అంతేలే అదంతేలే
(ప్రభాకర్ పెదపూడి)
చలికి కాబోలు చెట్లు కదలకుండా ముడిచిపెట్టుకున్న ముసలాడిలా ఉన్నాయి. మాణిక్యం కప్పుకున్న రగ్గు అవసానదశలో ఉందని చలికి తెలుసు, అందుకే ఎప్పుడు లోపలకు దూరదామా అని కాచిబెట్టుకుంది. మాణిక్యం నిద్రలో రగ్గుని తలమీదకి లాక్కున్నాడు. కాళ్లదగ్గర సందుదొరికేసరికి చలితోపాటు, గుప్పెడు దోమలుకూడా రగ్గులోకి దూరాయి. ఇక నిద్రపోవడం వాడి తరంకాలేదు, అటుఇటూ దొర్లి గబుక్కున లేచి కూర్చున్నాడు. ‘‘మాయదారి దోమలు, నిద్రలేకుండా చేసాయి’’ అనుకుంటూ రగ్గును జాగ్రత్తగా మడతపెట్టి రేకు పెట్టెమీద పడేసాడు. ఖాళీపెట్టెకదా దబ్బుమని చప్పుడైంది. పాకలోంచి బయటకివచ్చి అరుగుమీద గోడకు జారబెట్టిన తడక, తలుపుస్ధానంలో గుమ్మానికి అడ్డంగా పెట్టాడు. గుమ్మందగ్గర తడక ఎంత భద్రమో మాణిక్యానికి తెలుసు అయినా అదో తృప్తి. మాణిక్యాన్నిచూసి మట్టి అరుగుమీద గోడవారగా పడుకున్న నల్లకుక్క విశ్వాసం లేదనుకుంటారని మర్యాదపూర్వకంగా తోకూపి మళ్ళీ ముడుచుకు పడుకుంది.
మాణిక్యం దొరగారింట్లో చిన్నతనంనుండి నౌకరు. ఆచుట్టుపక్కల పది పదిహేను గ్రామాల్లో దొరగారంత డబ్బుచేసినోడు మరోడు లేడు. దొరగారు ఊరుమీదకి బయల్దేరాడంటే వెంట మాణిక్యం ఉండాల్సిందే, దొరగారు దీపావళి లక్ష్మీ టపాకాయ ఐతే, మాణిక్యం వత్తిలాంటోడు. ఇంతెందుకు మాణిక్యంవెంట లేనిదే ఆయన అడుగు బయటపెట్టరు. దొరగారు వెండిగ్లాసుతో కాఫీతాగి గ్లాసు బల్లమీదపెట్టి ‘‘ఒరేయ్! మాణిక్యం అలా షికారెళ్ళోద్దాం రా! ’’ అన్నారు. పదినిమిషాల్లో మాణిక్యం దొరగారిముందు ఉన్నాడు, వాడి భుజాన కాఫీప్లాస్కు, ఐదారువరకు చుట్టలున్న వెండి భరిణ, మీటనొక్కితే పుటుక్కున తెరుచుకునే గొడుగు పట్టుకు నిలబడ్డాడు.
ఇద్దరూ నడుస్తున్నారు. ఆరడుగులున్న దొరగారికి ఎండతగలకుండా ఐదున్నరడుగులున్న మాణిక్యం గొడుగు పట్టాలంటే కాస్తంత శ్రమపడాల్సిందే, జబ్బలాగేస్తున్నా పట్టుకోవాలి తప్పదు. చిన్నతనంనుండి ఆయనదగ్గర నౌకర్నికదా, చివరాకర్న ఏదైనా ఇస్తాడేమోననే ఆశ మూటకట్టుకుని జాగ్రత్తగా మసులుకుంటున్నాడు మాణిక్యం. ‘‘ ఉరేయ్! ఊరంతా యమా కళకళలాడిపోతోంది, ఏంటి కత! ’’ దొరగారు చుట్టవెలిగిస్తూ అన్నారు. ‘‘ ఆ ఏముందండి ఇంకోనెల్లో సంక్రాంతి కదండీ! అల్లుళ్ళొచ్చి శుబ్బరంగా ఉన్న నాలుగు డబ్బులు ఊడ్చుకెళ్ళి పోతారు కదండీ! ‘‘పదిపదిహేనురోజుల్లో మాఆయనతోపాటు వస్తాం, కూసింత కానుకలు పోగుచేయండి’’ అనిచెప్పిపోడానికి పై ఊళ్ళల్లో ఉన్న కూతుళ్ళంతా సొంతూరొచ్చారండీ, అదీ కత ’’ చెప్పడం ఆపి వెకిలిగా నవ్వాడు మాణిక్యం, దొరగారుకూడా చిరునవ్వులు నవ్వారు. ‘‘ఒరేయ్! మాణిక్యం ఈరోజు చెరువుగట్టుమీదకి షికారెల్దాంరా! దమయంతినిచూసి చాలా కాలం అయింది’’ చుట్టని కిందపడేసి కాలితో నలిపేస్తూ అన్నారు దొరగారు.
