సండే స్పెషల్స్థితప్రజ్ఞత
- కనకదుర్గా లక్ష్మీరత్న
‘‘మామయ్యగారు పార్కులో వాకింగ్ చేస్తూ పడిపోయారు. నువ్వూ విశ్వం వస్తారా?’’ పొద్దున్నే ఏడు గంటలకు పిన్నత్త సత్యవతిగారు, కామాక్షికి ఫోన్ చేసి చెప్పారు.
‘‘అయ్యో, దెబ్బలేమైనా తగిలాయా అత్తయ్యా’’ అడిగింది కామాక్షి.
‘‘ఆఁ... మోచిప్ప కొంచెం కొట్టుకుపోయింది’’ అన్నారు.
చాలా ధైర్యంగా ఉండే ఆవిడ గొంతులో కొంచెం ఆందోళన చోటుచేసుకుంది. ఎందుకో కామాక్షి మనసు కీడు శంకించింది.
‘‘మామయ్య మాట్లాడుతున్నారా...’’ ఆదుర్దాగా అడిగింది.
‘‘లేదు. నేను పైన అద్దెకున్న వాళ్ళని పిలిచాను. అంబులెన్స్ కూడా వచ్చింది. మేము హాస్పిటల్‌కి వెళుతున్నాం. మీరు డైరెక్టుగా అక్కడికే వచ్చేయండి’’ అని హాస్పిటల్ అడ్రస్ చెప్పారు.
కామాక్షికి ఎందుకో భయం వేసింది. ఆదివారం అవడం చేత విశ్వం ఇంకా నిద్ర లేవలేదు.
‘‘లేస్తారా, దక్షిణామూర్తి మామయ్య వాకింగ్ చేస్తూ పార్కులో పడిపోయారట. బహుశా ఫ్రాక్చర్ అయ్యింటుంది. రెండు జతల బట్టలు కూడా సర్దుతాను. మనం అక్కడ అత్తయ్యకి తోడుగా ఉండాల్సి రావచ్చు. నేను స్నానం చేసి రెడీ అవుతాను. మీరూ చప్పున కానివ్వండి’’ గాభరాగా చెప్పింది.
స్నానం చేసి వచ్చి బట్టలూ అవీ సర్దింది. బయలుదేరుతుండగా సత్యవతిగారు ఫోన్ చేశారు. ‘‘బయలుదేరారా? తొందర లేదులే, బ్రేక్‌ఫాస్ట్ చేసి రండి. వాడు టెన్షన్‌తో డ్రైవ్ చేస్తాడేమో... ఆదుర్దా లేదు, నాకు మనుషులు తోడు ఉన్నారని చెప్పు. లక్ష్మికి కూడా ఫోన్ చేశాను, పది గంటల ఫ్లైట్‌కు టికెట్ దొరికిందట’’ చెప్పారు.
కామాక్షి మనసులో ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి. సత్యవతిగారు, విశ్వానికి స్వయానా పినతల్లి. దక్షిణామూర్తిగారు ‘ఇస్రో’లో సైంటిస్టుగా పదవీ విరమణ చేశారు. సత్యవతిగారు కాలేజీలో మాథ్స్ లెక్చరర్‌గా పదవీ విరమణ చేశారు. కిందటేడాదే యాభయ్యవ పెళ్ళిరోజు వేడుకలు ఘనంగా జరిపారు వారి ఇద్దరి కుమార్తెలు. పెద్దమ్మాయి అమెరికాలో, చిన్నమ్మాయి చెన్నైలో స్థిరపడ్డారు.
