Sunday, October 16, 2022

👌ఆత్మ విచారణలోనే అన్ని మార్గాల సమన్వయం👌

 *🌹 శ్రీ రమణీయం - 21🌹*

*👌ఆత్మ విచారణలోనే అన్ని మార్గాల సమన్వయం👌*

                                ✍️ శ్రీ గెంటేల వెంకటరమణ
*నమో వేంకట రమణాయ, అద్వైత నిధయే నమః*
✳️🌹🌹🌹🌹✳️🕉️✳️🌻🌻🌻🌻✳️

🌈 *21. ఆత్మ విచారణలోనే అన్ని మార్గాల సమన్వయం* 🌹

✳️ ఆధ్యాత్మిక సాధనలోని కర్మ, భక్తి, యోగ, జ్ఞాన మార్గాలన్నీ ఆత్మ విచారణలో సమన్వయాన్ని పొందుతాయి. *“యోగః కర్మసు కౌశలం"* అనే ఉపదేశంలో *కర్మలోని కౌశలమే యోగము* అనే అర్థం ఇమిడి ఉంది. కర్తవు నీవు కాదని గుర్తించటమే నిజమైన కౌశలం. అప్పుడే ఫలం కోసం ఎదురు చూడని పనులను మనం చేయగలుగుతాం. శరీరంతో చేసే పనులన్నీ మనవేనని భావిస్తూ కర్తృత్వాన్ని పెంచుకుంటాం. మన ప్రమేయం లేకుండానే శరీరంలో జరిగే అనేక పనులకు మనం కర్తలం కాదు. మన ఆకలి, నిద్ర, శ్వాస, హృదయ స్పందన ఇవన్నీ మన అధీనంలో లేనపుడు శరీర క్రియలు మాత్రం మనవి ఎలా అవుతాయి! ఇక్కడ కర్తృత్వమే అజ్ఞానంగా ఉంది. అంటే.. ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకొనే జ్ఞానం లేకుండా పోయింది. 

✳️ ఏ తెలివితేటలతో పని లేకుండానే ప్రాణికోటి యావత్తూ జీవిస్తున్నా మనిషి మాత్రం తనకు వరంగా సంక్రమించిన తెలివి తేటలను అజ్ఞానంగా మార్చు కుంటున్నాడు. మనం కన్ను, ముక్కు, చెవి, నోరు, చర్మం అనే బాహ్య ఇంద్రియాలను చూస్తున్నామే కానీ వాటికి ఆధారంగా జ్ఞానేంద్రియాల రూపంలో ఉన్న భగవంతుడ్ని గమనించటం లేదు. ఇది గుర్తించిన రోజు కర్తృత్వం పోయి మన కర్మలో కౌశలం వస్తుంది. అంటే మన కర్మలకు నిజమైన పరిపూర్ణత సిద్ధిస్తుంది. మన నిద్ర, మెళకువలే ఆ దైవం చేతులో ఉండగా ఇక పనులన్నీ మనవి ఎలా అవుతాయి. ఆత్మ విచారణ ద్వారా నిత్య కర్మల్లో మన ప్రమేయమేమీ లేదన్న సత్యభావనే కర్మ మార్గంలో కౌశలంగా నిలుస్తుంది. ఏ కర్మ ఫలమైనా మనకి శాశ్వతంగా ఉండటం లేదని గ్రహించిన రోజు ఫలాపేక్షరహితమైన కర్మలకు శ్రీకారం చుడతాం.

✳️ *శాశ్వత ఫలాన్నిచ్చే కర్మలేవీ ఈ సృష్టిలో లేవు, గనుకనే ఏది అనుభవిస్తున్నా ఇది శాశ్వతం కాదన్న జ్ఞప్తి ఉండాలని శ్రీ శివానంద సద్గురుదేవుల బోధన.* ఏ అనుభవమైనా క్షణకాలమే ఉంటుంది. ఆ తర్వాత అది జ్ఞాపకంగానే మిగిలిపోతుంది. కనుకనే, *జీవితం క్షణభంగురం* అన్నారు. జ్ఞాపకాలతో మనకు సంక్రమించిన జీవత్వం వలన వర్తమానాన్ని వదిలి గతాన్ని, భవిష్యత్తుని పట్టుకొని వ్రేలాడుతున్నాం. వర్తమానంలో పొందే ఏ అనుభవమైనా జ్ఞాపకంగా మారనంత సరళంగా స్వీకరించగలిగితే సద్గురువులు వంటి పరమశాంతిని పొందగలుగుతాం. తల్లి కొట్టకముందే పిల్లవాడు ఏడవటం, తండ్రి బొమ్మలు తెస్తున్నాడని తెలిసి సంబరపడటం మనకి నవ్వులాటగా అనిపిస్తాయి. కానీ జ్ఞాపకాలు, ఊహలతో మనం చేసే పనులు కూడా అలాగే ఉంటాయి. నిద్ర లేవగానే మనకి కలిగే మొదటి జ్ఞాపకం దేహం. అదే అప్పటి వరకూ నారాయణ స్వరూపంగా ఉన్న మనసుని నరుడిగా మారుస్తుంది. అనుభవాలే మనకు జ్ఞాపకాలుగా ఏర్పడతాయి. ఆ జ్ఞాపకాలతో లేని క్షణాల్లో మనసు ఆత్మ స్వరూపంగానే ఉంటుంది. సాధనలో ఇలాంటి క్షణాలే నిమిషాలుగా, గంటలుగా పెరిగి తురీయావస్థ అవుతుంది. అదే జీవన్ముక్తుల్నీ చేసే సహజ సమాధి స్థితికి మనని చేరుస్తుంది. 

