Sunday, October 16, 2022

పాపం.. ప్రాయశ్చిత్తం.. పశ్చాతాపం.....

పాపం.. ప్రాయశ్చిత్తం.. పశ్చాతాపం.....

"పూర్వ జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితాం"...

పూర్వ జన్మలో మనం చేసిన పాపం, రోగం రూపములో అనుభవములోనికి వస్తుంది, అని శాస్త్ర వచనము. పూర్వ జన్మలో మనము చేసిన పాప పుణ్యములను బట్టి, మన జన్మ వుంటుంది. మన జాతక చక్రం తదనుగుణంగా తయారు అవుతుంది. మన కర్మే, గ్రహాల రూపములో వచ్చి, మనల్ని బాధ పెట్టడమో, లేదా సుఖ పెట్టడమో, జరుగుతుంది. అనవసరంగా గ్రహాలను తిట్టుకొంటాము మనము. ఆ గ్రహాలు కూడా ఎదో మనిషి రూపములోనో, లేదా రోగాల రూపం లోనో వచ్చి, మానవులని బాధ పెడుతుంటాయి.

మరి పాపం అంటే ఏమిటి... చెడు కర్మ, చెడు పని పాపం అన్నారు. మరి చెడు పని అంటే... శాస్త్ర వచనమునకు తద్భిన్న మైనది, విరుద్ధ మైనది. అంటే ఒక జీవి పట్ల అనుచితముగా ప్రవర్తించడం.

ఉదాహరణకు... ఒకర్ని తిట్టినాము, కొట్టినాము, అనరాని మాటలు అన్నాము, ఒక ప్రాణిని హింసించినాము. ఎదుటి వారిని బాధ పెట్టినాము, అన్యాయంగా ప్రవర్తించినాము, ఇతరులను మోసం చేయుట, దొంగతనము, ఇలా ఎన్నో చెప్పుకోవచ్చును.

🙏🙏🙏🙏🙏🙏

అవగాహన.....

ఒక వస్తువు స్థూలం అయిన కొద్దీ తెలుస్తుంది. సూక్ష్మం అయిన కొద్దీ తెలియకుండా పోతుంది. భూమి, నీరు, స్థూలం కనుక తెలుస్తుంది. అగ్ని కొంచెం సూక్ష్మం, కనుక తెలుస్తుంది. వాయువు ఇంకా సూక్ష్మం కనుక చర్మానికి తప్ప తెలియదు. ఆకాశం ఇంకా సూక్ష్మం. శబ్ధగుణం వల్ల తెలియాల్సిందే తప్ప ఇక ఏ ఇంద్రియానికి గోచరం కాదు.

పరమాత్మ ఆకాశం కన్నా సూక్ష్మాతి సూక్ష్మం కనుక ఏ ఇంద్రియానికి తెలియదు. బాహ్య దృష్టి గలవారు ఎన్నటికీ తెలుసుకోలేరు. అంతర్దృష్టితో మాత్రమే తెలుస్తుంది.

భగవంతునిపట్ల విముఖులై, ఆయన గురించి తెలుసుకోవాలనే ఆలోచన లేక, ఆయనకు సంబంధించిన పనులు చేయకుండా, నిరంతరం లౌకిక వ్యవహారాలలో మునిగిన వారికి పరమాత్మ చాలా దూరం. కోటి జన్మలకైనా సాధ్యం కాదు. అదే దూరస్థం. అలాగాక బాహ్య విషయాల పట్ల ఆసక్తిని విడిచి, ఆ పరమాత్మను అందుకొనుటే ప్రధానంగా భావించి, శ్రవణ, మనన, నిధి ధ్యాసనల ద్వారా నిరంతరం సాధనలతో ఉండేవారికి పరమాత్మ దగ్గర. ఒక్క జన్మ చాలు.

🙏🙏🙏🙏🙏🙏

సేకరణ

No comments:

Post a Comment