Thursday, February 5, 2026

 సత్యవాణి కుంటముక్కల: వడ్లగింజలో బియ్యంగింజ 

               ------
   
     "'ఒరేయ్ అబ్బాయ్ !నేను రేపు ఉదయాన్నే మన ఊరికి వెళ్ళదలచుకొన్నాను "అన్నారు ఆనందరావుగారు.
                    ఉరమని పిడుగులాంటి తండ్రి మాటకు అదిరి పడ్డాడు శ్రీనివాస్ .
                  ఏంజరిగిందంటూ కళ్ళతోనే లతను ప్రశ్నించాడు అతడు.
          ఏమో! అన్నట్లు లత భుజాలు కదిపింది.
                      '"వినపడిందా !నేను ఉదయాన్నే బయలుదేరతాను.మీరు అప్పటికి లేవరని ఇప్పుడే చెపుతున్నాను." ఇంక చెప్పవలసినది లేనట్లు అక్కడనుండి లేచి గదిలోకెళ్ళిపోయిన తండ్రివంక
అయోమయంగా చూసేడు శ్రీనివాస్ .
         రాత్రి గదిలోకి రాగానే ప్రశ్నిచాడతడు భార్యను '"మనవల్ల ఏదైనా తప్పు జరిగిందంటావా?
నువ్వు పొరపాటుగా ఏమైనా అన్నావా ?"అని భార్యను ప్రశ్నించాడు శ్రీనివాస్ .
                 '"నేనేమంటానండీ!అయినా ఆయన అనిపించుకొనేలాంటి మనిషా! ఎవరికీ ఏమాత్రం బాధకలిగించకుండా చక్కగా ప్రవర్తిస్తారు.చేతనైన సాయం చేస్తారు. ఇయన వచ్చిన ఈ పదిరోజులనుండీ ప్రాణానికి సుఖంగా వుంది.తెల్లారి పాలుతేవడం,తెల్లారకుండా వచ్చే నీళ్ళుపట్టడం,బాబిగాడిని స్కూలుకి తీసికెళ్ళడం,తీసుకురావడం,ముఖ్యంగా నేను ఆఫీసునుండి వచ్చేలోపు ముందుగా వచ్చెే బాబిగాడు ఏం పెత్తనాలు చేస్తున్నాడో అనే బెంగలేకుండా హాయిగా వుంది."
మావగారిచ్చే కోపరేషన్ ఏకరువు పెట్టింది లత.మావగారు వెళ్ళిపోతే కలిగే బాధ తనకే అన్నట్లుంది,
ఆమె మాటల్లో.
"ఆయన గదికి వెళ్ళి
అసలు ఏంజరిగిందో కనుక్కోండి"  అంది లత.ఉండి పోవడానికే వచ్చేనన్నమనిషి వారంరోజుల్లో
తిరిగి వెళ్ళిపోతానంటున్నారంటే ఏదో జరిగింది.
            అమ్మపోయాకా రమ్మన్నా రానన్న మనిషి తనంత తానుగా ఉండిపోవడినికే వస్తున్నానంటే ,శ్రీనివాస్ లత చాలా సంతోషించారు.ఆపల్లెటూళ్ళో ,లంకంత ఇంట్లో,పెద్దవయసులో
ఒక్కరూ వుంటున్నారన్న దిగులుపడేవారా భార్యాభర్తలు.
                 '"వెళ్ళండి వెళ్ళి విషయం ఏమిటో కనుక్కోండి,
తెల్లారాయన బయలుదేరాకా ఆపటం బాగుండదు. ఆయన ఆగరు కూడా '"మావగారి గదిలోకి శ్రీనివాస్ ని తరిమింది లత.
       శ్రీనవాస్ తండ్రి మంచంపై కూర్చొని, '"ఏం నాన్నా! ఎందుకు కోపం వచ్చింది?నేనేనా ,లతేనా మీ మనసు బాధించేమా?