పిన్నత్తగారూ మామగారూ ఆదర్శ దంపతుల్లా అనిపిస్తారు కామాక్షికి. ఇద్దరూ ఒకరికొకరు ఎంతో చేదోడువాదోడుగా ఉంటారు. మూర్తిగారు, సత్యవతిగారికి ఇంటిపనుల్లో సాయపడితే, సత్యవతిగారు, మూర్తిగారికి బయటి పనుల్లో- అంటే బ్యాంకు పనులూ మొదలైన వాటికి తోడు వెళుతుంటారు. ఇద్దరూ ఒకే మాటపై ఉంటారు. ఆవిడ, భర్తకి అనుగుణంగా తనని తాను మలచుకున్నారనిపిస్తుంది కామాక్షికి. ఇద్దరిలోనూ చెక్కు చెదరని ధైర్యం. ఆటుపోటులకి కంపించిపోరు. మోహంలో ఏ విధమైన ఆందోళననీ ప్రదర్శించరు. ఏవైనా చిన్నచిన్న సమస్యలు ఉన్నా ఇద్దరూ కలిసి సామరస్యంగా పరిష్కరించుకుంటారు. పిల్లలకి కూడా చెప్పరు. ఎవ్వరినీ అనవసరంగా ఇబ్బంది పెట్టకూడదన్నది వారి సిద్ధాంతం. ఒక్కోసారి వారిద్దరికీ చిన్నా చితకా అనారోగ్యాలు వచ్చినా, ఊళ్ళోనే విశ్వం ఉన్నా చెప్పేవారు కాదు. కోలుకున్నాక చెప్పేవారు.
‘ఊళ్ళో ఉన్న వాళ్ళకు కూడా చెప్పకపోతే ఎలాగత్తయ్యా’ అని కామాక్షి కోప్పడేది.
‘మీరు వస్తే నాకు బాగానే ఉంటుందే! కానీ వాడు పిన్నికి బాగాలేదని ట్రాఫిక్‌లో ఇంతదూరం టెన్షన్‌తో డ్రైవ్ చేసుకుంటూ వస్తాడు. చిన్నచిన్న వాటికి మిమ్మల్ని ఇబ్బందిపెట్టడం నాకిష్టం ఉండదు. అవసరమైతే మిమ్మల్ని పిలవకుండా ఉండను కదా’ అంటారు.
అలాంటిది ఇప్పుడు ఫోన్ చేశారూ అంటే- మామయ్యకి ఎలా ఉందోనని అనుకుంటుండగా లక్ష్మి ఫోన్ చేసింది.
‘‘వదినా, మీరు హాస్పిటల్‌కి చేరేరా? డాడీ చనిపోయారు’’ అని ఏడుస్తూ చెప్పింది.
‘‘అయ్యో, ఎలా’’ విస్తుపోతూ అంది కామాక్షి. స్పీకర్ ఆన్‌లో పెట్టింది. విశ్వం కూడా విన్నాడు. మౌనంగా కారు డ్రైవ్ చేస్తున్నాడు.
‘‘మాసివ్ అటాక్ అట. అసలు డాడీ ఎంత హెల్త్ కాన్షస్, ఎంత డిసిప్లిన్డ్‌గా ఉంటారు. అంతా అయోమయంగా ఉంది. నా ఫ్లైట్ డిలే అయ్యింది, లేట్ అవుతుందేమో వచ్చేసరికి. మమ్మీ నార్మల్‌గానే మాట్లాడుతోంది. బహుశా బ్యాలన్స్‌డ్‌గా ఉండటానికి ప్రయత్నిస్తున్నట్లుగా అనిపిస్తోంది’’ గద్గద స్వరంతో అంది.
‘‘మేము దాదాపుగా వచ్చేశాం. నువ్వు అధైర్యపడకు. అమ్మకి తోడుగా మేము ఉంటాంగా’’ అని ధైర్యం చెప్పి ఫోన్ పెట్టేసింది కామాక్షి.
హాస్పిటల్ వచ్చింది. కారు పార్కు చేసి ఆదరా బాదరాగా వెళ్ళారు. వీళ్ళని చూడగానే సత్యవతిగారు, విశ్వం చేయి పట్టుకుని ‘‘బాబాయిని పంపించేశానురా’’ అన్నారు.
విశ్వం ఆవిడ చెయ్యి పట్టుకుని పక్కనే కూర్చున్నాడు.
