప్పండి. నేను కూడా ఒప్పుకుని మీరిచ్చిన డబ్బులు అవి అమ్మగా వచ్చినవని చెప్పేస్తాను".
“శివుడూ బాగా ఆలోచించు. అలా చేస్తే ఈ ఊరిలో వాళ్ళందరూ నువ్వు బ్రతికి ఉన్నంతకాలం నిన్ను మోసగాడంటారు".
"మరేం ఫర్వాలేదయ్యా! నడిచే ధర్మదేవత లాంటి మీరు న్యాయం తప్పి తీర్పుచెప్పటం కంటే నాలాంటి సామాన్యుడు మోసగాడిగా మాటపడటం నష్టం లేదు. మీరు ఇప్పటివరకు ఒక్క తప్పుడు తీర్పు ఇవ్వలేదని విన్నాను. ఇప్పుడు ఏ పరిస్థితుల వల్లనయినా అలాంటి తీర్పు ఇచ్చారంటే ముందు, ముందు కూడా ఇస్తారు. పదిమందికి న్యాయం చేసే మీరు ఏ కారణం వల్లా అన్యాయం వైపు అడుగెయ్య కూడదు".
" వెంటనే రామన్న “శభాష్ శివుడూ! నా కళ్ళు తెరిపించావు. ధనము లో పేదవాడివైనా గుణములో ధనవంతుడివని నిరూపించావు. రేపు పంచాయతీలో నీవు చెప్పినట్లే చేస్తాను” అంటూ అక్కడనుండి బయలుదేరి ఆ రాత్రి ఆ ఊరిలోనే ఉన్న పూటకూళ్ళ ఇంట్లో బస చేశాడు.
మర్నాడు ఉదయం పంచాయతీకి వెళ్ళాడు రామన్న. ఆ వూరి పంచాయతీ పరిష్కరించలేని సమస్యని మర్యాద రామన్న ఎలా పరిష్కరిస్తాడో చూద్దామని గ్రామస్థులు పంచాయతీ దగ్గర గుమిగూడి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
రామన్న అందరికీ నమస్కరించి "అయ్యలారా! ఈ మూడు వజ్రాలకు నిజమైన హక్కుదారుడు శివుడు” అంటూ తన తీర్పు చెప్పాడు. వెంటనే మోసం, దగా అంటూ భూషయ్య, ధర్మయ్య ఒకేసారి అరిచారు. ఇందులో మోసం, దగా ఏమీ లేదు. మట్టి అమ్మినప్పుడు డబ్బు పుచ్చుకున్న ధర్మయ్య లెక్కపెట్టుకోకుండా బీరువాలో దాచుకున్నాడన్నది అబద్ధం. ఆ డబ్బులో చెల్లని నోటు ఉంటే మూడు సార్లు భూషయ్య ఎదురుపడ్డాడు కనుక ఒక్కసారన్నా నిలదీసి ఉండేవాడు... ఇక భూషయ్య అరువుకి ఇష్టపడే ఆ మట్టిని తోలాడు. ఆ మట్టితో కుండలు ఏ కారణం చేతనయినా పగిలి పోయినా, పనికి రాకుండా పోయినా అతనికెలా సంబంధం ఉండదో మట్టిలో దొరికిన సొత్తుతో కూడా వీళ్ళకి సంబంధం ఉండదు. వీళ్ళు ఆ మూడు వజ్రాలు కాజెయ్యటానికి శివుడితో తగవు పెట్టుకున్నారనటానికి నా దగ్గర తిరుగులేని మరో సాక్ష్యం ఉంది" అంటూ రాత్రి భూషయ్య, ధర్మయ్య తనకు రాసిచ్చిన పత్రాలను పంచాయతీ పెద్దలకు అందించాడు.
ఆ పత్రాలను చూసిన పెద్దలు భూషయ్యను, ధర్మయ్యను ఛీ కొట్టారు. దాంతో వాళ్ళు, పశ్చాత్తాపపడి తాము దుర్బుద్ధితోనే శివుడితో తగవుపడ్డామని అందరిముందు ఒప్పుకున్నారు.
పంచాయతీ పెద్దల చేతిమీదుగా శివుడికి మూడు వజ్రాలను అందిస్తూ “శివుడూ! అవి గాజు రాళ్ళు కాదు. నిజంగా వజ్రాలు. జాగ్రత్త సుమీ!” అంటూ చమత్కరించాడు రామన్న.
సేకరణ. 👏
No comments:
Post a Comment