*_ఇదా హెడ్ లైన్.._*
*_మన "డెడ్" లైన్..!_*
_____________________
ఏం జరిగింది..
క్షీరసాగర మధనంలో
లక్ష్మీదేవి ఉద్భవించిందా..
అదే ప్రక్రియలో
వెన్నెలలు విరజిమ్ముతూ
నెలరాజు పుట్టాడా..
పుత్రకామేష్టి అనంతరం
పాయససేవన ఫలమ్ముగా
కౌసల్యా గర్భమున
రామయ్య అవతరించాడా..
ఏడుగురు చిన్నారులు
మేనమామ కంసుని
క్రౌర్యమునకు హతము కాగా
అష్టమ సంతానముగా
లోకాలను ఉద్దరింప
నల్లనయ్య అరుదెంచాడా..
మిధిలలో యాగభూమిని దున్నుచున్న జనకరాజేంద్రుని నాగేటి చాలులో నర్రలాగితే
పసిడి మందసమ్ములో
అందాల భరిణ సీత
భూజాతగా బయల్పడిందా..
ఈ విశేషాలను మించిన
అద్భుతం ఆవిష్కారమైందా
అచట..ఏంటో అంత గొప్ప ముచ్చట...!?
చిరంజీవికి మనవలు పుట్టారు..అంతే..!
తల్లి సీతమ్మ పుణ్యగర్భమున
కుశలవులు వాల్మీకి ఆశ్రమంలో పుట్టినప్పుడు
ఏ హడావిడీ లేదు...
ఈ కవలల
జనన సమయంలో
ఎంత హంగామా..
అదేదో అద్బుతం జరిగినట్టు..
1947 ఆగస్టు 14 అర్ధరాత్రి
భారతావనికి స్వతంత్రం ప్రకటించిన మహోన్నత ఘట్టం వీక్షణను మించిన తక్షణ కర్తవ్యమా..!
1971 లో పాకిస్తాన్ పై యుద్ధం గెలిచి బంగ్లా ఆవిర్భావానికి భారత ప్రభుత్వం అంకురార్పణ చేసిన చారిత్రక విజయమా..!
పోక్రాన్ అణుపరీక్షలను
దిగ్విజయంగా ముగించిన
మహత్కార్యమా..
కార్గిల్లో 1971 నాటి స్ఫూర్తిని
పునరావిష్కృతం చేస్తూ
దాయాదిపై మరో తీయని గెలుపు సాధించిన సువర్ణ ఘట్టమా..!
1983లో..2012లో క్రికెట్ ప్రపంచకప్..2007లో..
మళ్ళీ మొన్న 2024లో
బుల్లి కప్ మన దేశం సాధించిన గొప్ప విశేషమా..
ఇవేవీ కావు..
మరక్కడ ఎందుకు
మీడియా అక్కడ కావ్ కావు..
ఎటు పోతున్నాం మనం..
ఏం చూపిస్తున్నాం..
ఒక ఇంట్లో ఓ చిన్న విశేషం..
ఆ ఇంటికి..బంధువులకు మాత్రమే సంబందించిన అంశం.. మహాఅయితే అభిమాన నటుడి ఇంట గనుక జనాలకు కొంత ఆసక్తి..
కానీ మొత్తం మీడియా..
అదేదో ప్రధాని పర్యటనలా..
ముఖ్యమైన ప్రకటన జరుగబోతున్నట్టు..
కొంపలు మునిగిపోయే సమస్య అక్కడ ఆవిష్కారం అయినట్టు..
దేశం ఇంతకు మునుపెన్నడూ ఎరగని విశేషం చోటు చేసుకున్నట్టు..
ఇంతకు ముందు కూడా ఇలాగే..
ఉపాసన గర్భం దాల్చింది మొదలు..
ఒక్కో నెల గడవడం..
ప్రసవానికి సమయం దగ్గర పడడం..
పిల్ల పుట్టిందని..
కేరు కేరు మందని..
చూసిందని.. నవ్విందని ..
తాతా బాగున్నావా..
ఏం తాతా బాగున్నావా..
అని చిరంజీవిని అడిగిందని..
నాగబాబు వచ్చాడని..
పవన్ ఇంకా రాలేదని..
పుట్టిన పాప మొదటిసారి చిచ్చి పోసిందని..
క్యాకు ఫలానా రంగులో ఉందని..
ఇంటికి వచ్చిందని..
ఆ సమయంలో ఇల్లు అలంకరించారని..
ఇంట్లో వాళ్ళు పెట్టకముందే
*_మెగా ప్రిన్స్_*
పేరు ఖరారు చేస్తూ
అదెంత తకరారు..
మీడియా..తగునా ఇంత
ఉత్సాహం..
ఇది ఒక రకం ఉత్పాతం..
ఇంకో రకం ఉన్మాదం..!
*_ఈఎస్కే.._*
No comments:
Post a Comment