‘‘రోజూలాగానే ఉదయం నాలుగు గంటలకు లేచార్రా. యోగా చేశారు. స్నానం చేసి, తన పంచె ఉతుక్కుని ఆరేసుకున్నారు. కాఫీ తాగి వాకింగ్‌కి బయలుదేరారు. నేను వంటింట్లో పని చేసుకుంటున్నాను. ఇంతలోనే మా కాలనీలోవాళ్ళే ఆయనని తీసుకువచ్చి సందు చివర పడిపోయారని చెప్పి, హాల్లో దివాన్ మీద పడుకోబెట్టారు. ‘ఎలా ఉంది’ అని అడిగితే, ‘బాగానే ఉన్నాను’ అని ముద్దముద్దగా మాట్లాడి కళ్ళు మూసుకున్నారు. ఆ తరవాత పైన అద్దెకున్న వాళ్ళని పిలిస్తే, అంబులెన్సుని పిలిచారు. డాక్టర్ చూసి ‘బ్రాట్ డెడ్, మాసివ్ అటాక్’ అన్నారు. ఏమిటోరా, అంతా క్షణాలలో జరిగిపోయింది’’ కథ చెబుతున్నట్లు చెప్పారు.
‘‘బాబాయ్ ఈ మధ్యనే టెస్టులు అన్నీ చేయించుకుని బాగున్నాయన్నారుగా. మరి సడన్‌గా ఈ హార్ట్ అటాక్ ఏమిటీ?’’ విస్మయంగా అడిగాడు విశ్వం.
‘‘అదేరా, ఎప్పుడేం జరుగుతుందో మనకి తెలియదు. బహుశా ఆయన చేయవలసిన కర్మలు అయిపోయి ఉంటాయి, వెళ్ళిపోయారు. ఏం చేస్తాం’’ అన్నారు.
‘‘పిన్నీ, కల్యాణికి కబురందిందా’’
అడిగాడు విశ్వం.
‘‘ఆఁ చెప్పానురా. వాళ్ళు టిక్కెట్లు చూసుకుంటున్నారు. రావడానికి రెండు రోజులు పట్టదూ? వాళ్ళు వచ్చే వరకూ ఉంచడం కష్టం. పైగా ‘నేను పోయాక కూడా నలుగురికీ ఉపయోగపడాలి. నా బాడీనీ కళ్ళనీ మెడికల్ కాలేజీకి డొనేట్ చేయండి’ అని తనతో వాళ్ళ డాడీ ఒకసారి అన్నారని గుర్తుచేసింది కల్యాణి. ఇందాక ఫోన్లో మాట్లాడినప్పుడు లక్ష్మితో కూడా ఈ మాట చెప్పాను. ‘డాడీ ఇష్ట ప్రకారమే కానిద్దాం’ అంది’’ అన్నారు.
ఇన్ని చెబుతున్నా ఆవిడ మోహంలో అలజడీ మాటల్లో ఆందోళనా కనపడలేదు. అన్నింటికీ అతీతంగా ఉన్నట్లు కనిపించారు.
‘‘ఎవరో ఒకరు ముందూ ఒకరు తరవాతా వెళ్ళాల్సిందే. ఆయన ముందు వెళ్ళిపోయారు. అది మన చేతుల్లో లేనిది. ఏడుస్తూ కూర్చుంటే జరగాల్సిన పనులు చూసుకోవాలి కదా. ఇప్పుడు మనం ఆయన ఇష్టప్రకారమే అన్నీ జరిపించాలి. మెడికల్ కాలేజీకి డొనేట్ చేయాల్సిన విషయం హాస్పిటల్ వారితో మాట్లాడు. ఆ పనులన్నీ ఇక వాళ్ళే చూసుకుంటారు. ‘ఐ డొనేషన్’ సంగతి నేను చెప్పేశాన్లే... ఎందుకంటే తొందరగా తీయాలి కదా. హాస్పిటల్ ఎదురుగా బోల్డు టిఫిన్ సెంటర్లు ఉన్నాయి. వాళ్ళు వచ్చేలోపు మీరిద్దరూ వెళ్ళి ఇడ్లీ తిని రండి. టిఫిన్ కూడా చేయకుండా పొద్దున్నే బయలుదేరి వచ్చారు. బాబాయికి అలా కడుపు మాడ్చుకుని కూర్చుంటే ఇష్టం ఉండదు.