✳️ పనికి ముందే ఊహించడం, పని తర్వాత దానిగురించి చింతించడం ఆ పని చేసేందుకు ఉపయోగపడే ఆలోచనలుకావు. ఆశ, భయాలు మన ఊహలకూ, జ్ఞాపకాలకూ కారణాలు. వాటినే మనం ఆలోచనలు అనుకుంటున్నాం. కానీ అవసరాన్ని బట్టి తక్షణంలో స్ఫురించేదే నిజమైన ఆలోచన అవుతుంది. అదే మనం చేసే పనుల్లో కౌశలమై కర్మయోగాన్ని సిద్ధింపచేస్తుంది.

✳️ భక్తి అంటే భజనలు, కీర్తనలు, స్తోత్రాలతోపాటు వాటిలో అంతర్లీనంగా భగవంతుని సర్వవ్యాపకత్వం తెలుకోవడం. ఈ సృష్టిలో జరిగే ప్రతి పనికి ఆత్మచైతన్యరూపంలో ఆ భగవంతుడే కారణమవుతున్నాడు. సహస్రనామాల్లో మనం చేసే పొగడ్తలను వాస్తవ దృష్టితో గ్రహించి గుర్తుంచుకోవటమే సంపూర్ణ భక్తి. అనుక్షణం ఆయన దయతోనే నువ్వు, నేను ఈ సృష్టిలోని సకల చరాచర జీవరాసులు జీవిస్తున్నాయన్న అవగాహనే నిరంతర ప్రార్ధన అవుతుంది. గుండె కొట్టుకున్నంత కాలం అది దైవానుగ్రహమేనన్న సత్యం మనం అనుక్షణం గుర్తించటమే భక్తి. కనిపించే రూపాలన్నింటిలోనూ, దైవాన్ని చూసే ఏకాత్మభావన రావాలి. *'సమత్వం యోగ ఉచ్యతే'* అనే బోధనలో ఇదే అర్థం ఇమిడి ఉంది. భిన్నంగా కనిపిస్తున్న ఈ ప్రపంచంలో ఏకత్వాన్ని చూసేంత భక్తి మనకి రావాలి. పక్షులు ఎగురుతాయి, పాములు ప్రాకుతాయి, చేపలు ఈదుతాయి, జంతువులు నడుస్తాయి. విధానాలు వేరుగా ఉన్నా అన్నింటిలోనూ జరిగేది గమనమే. ఆ గమనానికి ఆధారంగా ఉన్నది శక్తిరూపంలో ఉన్న ఈశ్వరుడే. ప్రాణకోటినే మనం ఈశ్వర సృష్టి అంటున్నాం. కనిపించే రూపాలు ఎన్నైనా అన్నింటిలో సమంగా ఉన్నది ప్రాణం కనుకనే అన్నింటిని కలిపి ప్రాణకోటి అంటున్నాం. అలా భావించి దర్శించటమే సమదృష్టి. 

✳️ ప్రపంచంలో ఎక్కడైనా చీకటి, వెలుతురు సమానమే. అలాగే ఏ ప్రాణిలోనైనా జీవం, జీవనం సమానమే. తేడా అంతా జీవనవిధానాల్లోనే ఉంది. కనిపించని ప్రాణానికి రూపమేకాదు, పరిమాణం కూడా లేదు. కనుకనే చీమలోనూ, ఏనుగులోను ఒకే ప్రాణం ఇమిడి ఉండగలుగుతుంది. అందుకే ఆత్మస్వరూపమైన ఆ దైవాన్ని *“అణోరరణీయాన్-మహితో మహియాన్"*  అన్నారు. అంటే *అణువులో అణువుగా, అఖిలాండంలో అనంత చైతన్యంగా అదే ఆత్మ భాసిస్తుందని అర్థం.* 