ఉండిపోయేలా వచ్చేరని, ఇంట్లో పెద్దదిక్కుగా వుంటున్నారని సంతోషపడుతుంటే, మీ ఈ నిర్ణయంతో నేనూ లతా చాలా బాధపడుతున్నాం.తప్పు జరిగితే చెప్పండి నాన్నా!దిద్దుకుంటాం ప్లీజ్ !'"తండ్రి చేతులు పట్టుకు అడిగాడతడు.
             " మీరు తప్పుచేయడమేమిటిరా! మీ మొఖం.నాకోడలు అసలు చెయ్యదు.ఇంక నేను వెళ్ళడానికి కారణం అంటావా,
అక్కడ అమ్మ పోయాకా ఒంటరినన్న దిగులు నన్ను వేధిస్తోంది .కానీ మీరు ఎన్ని సార్లు రమ్మన్నా రాకపోవడినికి కారణం మీకు అడ్డమౌతానేమో
అనితప్ప వేరే కారణం లేదు. నా ఒంటరితనం బాధను చూసిన స్నేహితులు 
బంధువులు 'ముత్యాల్లాంటి కొడుకు కోడలు, రత్నంల్లాంటి మనవడిని పెట్టుకొని ఇక్కడ ఒంటరినని బాధ పడడం ఎందుకు?కొడుకింటికి వెళ్ళి హాయిగా మనవడితో కాలక్షేపంచెయ్యి అని అడగకుండానే సలహాలిస్తుంటే,బయలుదేరొచ్చేను. కానీ ఇక్కడకి వచ్చినా నా ,ఉదయం రెండుగంటలు ,సాయంత్రం పదినిముషాలు తప్ప నేను చేసేదేమీ లేదు.మీకా ఆఫీసులు
హడావిడి,బాబిగాడికా సాయంత్రం వచ్చినప్పటినుండి
టీ .వీ తప్ప వేరే లోకంలేదు.వాడికి ఎన్నో కథలూ కబుర్లూ చెపుదామనుకొంటే,వాడితో మాటలే వుండటంలేదు.వాడికి
ఆ టీ.వీ,ఫోనూ తప్ప తాతయ్య అఖ్ఖర లేదు,మీకా పగలంతా ఆఫీసులు, ఆఫీసునుంచొచ్చేకా లాపుటాపులు."చిన్నపిల్లాడిలా ఉక్రోషంగా మాట్లాడుతున్న తండ్రిని చూస్తే ఆయన బాధ అర్థమైయ్యింది శ్రీనివాస్ కి .
                 '"నాన్నా! మీ బాధ అర్థమైయ్యింది .రేపటి నుండి మీ మనవడు మీతో కాలక్షేపం చేస్తే చాలుగా,మీరు ఊరికి వెళతానని ఇకపై అనరుగా?'అలాగే మేముకూడా వీలున్నంతవరకూ  లాపుటాపుల్ని పక్కనవుంచడానికి ప్రయత్నస్తాం. సరేనా?మీరు వెళతానని అనరుకదా!"అడిగాడు కొడుకు.
"అంతే అంతే "అన్నట్టు  తలవూపారు ఆనందరావుగారు.
                   తండ్రి గదిలోంచి బయటకు వస్తూనే టీ.వీ కనెక్షన్ తీసేసి ,రిమోటు అటకమీదకు విసిరేసి శ్రీనివాస్ ,హాయిగా నిద్రపోతున్న కొడుకు బుగ్గపై ముద్దు పెట్టుకుంటున్న భర్తను
 "ఏమన్నారు మావగారు?" అని అడుగు తున్న భార్యకి  ఏమీ లేదోయ్ 'వడ్లగింజలో బియ్యపుగింజ''అన్నభర్త మాటలకు
అయోమయంగా చూసింది లత."ఏమైతే నీకెందుకు" నాన్న ఇక వెళ్ళరులే "అన్న మాటలు
ఆమె చెవులకు విందు చేశాయి. "హమయ్య!" అని హాయిగా నిట్టూర్చి నిద్రలోకి జారుకొంది లత.కొడుకుకి ఫోను అందకుండా చేయడంగురించి ఆలోచనలోపడ్డాడు శ్రీనివాస్.

               సత్యవాణి
                కాకినాడ

No comments:

Post a Comment