Wednesday, October 5, 2022

మనసు మాట కాదు… బుద్ధి మాట వినాలి!

 ix.X.     1-1.    041022-8.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


మనసు మాట కాదు…
               బుద్ధి మాట వినాలి!
               ➖➖➖✍️

శూరంగముడు మగధ సేనలో మంచి సైనికుడు. అతను సైనిక వృత్తి వదలి, భిక్షువుగా మారాడు. 

ఒక రోజు అతను రాజగృహ పట్టణంలో భిక్ష కోసం వెళ్ళాడు. బాగా దాహం వేసింది. ఒక ఇంటి ముందు ఆగాడు. ఆ ఇంటి ఇరుగు మీద అందమైన యువతి కూర్చొని ఉంది. అతణ్ణి చూసి, గౌరవంగా లేచి నిలబడి, నమస్కరించింది. అతను మంచినీరు అడిగాడు. 

చూడగానే ఆమె అంత అందగత్తె అని అతనికి అనిపించలేదు. నీరు అందించినప్పుడు ఆమె చేయి అతనికి తగిలింది. అతని చిత్తం చలించింది. అప్పుడు ఆమె చాలా అందగత్తెగా కనిపించింది.

చూపునకు తడబడని అతని మనసు స్పర్శకు తడబడిందని గుర్తించి- “భంతే! జ్ఞానేంద్రియాల గురించీ, వాటి జ్ఞానాల గురించీ నాకొక అనుమానం ఉంది. అడగమంటారా?” అంది నమ్రతగా.

అడగమన్నట్టు తల ఊపుతూ, అరుగుమీద కూర్చున్నాడు.

వేడి బెల్లాన్ని నాలుక మీద పెట్టుకున్నప్పుడు ముందుగా కలిగేది రుచి జ్ఞానమా? స్పర్శ జ్ఞానమా?” అని ఆమె అడిగింది.

శూరంగముడు ఆలోచనలో పడ్డాడు.

”నాలుక రసేంద్రియమా? స్పర్శేంద్రియమా?’’ అని అమె అడిగింది మళ్ళీ.

ఏమీ చెప్పలేక మౌనంగా లేచి వచ్చేశాడు శూరంగముడు. ఆమె తెలివితేటలకు ముగ్ధుడయ్యాడు. అతని చిత్తం మరింత చలించింది. కానీ, 8 ఏళ్ళ భిక్షా జీవితం, అధ్యయనం అతని ఆలోచనలను కట్టడి చేస్తున్నాయి. మనో సంఘర్షణతో చాలాసేపు నిద్ర పట్టలేదు. అర్థరాత్రి దాటాక నిద్రలోకి జారుకున్నాడు.

శూరంగముడు కోరుకున్నట్టే ఆమె అతనికి దక్కింది. ఆమె చేయి పట్టుకొని, అడవిలో నడుస్తున్నారు. అతని నెత్తిమీద పెద్ద గంప ఉంది. మొలకు ఉన్న ఒరలో బలమైన కత్తి వేలాడుతోంది. గంప బరువుకు తోడు కత్తి బరువు. భారం తగ్గించుకుందామని ఒరను విప్పి, కత్తితోపాటు ఆమె చేతికి ఇచ్చాడు. వారు అడవి మధ్యకు చేరగానే, దొంగల గుంపు ఒకటి ఎదురైంది. దొంగల నాయకుడు వారి ముందుకు వచ్చి, గద్దిస్తూ నిలబడ్డాడు. వాడు బలశాలి. అందమైన వాడు. ఆమె చూపు అతని మీద పడింది.

శూరంగముడు వెంటనే గంప దించుకొని “కత్తి ఇటు ఇవ్వు!”   అని సుందరిని అడిగాడు. ఆమె కత్తి ఒరను శూరంగమునికి ఇచ్చి, కత్తిని దొంగల నాయకుడికి ఇచ్చింది. వాడి పక్కకు చేరి, నవ్వసాగింది. వాడు కత్తి దూసి, శూరంగముని తలను ఒక్క వేటుకు తెగనరికాడు.

శూరంగముడు ఒక్కసారిగా తుళ్ళిపడి లేచాడు. గొంతు ఎండిపోయింది. తనకు తెలియకుండానే కేకలు పెట్టాడు.

పక్కన ఉన్న భిక్షువులు నిద్ర లేచి-“ఏమైంది?”అని అడిగారు.

“కల వచ్చింది!” అన్నాడు శూరంగముడు.

”పీడకలా?” అని వారు అడిగారు.

”కాదు, కాదు. పీడను వదిలించే కల!”అన్నాడు. ఆ తరువాత అసలు విషయం చెప్పి- “నా కల నా మనసులోని జాడ్యాన్ని వదిలించింది. మురికిని కడిగేసింది. ముళ్ళను తొలగించింది. నా కలే నాకు గురువుగా ఉపదేశం చేసింది”అన్నాడు చిరునవ్వుతో.✍️

.                      🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

No comments:

Post a Comment