Friday, October 21, 2022

వాక్ సంయమనం

 V.x2. 1-5.    201022-7.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


             వాక్ సంయమనం
                 ➖➖➖✍️

అజ్ఞానాంధకారాన్ని తేజస్సు    ఎలా తొలగించి జ్ఞానకాంతులు వెలిగిస్తుందో అలాగే వాక్కు వలన కూడా అజ్ఞానం తొలగి జ్ఞానం పెరుగుతుంది. మనలో జడత్వము నశించి, చైతన్యం చిగురిస్తుంది.

అందువలన అటువంటి  వాక్కులే మనుషులకు భూషణాలుగా బాసిస్తాయి. బంగరు భుజకీర్తులూ, ముత్యాల హారాలు  శరీరాన్ని మాత్రమే అలంకరిస్తే, మనిషి వ్యక్తిత్వాన్ని అలంకరించేది వాక్కు మాత్రమే అని చెబుతారు.

వాక్కు నిజమైన ఆభరణం వంటిది. నిత్యం ఉద్వేగం కలిగించకుండా సత్యంగా, ప్రియంగా హితంగా మాట్లాడటం ముఖ్యం. వాక్పారుష్యము మహాదారుణమైన విషము కంటే, అగ్ని కంటే ప్రమాదమైనది.

ఆ వాక్ సంయమనం లేకనే దుర్యోధనుడు సభలో మహర్షులను అవమానించి శాపం పొందాడు. 

శరీరంలో నాటిన తీవ్ర శరాలను పెరికి పారవెయ్యవచ్చును. కాని, పరుషభాషణలు మాత్రం గుండెలో నుండి పైకి తియ్యలేము. అందుచేతనే విద్వాంసులు కటువుగా భాషించరు.

దేవతలు ఎవరికి పరాజయం కోరుతారో వారి బుద్ధిని ముందుగా హరిస్తారు. అంతటితో వాడు దుష్కర్మ రతుడవుతాడు. వినాశకాలం సమీపించినప్పుడే బుద్ధి నశిస్తుంది. అన్యాయం ప్రవేశిస్తుంది. మానవుడు తన్ను ఇతరులు తిడుతున్నా సరే తిరిగి శపించరాదు. దానిని సహించినచో తిట్టువానిని వానికోపమే కాల్చివేస్తుంది. తిట్టువాని పుణ్యము సహించినవానిని చేరుతుంది.

ఇతరులను నిందింపరాదు. అవమానింపరాదు. మిత్రులకు ద్రోహము చేయరాదు. తనను తాను గొప్పవాడని భావించుకొనరాదు. నీచమైన నడవడి పనికిరాదు. క్రోధముతో కూడిన పరుషపు మాటను పలుకరాదు.

క్రోధమొక మనోవికారం. మానవుని హృదయంలో ఆరుగురు శత్రువులు ఉన్నారని పెద్దలంటారు. ఆ ఆరింటిని కలిపి శాస్త్రం "అరిషడ్వర్గ"మని పేర్కొన్నది. అంటే విరోధి అని అర్ధం.
 కామం..క్రోధం..లోభం..మోహం..మదం.. మాత్సర్యమనే గుణాలే అరిషడ్వర్గం. ఇందులో క్రోధం చాలా భయంకరమైనది. క్రోధం వలన మానవునిలోని మంచి చెడు నశిస్తాయి. క్రోధం వృధ్ధి చెందినప్పుడు క్షణికోద్రేకంతో చేసిన అకృత్యాలు ఎన్నో అనర్ధాలకు దారితీస్తాయి. జీవితాంతం కృంగదీస్తాయి. తరువాత ఏడ్చినా, మొత్తుకొన్నా జరిగిన నష్టం సవరింపబడదు.

పరుషపు పలుకులు, మానవుల ఆయువు పట్టులైన గుండెను, ప్రాణములను హరంచివేస్తాయి. కావున పరుషవాక్కులని తక్షణం విడిచిపెట్టాలి.

పరుష వాక్కులతో పుండును కెలికినట్లు బాధించువాడును, కఠినచిత్తుడును, ములుకుల వంటి పలుకులు కలవాడును, పలుకుల ములుకులతో జనులను హింసించు వాడును అగు నరుని హీనాతిహీనునిగా తలవాలి.✍️
.          సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.
                     ➖▪️➖

No comments:

Post a Comment