Friday, October 21, 2022

పరనిందతో - ప్రమాదం

 181021-6.✅      191022-8
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

        పరనిందతో - ప్రమాదం
                 ➖➖➖✍️

ఒకరోజు శ్రీకృష్ణుడు, గోపబాలురు యమునా తీరమున ఆడుకుంటున్న సమయంలో బకాసురుని సోదరుడైన అఘాసురుడు అక్కడికి ఒక పెద్ద కొండచిలువ రూపంలో వచ్చాడు.

నోటిని తెరిచి శ్రీకృష్ణుణ్ణి మింగేయాలని ఎదురు చూస్తున్నాడు. అఘాసురుడుని నోరు ఎంత పెద్దగా ఉందంటే పైపెదవి మేఘాలను, కింద పెదవి భూమిని తాకుతున్నాయి. 

అది గమనించక గోపబాలురు గోవులతో సహా పెద్ద కొండబిలం వలెనున్న అఘాసురుని నోట్లోకి వెళ్లిపోయారు.

నందకిశోరుడు కూడా వారి వెంట అఘాసురుని నోట్లోకి వెళ్లాడు.

అది గమనించిన అఘాసురుడు వెంటనే నోరు మూసేసాడు. 

లోపల విషవాయువుల ప్రభావం చేత గోవులు, గోపబాలురు అస్వస్థతకు గురయ్యారు.

అప్పుడు శ్రీకృష్ణుడు అఘాసురుని నవరంధ్రాలను మూసి ఉదరం ఉబ్బేలా చేశాడు. 

ఫలితంగా అఘాసురుడు పొట్టపగిలి మరణించాడు.

పొట్టలో నుంచి గోవులు, గోప బాలురు బయటపడ్డారు.
 
అఘాసురుని వృత్తాంతము: 

శంఖుడనే రాక్షసుని కుమారుడు అఘాసురుడు. అతడు సుందరాంగుడు. యవ్వనుడు, బలిష్ఠమైన దేహం కలవాడు. కాని పరులను నిందించే స్వభావం ఉంది. 

అఘాసురుడు ఒకసారి అష్టావక్ర మహర్షిని చూసి ‘ఇన్ని వంకరలేమి’ అని హేళన చేశాడు.

ఆ మాటలు విన్న మహర్షి ‘ఓరీ! వంకరలని హేళన చేసిన నీవు సర్పరూపమును ధరింతువు’ అని శపించాడు.

చేసిన తప్పును మన్నించమని అఘాసురుడు మహర్షిని వేడుకున్నాడు.

అప్పుడు మహర్షి ‘నాయనా! పరనింద మృత్యువు వంటిది.      మనము అనవసరముగా ఎవరినైనా నిందిస్తే, వారి పాపములో సగం మనకు వస్తుంది. అంతేకాకుండా మనం ఎంతో కష్టపడి ఆర్జించుకున్న పుణ్యంలో సగం అతనికి వెళ్లిపోతుంది. కాబట్టి అనవసరంగా పరనింద చేయకూడదు. నీవు చేసిన తప్పుకు పశ్చాత్తాపం చెంది పాపఫలం అనుభవించిన తరువాత ద్వాపర యుగంలో శ్రీకృష్ణపరమాత్మ కృపచే ముక్తిని పొందుతావు’ అని అన్నాడు. 

అలా అఘాసురుడు సర్పరూపం ధరించి శ్రీకృష్ణుని చేతిలో విముక్తిని పొందాడు.✍️

.                      🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

No comments:

Post a Comment