రాజుగారికి రాణివున్నా భవనంలో రమణులకు కొదవలేనట్లు, దొరగారికి బంగారంలాంటి భార్యవున్నా సరదాపుట్టినప్పుడు ఇలా చెరువుగట్టుమీద దమయంతి ఇంటిలో మకాంవేస్తారు. ఇది ఊరంతటికీ బహిరంగ రహస్యమే! దమయంతిలాంటి అందగత్తె ఆచుట్టుపక్కల ఊళ్ళల్లో నాస్తి అని దొరగారి అభిప్రాయం. దొరగారు సరిగా చూడకగానీ రాణీగారే దీనికంటే అందగత్తె అని ఊరాడోళ్ళంతా చెవులు కొరుక్కొవడం కద్దు. దొరగారు చెరువుగట్టు ఎక్కగానే దమయంతి అంతరాత్మ విషయం పసిగట్టి గుండెజల్లుమనిపించింది, వెంటనే దొరగారొచ్చేస్తున్నారని తెగయిదైపోయింది.
దమయంతి ఇంటి ముందుకి రాగానే, అంతవరకు దొరగారికి ఎండతగలకుండా పట్టుకున్న గొడుగు ముడిచి గోడవారన పెట్టి, చుట్టల భరిణె దొరగారి చేతికందించి ‘‘నేను మళ్ళీ సాయంత్రం వొత్తానండి’’ అన్నాడు మాణిక్యం. ‘‘ఒరేయ్! మాణిక్యంగా! నీకు బుద్ది రావాలని వినాయకుడి గుడిలోకి వెళ్ళి ప్రార్ధించుకో, ముందసలు చిన్నరాణీగారు లోనవుందోలేదో తెలుసుకోరా’’ చిరాగ్గా అన్నారు దొరగారు. మాణిక్యం గబుక్కున లోనకెళ్ళి, అసలు దొరగారంటే ఎవరో తెలియనట్లు నటించేస్తున్న దమయంతిని, ముసిలితనం ముంచుకొస్తున్నా ముసిముసినవ్వులు మానని దమయంతి తల్లినిచూసి, ‘‘లేకేమండి! ఉన్నారండి, తమర్ని లోనికి దయచేయమన్నారండి’’ వ్యంగాన్ని రంగరించి, అతి చనువును ప్రదర్శిస్తూ అన్నాడు మాణిక్యం. ‘‘సగంకాల్చిన చుట్టని గేటు పక్కన పడేసి’’ లోపలికి ఠీవిగా నడిచారు దొరగారు.
దొరగారు ముందుగదిలో సోఫాలో కాలుమీద కాలేసుకుని దమయంతి గురించి ఎదురుచూస్తున్నారు. అరగంట తర్వాత దమయంతి బదులు తల్లి వచ్చి మంచి నీళ్ళ గ్లాసు అందిస్తూ ‘‘ దొరవారు ఈమధ్యమరీ నల్లపూసైపోయారు ’’ లేటువయస్సులో సిగ్గును అభినయిస్తూ అంది. ముసలిదాని సిగ్గుచూసి దొరగారికి చిరాకొచ్చి చేతిలో నీళ్ళగ్లాసు పెరట్లోకి విసిరేసారు. ఈ హఠాత్ పరిణామానికి దమయంతి తల్లి పరుగులాంటి నడకతో నిష్క్రమించింది ‘‘ క్షణంలో దమయంతి ప్రత్యక్షమైంది’’ అంతవరకు గుగ్గిలంలావున్న దొరగారు, దివినుంచి సర్రున భువికి జారిన రంభలావున్న ఆమె అందాన్నిచూసి మంచుముక్కైపోయారు. బెల్లంపాకంలో దిబ్బరొట్టి నంజుకుతిన్న ఫీలింగొచ్చేసింది.