నేను కూడా రెండు ఇడ్లీలు తిని మందులు వేసుకున్నాను. ఇదిగో పాపం వీళ్ళు తెచ్చిపెట్టారు’’ అని ఇంటి పైన అద్దెకున్న ఆయననీ ఆయన కొడుకునీ చూపించారు.
‘‘మా అబ్బాయీ కోడలూ వచ్చారు కదా, మీరు ఇంటికి వెళ్ళండి’’ అన్నారు వాళ్ళతో.
ఆవిడంత బ్యాలన్స్‌డ్‌గా మాట్లాడుతుంటే కామాక్షి ఆశ్చర్యపోయింది.
విశ్వం ‘‘పిన్నీ, నీకు కాఫీ తెస్తాను’’
అని వెళ్ళాడు.
‘‘అత్తయ్యా, మీరు హడావిడిగా వచ్చేశారు కదా. మందులు ఎక్కడివి... నిజంగా టిఫిన్ తిన్నారా?’’ అని అడిగింది కామాక్షి.
‘‘అంబులెన్సు వచ్చేలోపు బీరువాలోంచి క్యాష్ తీసుకుని నా బ్యాగ్‌లో కుక్కుకున్నాను. ఈయన మెడికల్ ఫైల్స్ కూడా ఇదిగో ఈ సంచీలో పెట్టాను. నా మందులు కొన్ని ఎప్పుడూ నా హ్యాండ్‌బ్యాగ్‌లో పెట్టుకుంటాను కదా, టిఫిన్ తిని వేసుకున్నాను. నేనేమీ అయిపోను కానీ, విశ్వం కాఫీ తెచ్చాక మీరిద్దరూ వెళ్ళి తిని రండి. ఆనక క్రతువులు మొదలైతే, పూర్తి అయ్యేసరికి సాయంత్రం అవుతుంది’’ అన్నారు.
‘ఇలాంటి పరిస్థితుల్లో మనిషికి కాళ్ళూ చేతులు ఆడవు. కానీ ఆవిడ అచేతనంగా అయిపోకుండా ఒక్కరూ ఎలా సమర్ధించుకున్నారో! ఆవిడ గుండె ధైర్యం, సమర్ధత గురించి అత్తయ్య ద్వారా విన్నాను. ఇప్పుడు చూస్తున్నాను’ అనుకుంది కామాక్షి.
విశ్వం ఆవిడకి కాఫీ తెచ్చి ఇచ్చాక, హాస్పిటల్ వారితో మాట్లాడి వచ్చాడు.
‘‘పిన్నీ, ఐ హాస్పిటల్‌వాళ్ళు వచ్చి కళ్ళు తీసుకుని వెళ్ళారు. ఇప్పుడు అంబులెన్సులో బాడీని ఇంటికి తీసుకువెళ్ళే ఏర్పాటు చేస్తారట. మనవాళ్ళు అంతా వచ్చి వెళ్ళాక, హాస్పిటల్‌కి ఇన్‌ఫార్మ్ చేస్తే, వాళ్ళు వచ్చి బాడీని మెడికల్ కాలేజీకి తీసుకువెళతారట. రిచువల్స్ చేసుకోండి కానీ బాడీ మీద పసుపు కుంకాలు లాంటివి వెయ్యొద్దని అన్నారు, ఎందుకంటే డొనేట్ చేయవలసినది కదా’’ చెప్పాడు.
విశ్వం హాస్పిటల్ ఫార్మాలిటీస్ పూర్తి చేశాక, ఇంటికి వచ్చారు. అంతలోనే చుట్టుపక్కలవారూ వచ్చారు. సత్యవతిగారు ఎలాంటి మనోవేదనా కనబరచకుండా పూస గుచ్చినట్లు వచ్చిన వారందరికీ ఉదయం నాలుగు గంటల నుండి ఏం జరిగిందీ ఓపికగా చెబుతున్నారు. మధ్యలో ఆవిడే విశ్వానికి పురోహితుడి నంబరు ఇచ్చి మాట్లాడమన్నారు.