✳️ ప్రతిభిన్నత్వంలోనూ ఏకత్వాన్ని గుర్తించటమే యోగం. *"మామేకం శరణం ప్రజ”* అన్న ఈశ్వరవాక్యంలో తనని ఒకేఒక్కడిగా గుర్తించి ఒకే రూపంలో కొలవమని కాదు. అన్నిట్లోనూ ఏకత్వంగా భాసిస్తున్న ఆత్మగా తనను గుర్తించమని భగవంతుని సందేశం. దైవాన్ని శరణుపొందడం అంటే ఆయన దివ్యలక్షణాలను మనం స్వీకరించడం. అన్నిట్లోనూ ప్రాణానికే ప్రాణంగా ఆత్మ చైతన్యమేఉంది. ఈ ఆత్మ చైతన్యాన్ని గుర్తించి మన కర్తృత్వ భావనను విడిచి పెట్టేంత శరణాగతి వచ్చిన రోజున భగవదానుగ్రహం లభిస్తుంది. శరణాగతిలో ఏ షరతులూ, నిబంధనలూ ఉండవు. మన అనుభవంలోకి ఏది వచ్చినా అది భగవంతుడు ఇచ్చిందేనన్న శాంతి పొందడమే నిజమైన శరణాగతి. అలాంటి శరణాగతిలో ఏ ప్రత్యేకసాధనతో పనిలేని ఆధ్యాత్మికత ఇమిడిఉంది. *“ఏకమేవాద్వితీయం బ్రహ్మ"* అన్న జ్ఞానబోధనలో ఆ దైవమే ఆత్మ చైతన్యం గానూ, ప్రకృతిబద్దుడైన జీవుడిగానూ వ్యక్తమౌతున్నాడన్న సత్యం తెలుస్తుంది.

✳️ మనకి జీవత్వం వల్ల అనేక కోర్కెలు కలుగుతాయి. వాటిని తీర్చుకుంటూ ఒకనాటికి విసుగు చెందుతాం. చివరికి భగవంతుని అనుగ్రహంవల్లనే శాంతిని కోరుకుంటాం. శాంతికోసం దైవాన్ని ఆశ్రయించి అనేక రూపాల్లో ఆ దైవాన్ని పూజించినా తనవితీరక చివరకు అంతర్ముఖత్వాన్ని కోరుకోవడంలో కూడా దేవుని అనుగ్రహమే ఉంది. దృఢదీక్షతో సాగే అంతర్ముఖ సాధన, ఆ తర్వాత లభించే ఆత్మానుభవం అంచెలంచెలుగా మనకు లభించే భగవంతుని అనుగ్రహమే. బడి నుంచి వచ్చే కొడుకు కోసం మిఠాయి తయారుచేసిన తల్లి ముందుగా విషయం చెప్పి వాడిని ఊరిస్తుంది. ఆ తర్వాత వాడు మిఠాయి కావాలని మారాం చేసేలా మురిపిస్తుంది. చివరకు తానే ఆ మిఠాయిని వాడినోటికి అందించి సంతోష పెడుతుంది. మనపై తల్లిలా ప్రేమ చూపే ఆ దైవం కూడా అంచెలంచెలుగా జీవుడ్ని ఆత్మానందస్థితికి చేర్చి తనలో ఐక్యం చేసుకుంటాడు. 

✳️ *సాధనకు అవరోధంగా బలమైన వాసనావికారాలు ఉన్నాయి కదా?* అన్న ఒక భక్తుని ప్రశ్నకు భగవాన్ సమాధానం చెప్తూ... *'అవి ఈశ్వరునికంటే బలమైనవా!'* అని తిరిగి ప్రశ్నించారు. అన్ని కోర్కెలకు మూలం ఆత్మ చైతన్యమేనన్న అవగాహనతో విచారణా మార్గాన్నాశ్రయిస్తే ఏ వాసనలు మనసుని బంధించలేవు. ఇంట్లో టి.వి. ఉంటేనే కదా సీరియల్స్ ఎవరినైనా ఆకర్షించి బాధించగలిగేది. అసలు టి.వి. కొనాలన్న కోర్కెను విరమించు కోవడమే.

✳️ *మూలాన్ని పట్టుకోండి”* అనే భగవాన్ సందేశంలోని భావం. మెళకువలో దేహంతో కలిసి ఉంటున్న మన మనసు నిద్రలో తనకు తానుగా కేవలం దేహాన్ని వేదికగా చేసుకొని ఉంటుంది. సాధనతో మెళకువలో కూడా ఆ స్వచ్ఛమైన మనసును మనం అనుభవించగలగడమే ముక్తి.


        *ఓం నమోభగవతే శ్రీరమణాయ*


*సేకరణ:* 
✳️🌹🌹🌹🌹✳️🕉️✳️🌻🌻🌻🌻✳️

No comments:

Post a Comment