కాసేపు ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నాక పడగ్గది తలుపులు మూతపడ్డ మరుక్షణం దమయంతి కళ్ళల్లో కన్నీటి చెరువు గట్టు తెగిపోయింది, చిల్లుపడ్డ కుండలోంచి నీళ్ళు కారిపోయినట్లు కన్నీళ్ళు బొటబొటా కారిపోతున్నాయి. దమయంతి చీరకొంగు కన్నీటిని పీల్చలేక ఉక్కిరిబిక్కిరౌతోంది. గారంగా దమయంతిని దగ్గరకు తీసుకుంటూ ‘‘ దమ్మూ!’’ అన్నారు దొరగారు. దమయంతికి ఇంకా ఏడుపొచ్చేసింది, దిండులో తలదూర్చి కుళ్ళికుళ్ళి ఏడ్చింది. విషయాన్ని కనిపెట్టిన దొరగారు ‘‘ ఇదిగో! మీ అమ్మమీద చిరాకు పడ్డందుకు శిక్షగా ఇదిగో ఈ ఉంగరం ఉంచు ’’ అంటూ బొటనవేలికి పెట్టుకున్న బండలాంటి ఉంగరం దమయంతి కొంగుకు కట్టారు. దొరగారికి తనమీదున్న ప్రేమను మోయలేక ఆయన ఒళ్ళో ఒరిగి కరిగిపోయింది దమయంతి.
‘‘అయ్యగారు గతంలో పదిలక్షలు ఇస్తానని ఒట్టేసారు, బహుశా మరిచిపోయారేమో! ’’ మంచి సమయంచూసి ఆయన ముదురుబుగ్గమీద వేలితో గుండ్రాలు చుడుతూ అంది దమయంతి. ‘‘ పదికేం ఖర్మ పాతికిస్తాను, దేని కైనా టైమురావాలిరా దమ్మూ! ’’ దమయంతి బుగ్గమీద చిటికేసి అన్నారు దొరగారు. ‘‘ చీటికి మాటికి చిటికలు బాగానే వేస్తారు, డబ్బులే రాల్చరు’’ బుంగమూతి పెట్టి అంది. ‘‘ ఇదిగో నేను ఇవ్వకుండానే నీనడుంచుట్టూ ఈవడ్డాణం, మెడలో దిగేసుకున్న హారాలు, వేళ్ళకు ఉంగరాలు ఎక్కడనుండి వచ్చాయి. నాకు చిరాకు తెప్పించావంటే రేపు ఈపాటికి మాణిక్యంచేత పాతిక లక్షలు పువ్వుల్లో పెట్టి పంపించేస్తాను ’’ దమయంతిని దగ్గరకు లాక్కుంటూ అన్నారు దొరగారు, దమయంతి గుబురుల్లో దాక్కున్న సంపెంగలా దొరగారి గుండెలమీద వాలిపోయింది.
మాణిక్యం దొరగారి ఎదురుగా కూర్చుని చుట్టలు చుడుతున్నాడు. ఆయన వెండిగ్లాసుతో కాఫీ తాగుతున్నారు. అటువంటి సమయంలో ఇద్దరూ పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉంటారు. ‘‘ఒరేయ్! మాణిక్యం ఊరంతా మారిపోయిందిరా. కుర్రోళ్ళంతా పెద్దబళ్ళమీద బుర్రుబుర్రుమని చీటికిమాటికి కాకినాడ పోతున్నార్రా. ప్రతివాడిచేతిలో చేటంత సెల్లు, అది చెవులోపెట్టుకుని బళ్ళు ఒకటే తొక్కుడు, బొత్తిగా ప్రాణంమీద భయం లేకుండా పోయిందిరా ’’ చుట్ట వెలిగిస్తూ అన్నారు దొరగారు. ‘‘అవునండీ ! మొన్న మాబామ్మరిది రామిగాడి కొడుకు ఫోను మాట్లాడుతూ బండిని ఓతొక్కేస్తుంటే, అది పుసుక్కున రోడ్డుదాటి కాలవలోకి ఈడ్చేసిందండి, వెన్నెముక్కి దెబ్బతగిలి సంసార జీవితానికి పనికిరాడని చెప్పేసారండి, ఇప్పుడు కొంపలో పడక్కుర్చీలో కూలబడి సెల్‌మాట్లాడు కుంటున్నాడండి ’’ ఒకింత నవ్వుమొహంపెట్టి చెప్పాడు మాణిక్యం. ‘‘అంటే జీవితం దొబ్బినా ఆడు సెల్ మాట్లాడటం మానలేదన్నమాట’’ హాశ్చర్యపోయారు దొరగారు.