కామాక్షి, విశ్వంతో ‘‘అత్తయ్యని చూశారా, ఎంత ధైర్యంగా ఉన్నారో? వాళ్ళిద్దరిదీ ఆదర్శ దాంపత్యం కదా. ఆవిడ కుదేలైపోతారేమో అనుకున్నాను. అంత నార్మల్‌గా మాట్లాడటం ఎలా సాధ్యం?’’ ఆశ్చర్యపోతూ అంది.
‘‘పిన్ని షాక్‌లో ఉంది. అందుకే అలా ధోరణిలో ఏకధారగా మాట్లాడేస్తోంది’’ అన్నాడు విశ్వం.
మనుషులు వస్తున్నారు. వచ్చిన వాళ్లంతా ‘అంత డిసిప్లిన్డ్‌గా ఉంటారు. ఆయనకి ఇలా జరగడం ఏమిటీ’ అన్నారు.
సత్యవతిగారు ‘‘అవును. ఆయన అన్నం కొలిచినట్లు తింటారు. చిరుతిండ్ల మాటే లేదు. రెండుపూటలా వాకింగ్ చేస్తారు.
తన బట్టలు కూడా తనే ఉతుక్కుంటారు. ఎవరిచేతా సేవ చేయించుకోకుండా వెళ్ళిపోవాలి అనేవారు. ఆయన కోరుకున్నట్లే జరిగింది’’ అన్నారు.
మధ్య మధ్యలో కామాక్షి ఆవిడకి కొబ్బరినీళ్లు ఇస్తూ ‘‘అత్తయ్యా, మీరింక మాట్లాడకండి. హైరానా పడిపోతున్నారు’’ అంది.
ఇంకో గంటకి లక్ష్మీ, వాళ్ళ ఆయనా వచ్చారు. లక్ష్మి వస్తూనే తల్లిని పట్టుకుని మౌనంగా ఏడ్చింది. అప్పుడు కూడా సత్యవతిగారి కంట్లోంచి ఒక్క బొట్టు కూడా రాలేదు.
‘‘ఊరుకో తల్లీ, డాడీ ఏ బాధాపడకుండా వెళ్ళిపోయారు. నేను ధైర్యంగానే ఉన్నాను’’ అని ఓదార్చారు.
తల్లీ కూతుళ్ళు- ఎవరు కుంగిపోయినా అవతలి వాళ్ళు అధైర్య పడతారని పంటి బిగువున దుఃఖాన్ని అదిమి పెట్టుకున్నారనిపించింది కామాక్షికి.
పురోహితుడు వచ్చాడు. ‘‘బాడీ డొనేషన్ కాబట్టి- ఒక కర్ర పుల్లకి మూర్తిగారి ఆత్మను ఆపాదించి, దానికే ఇక్కడ పూజ చేస్తాం. తరవాత దానికే దహనక్రియలు చేసి, భస్మాన్ని మూడవ రోజున కావేరీలో కలపాలి. నేను కూడా మీతో వస్తాను, అక్కడ కలిపే ముందు చిన్న పూజ ఉంటుంది’’ చెప్పాడు.
మెడికల్ కాలేజీవాళ్ళు వచ్చి అంబులెన్సులో బాడీని తీసుకువెళ్ళి పోయారు.
విశ్వం, సత్యవతిగారి అల్లుడు, పురోహితుడి వెంట క్రతువులు చేయడానికి వెళ్ళారు. సత్యవతిగారు బంధువులందరికీ ఫోన్‌లో విషయం తెలియజేస్తున్నారు.
లక్ష్మి, కామాక్షితో ‘‘వదినా, అమ్మ దుఃఖాన్ని బలవంతంగా లోలోపల దిగమింగుకుంటోంది. అలా బాధని అదిమి పెట్టుకుంటే అది ఏ గుండె నొప్పికో దారి తీస్తే ఎంత ప్రమాదం’’ అంది భయంగా.
‘‘అవును. గుండెలోని బాధని బైటకి వెళ్ళగక్కేస్తే మనసు తేలిక పడుతుంది. బహుశా అత్తయ్య, మామయ్య లేరనే వాస్తవాన్ని గుర్తించడానికి మనస్కరించక, గాంభీర్యంతో కప్పి పుచ్చడానికి ప్రయత్నిస్తూ ఉండవచ్చు, లేదా ఆవిడ బాధపడుతుంటే పిల్లలు ఇంకా బేలగా అయిపోతారని అలా నిబ్బరంగా ఉంటున్నారేమో. లేదంటే ఆవిడ వీటన్నింటికీ అతీతంగా ఉండే జ్ఞాని అయినా అయి ఉండాలి’’ అంది కామాక్షి.
