Thursday, February 5, 2026

 (530) (01.02.2026)

ఓ కోడలా! నీవు అడుగు పెడుతూనే అత్తమ్మా అని పిలిచినావు
అత్తమ్మ లోనే అమ్మని కూడా చూచుకున్నావు   
ఈ జన్మకి నీవు పిలిచిన పిలుపు చాలమ్మా
ఆ పిలుపు వినగానే నా జన్మ ధన్యమైనదమ్మా //

ఏ వార్త చదివినా అత్త-కోడలి మధ్య సఖ్యత లేదనే
పెళ్ళి అవగానే వేరు కాపురం పెడదామనే
ఆలుమగలు మాత్రమే ఉండాలని
ఎవరితోనూ కలిసి-మెలిసి ఉండకూడదని //

కానీ నీవు పిలిచే పిలుపులో తెలిసింది నీకు అటువంటి ఆలోచన లేదని
ఇది నీకు నిను కన్న వాళ్ళు నేర్పిన సంస్కారమని
ముందుగా నిను కన్న వాళ్ళకి చేతులెత్తి నమస్కరించాలి
కోడలిగా మా ఇంట అడుగు పెట్టిన నిను అభినందించాలి //

ఈ ఉమ్మడి కుటుంబంలో మన మంతా కలిసే ఉంటాము
అత్త – కోడలు అన్న బేధాన్ని చూపించకుంటాము
అందుకే పెళ్లై ఇన్నేళ్ళైనా పెద్ద కోడలు మాతో కలిసే ఉంది
ఆపై నీవు రాగానే చెల్లెలిగా భావించి నీకు స్వాగతం పలికింది //

రేపటి రోజు మేము ఉన్నా లేకున్నా మీరు కలిసే ఉండాలి
మీ అందరి మధ్య బంధం ఇలానే కొనసాగుతుండాలి
రేపటి రోజున ఇలాటి పరిస్ధితే మీకూ ఎదురు కావచ్చు
సమాధానం చెప్పడానికి తడబడవచ్చు //

నేటి అనుభవం రేపటి రోజున పనికి వస్తుంది
మీ జీవితాలను ఎంతో ఆనందంగా ముందుకు నడిపిస్తుంది
ఈ విషయాలను తోడికోడళ్ళు ఇద్దరూ మనసులో పెట్టుకోండి
మీకు వచ్చే కోడళ్ళకు తెలియపరచండి //

మధిర వెంకట రమణ, హైదరాబాద్

No comments:

Post a Comment