క్రతువులకి వెళ్ళినవాళ్ళు ఇంటికి వచ్చారు. అందరి స్నానాలు అయ్యాయి. లక్ష్మి అందరికీ టిఫిన్లు ఆర్డర్ చేసింది. సత్యవతిగారు విశ్వాన్ని పిలిచి ‘‘ఈ రోజు క్రతువు నీ చేతుల మీదుగా జరిగింది. మిగతా తంతు కూడా నువ్వే నిర్వహించు నాయనా’’ అన్నారు.
‘‘అలాగే పిన్నీ, అన్నీ నేను చూసుకుంటాను. నువ్వు ఎక్కువ హైరానా పడకు. వెళ్ళి కొంచెంసేపు పడుకో. మాట్లాడి మాట్లాడి బాగా అలసిపోయావు’’ అన్నాడు.
మర్నాడు ఉదయం అయిదు గంటలకి వంటింట్లో అలికిడి అయితే కామాక్షి లేచి వచ్చి చూసింది. లక్ష్మీ, సత్యవతిగారూ కష్టసుఖాలు మాట్లాడుకుంటున్నారు. కామాక్షిని చూసి సత్యవతిగారు ‘‘లేచావా... కాఫీ తాగుతావా?’’ అన్నారు. ఆవిడ చక్కగా స్నానం కూడా చేసేశారు. కామాక్షి అవాక్కయ్యింది. ఆవిడ ముందు రోజు అసలేమీ జరగనట్లే ఉన్నారు.
కామాక్షి కాలకృత్యాలు తీర్చుకుని వచ్చింది. ఈలోగా విశ్వం కూడా లేచి కాఫీ తాగుతున్నాడు. సత్యవతిగారు ఆ పూట టిఫిన్, భోజనాల ఏర్పాటు కోసం కేటరింగ్ వాళ్ళకి ఫోన్ చేస్తున్నారు. కామాక్షికి అంతా దిగ్భ్రమగా ఉంది. అశుభం జరిగినచోట ఎక్కడా ఇంత నిశ్శబ్ద వాతావరణాన్ని ఎప్పుడూ చూడలేదు.
విశ్వం ‘‘పిన్నీ, ఏమైనా పనులుంటే నాకు చెప్పు. నువ్వు రెస్ట్ తీసుకో’’ అన్నాడు.
లక్ష్మీవాళ్ళ ఆయన ‘‘ఆవిడ పనుల్లో తనని తాను ఎంగేజ్ చేసుకుంటున్నారు’’ అన్నాడు. ఇంక విశ్వం ఊరుకున్నాడు.
మూడవ రోజున కల్యాణి కుటుంబం కూడా అమెరికా నుండి వచ్చారు. కల్యాణి, తల్లిని పట్టుకుని ఒళ్ళు కదిలిపోయేలా ఏడ్చింది. సత్యవతిగారు కల్యాణి వీపు తడుతూ మౌనంగా ఓదార్చారు. కావేరీలో కలిపే తంతు కోసం అందరూ వెళ్ళారు. కామాక్షి మాత్రం సత్యవతిగారికి తోడుగా ఇంట్లోనే ఉంది.
సత్యవతిగారు, మూర్తిగారు ఉన్నప్పుడు ఎలా పనులు చేసుకునేవారో, ఇప్పుడు కూడా అలాగే పనులు చేసుకుంటున్నారు. ఆవిడలో కానీ, ఆవిడ దినచర్యల్లో కానీ ఏ మార్పూ లేదు. పైగా ఇంట్లో పిల్లల సందడి, మనవళ్ళతో కాలక్షేపం, క్రతువుల కోసం వచ్చే బంధువుల ఏర్పాట్లతో ఆవిడకి చాలా బిజీగా గడిచిపోతోంది. అయినా రోజుకొకసారైనా ‘ఆయన బ్రేక్‌ఫాస్ట్ తినకుండానే వెళ్ళిపోయారు’ అనేవారు. ‘డాడీకి, ఇలా వండితే కూర నచ్చుతుంది’
అని పిల్లలతోనూ, ‘మీ బాబాయికి నీలానే పచ్చళ్ళు అంటే ఇష్టం రా’ అని విశ్వంతోనూ చెబుతున్నారు.
పదవరోజు వచ్చింది. ధర్మోదకాలు ఇవ్వడానికి దగ్గర బంధువులూ మూర్తిగారి తోబుట్టువులూ అందరూ వచ్చారు. అందరూ ఒకటే మాట... ‘ఆరోగ్య సమస్యలు ఏవీ లేవు, అందుకే ఏ బాధా లేకుండా వెళ్ళిపోయాడు’ అని. మూడు రోజుల క్రతువులు కూడా ముగిశాయి. కల్యాణి తల్లితో ‘‘అమ్మా, ధీరజ్‌కి పరీక్షలు మొదలవుతాయి. నాకు సెలవు కూడా లేదు. వీలు చూసుకుని మళ్ళీ వస్తాను. ఎప్పటిలాగానే రోజూ వీడియో కాల్ చేస్తుంటాను. నువ్వు దిగులు పడకు. నీకు తెలుసుగా... డాడీకి దిగులు పడితే నచ్చదని. జాగ్రత్తగా ఉంటానని మాట ఇవ్వు’’ అని వాగ్దానం తీసుకుంది. లక్ష్మి మాత్రం తల్లి కొంచెం సెటిల్ అయ్యేంతవరకూ ఉంటానంది.
కల్యాణి కుటుంబం అమెరికా వెళ్ళిపోయారు. ఆ రాత్రి విశ్వం, కామాక్షి, లక్ష్మి కూర్చుని మాట్లాడుకుంటున్నారు.
విశ్వం ‘‘పిన్నీ, కొన్నాళ్ళు నువ్వు మా దగ్గర ఉంటే బాగుంటుంది. చెల్లాయిలకి నీ గురించి బెంగ లేకుండా ఉంటుంది. నువ్వు మా దగ్గర ఏమీ మొహమాట పడక్కర్లేదు. మా అమ్మ ఎంత స్వతంత్రంగా ఉందో, నువ్వు కూడా అంతే స్వతంత్రంగా ఉండవచ్చు’’ అన్నాడు.
‘‘నీ దగ్గర నాకు మొహమాటం ఏమిట్రా? నీ చిన్నప్పుడు నేనే నిన్ను పెంచితేను. యాభైయేళ్ళ దాంపత్యంలో ఒక్కసారిగా ఆయన మాయమైపోతే దిగులు లేకుండా ఎలా ఉంటుందిరా? ఆయన లేని లోటు భర్తీ చేయలేనిది. ఇద్దరం ఒకరికొకరం తోడుగా ఉండేవాళ్ళం. ఒకరి అభిప్రాయాలనొకరం కొట్టిపడేయకుండా గౌరవించుకునేవాళ్ళం. ఇప్పుడు ఆ తోడే లేకుండా పోయింది. అలా అని ఎవరూ ఎల్లకాలం ఉండరు. నేనైనా ఆయనైనా ఎప్పటికైనా వెళ్ళాల్సిందే. ఆయన పుణ్యపురుషుడు. ఏ బాధా లేకుండా, ఎవరిచేతా సేవ చేయించుకోకుండా వెళ్ళిపోయారు. ఒకవేళ నేనే వెళ్ళిపోయి, ఆయన ఉండాల్సి వస్తే ఆయన ఇబ్బంది పడేవారేమో. నేనైతే తోచకపోతే, వెళ్ళాల్సి వస్తే పిల్లల దగ్గరకి వెళతాను. ఆయనది అలా వెళ్ళే మనస్తత్వం కూడా కాదు.
ఆయన కర్మలన్నీ క్షయం చేసేసుకుని వెళ్ళిపోయారు. నాకు ఇంకా చేయవలసిన కర్మలు మిగిలి ఉండి ఉంటాయి. ఇప్పటికైతే ఒంట్లో ఓపిక ఉంది కదా. చుట్టుపక్కల పిల్లలకి ఫ్రీగా ట్యూషన్ చెబుతాను. నాకు ఎలాగూ పేపర్ చదవడం, టీవీలో సీరియల్స్ చూడటం అలవాటే కదా. మధ్య మధ్యలో మీరు వస్తుండండి. లక్ష్మి ఎలాగూ నన్ను చూసిపోవడానికి వస్తుంటుంది. దిగులుతో పిన్ని ఏమైపోతుందోనని నువ్వు దిగులు పెట్టుకోకు సరేనా’’ అని ధైర్యం చెప్పారు.
‘‘స్థితప్రజ్ఞత గురించీ స్థితప్రజ్ఞులకు ఉండవలసిన లక్షణాల గురించీ ఆ మధ్య ఓ ప్రవచనకర్త చెప్పారు. అందులో ఒక లక్షణం- సుఖదుఃఖాలని సమానంగా చూడటం. సుఖం వచ్చినప్పుడు పొంగిపోకుండా, దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోకుండా ఉండటమే స్థితప్రజ్ఞత. ‘రుషులకీ జ్ఞానులకీ మాత్రమే ఇది సాధ్యమవుతుంది కానీ, మనలాంటి సాధారణమైన మనుషులకి ఇదెలా సాధ్య’మని ఎప్పుడూ చెప్పేదాన్ని. స్థితప్రజ్ఞులు అంటే ‘కొండల్లోనూ కోనల్లోనూ ధ్యానం చేసుకునే జ్ఞానులు మాత్రమే’ అనుకునేదాన్ని. కానీ మీలాంటి సామాన్య గృహిణులు కూడా స్థితప్రజ్ఞులే అని ఇప్పుడు అర్థం అయింది. మామయ్య లేరనే వాస్తవాన్ని ఎంత హుందాగా అంగీకరించారు. మీరు భగవద్గీత చదవలేదు. ప్రవచనాలు కూడా వినరు.
మీకు ఇంతటి స్థితప్రజ్ఞత ఎలా అబ్బింది?’’ ఆశ్చర్యంగా అడిగింది కామాక్షి.
‘‘స్థితప్రజ్ఞత లాంటి పెద్ద పెద్ద పదాలు నాకు తెలియదు. మీ మామయ్య కంటికి కనిపించకపోతేనేం... ఆయన నాలోనే, నాతోనే ఉన్నారని భావిస్తాను. అప్పుడు ఆయన లేరనే భావనే కలగదు. కష్టసుఖాలు జీవితంలో భాగాలు. రెండూ అనుభవించక తప్పదు. బేలగా దిగాలుగా ఉంటే ఆయనకు నచ్చదు.
సరే, చాలా పొద్దుపోయింది. ఇంక వెళ్ళి పడుకోండి’’ అని తన గదిలోకి పడుకోవడానికి వెళ్ళారు.
‘‘పిన్నిని చూసి మనం ఎంతో నేర్చుకోవాలి. చిన్నచిన్న ఇబ్బందులకే మనం తలకిందులైపోతాం. జీవితాన్ని కుదిపేసే సంఘటనని కూడా తన మనోధైర్యంతో ఎంత అవలీలగా ఎదుర్కొంది’’ అన్నాడు విశ్వం.
‘‘అవును అన్నా, మమ్మీ ధైర్యంగా ఉంటే నాకూ అంత దిగులు ఉండదు’’ తేలికపడిన హృదయంతో అంది లక్ష్మి.
‘స్థితప్రజ్ఞత గీతా ప్రవచానాలకీ పుస్తకాలకే పరిమితం కాదనీ, ఇంటి నాలుగు గోడల మధ్య కూడా సాక్షాత్కరించవచ్చనీ అత్తయ్య ఎంత హుందాగా నిరూపించారు’ అనుకుంటూ భగవద్గీతలోని దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః!
వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే!!
శ్లోకాన్ని అప్రయత్నంగా మననం చేసుకుంది కామాక్షి.
31-01-2026 23:42 IST
No comments:
Post a Comment