‘‘ఉరేయ్! మాణిక్యం నేను పూలబుట్ట ఇస్తాను, జాగ్రత్తగా పట్టికెళ్ళి చిన్నరాణిగారికి ఇచ్చిరా! ’’ రహస్యం చెప్పినట్లు చిన్నగా చెప్పారు. మాణిక్యం బుర్రూపి ‘‘అలాగేనండి, చెరువుగట్టుమీద రాణీగారే కదండి ’’ అన్నాడు. ‘‘ ఒరేయ్! నీఫేమ్లీ అంతా పూర్వంనుంచి నాకాడే పడున్నారుకాబట్టి నువ్వు బతికిపోతున్నావ్, ఇకమీదట సనువుతీసుకుని, ఎదవజోకులుకానీ వదిలావంటే, కదలకుండా చేసెయ్యగల్ను, నోరుమూసుకుని చీకట్లుముసురుకున్నాక, ఎవరూచూడకుండా ఎల్లొచ్చెయ్. పొరపాటున దానమ్మక్కానీ ఇచ్చావంటే వీపు విమానంమోత మోగించెత్తాను ’’ గట్టిగానే చెప్పారు దొరగారు. ‘‘పూలబుట్టకి ఇంత హడావిడెందుకో’’ సణుక్కున్నాడు మాణిక్యం.
దొరగారిచ్చిన పూలబుట్టపట్టుకుని దమయంతి దగ్గరకి బయలుదేరాడు మాణిక్యం. బుట్ట బరువుగానే ఉంది. పూలబుట్ట బరువుండటంతో చేతులు మార్చుకున్నాడు. ‘‘పెద్దవాళ్ళిచ్చే పూలు బరువుగా ఉంటాయి కాబోలు ’’ సరిపెట్టుకున్నాడు. సూర్యుడు పడమటింట్లోకి జారుకుని చాలా సేపయింది. ఏదో పనున్నట్లు చంద్రుడు గబగబా మునసుబుగారి మావిడితోటలోంచి పైకొచ్చేసాడు. నల్లటి మేఘాలు ఆయన్ను రాసుకుంటూ వెళ్ళిపోతున్నాయి.
జనసంచారం పల్చబడింది, పాకల్లో బుడ్డిదీపాలు మిలుకు మిలుకు మంటున్నాయి. దిక్కులుచూస్తూ నడుస్తున్న మాణిక్యం ఉన్నట్లుండి ఓరాయిని తన్నేసి బోర్లాపడిపోయాడు. పూలన్నీ చెల్లాచెదురుగా పడిపోయాయి, వాటితోపాటు నోట్లకట్టలు కూడా పడ్డాయి. మాణిక్యం మతిపోయింది. గబగబాలేచి నోట్లకట్టలు బుట్ట అడుగున పెట్టి పైన పువ్వులుపేర్చి పక్కనేవున్న కాలవగట్టుమీద కూర్చున్నాడు. బొటనవేలుకి దెబ్బతగిలింది, మోకాలు కొట్టుకుపోయింది, రక్తం చేతికి జిగురుగా తగిలింది. మామూలుగా అయితే అవి గట్టిదెబ్బలే డబ్బుకట్టలు కంటబడేసరికి దెబ్బలమీద మత్తుమందు రాసినట్లు పెద్దగా నొప్పనిపించలేదు. డబ్బుచేస్తే నొప్పితెలియదు కాబోలు అనుకున్నాడు.
అప్పుడే వాడి బుర్ర చురుగ్గా పనిచేసింది. భుజాన్నున్న ఎర్రతుండు గట్టుమీద పరిచి నోట్లకట్టలు మూటగాకట్టి, ఇంటికొచ్చి రేకుపెట్టెలో పడేసాడు. గుమ్మానికి తడక అడ్డంపెట్టి ఇనపతీగలు బలంగా కట్టాడు. తుప్పట్టి శిధిలావస్తలోవున్న రేకుపెట్టె మాణిక్యానికి ఆసమయంలో ఇనప్పెట్టెలా కనపడింది. పూలబుట్ట దమయంతి ఇంట్లో ఇచ్చేసాడు. ‘‘అబ్బ ఎన్ని పూలో, రేపు దండకట్టి దొరగారు మెళ్ళో వేయాలి’’ బుట్టెడుపూలుచూసి సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయింది అసలు విషయం తెలియని దమయంతి. కొంతమందిచేత దేవుడు కొన్ని నిజాలు పలికిస్తూ ఉంటాడు ??
మాణిక్యం బుర్రలో పాదరసం పరుగులు పెట్టింది. ఏడుపు నటిస్తూ దొరగారింట్లో అడుగుపెట్టాడు. పడక్కుర్చీలో దొరగారు జారబడి కూర్చున్నారు. చేతిలో వెండిగ్లాసు, అందులో సగం కాఫీ ఉంది. నెమ్మదిగా దొరగారి ప్రక్కనే కూర్చుని ‘‘సామీ! నాచేతిలో పూలబుట్టని చీకట్లో ఎవరో ఇద్దరువచ్చి లాక్కుపోయారండి’’ స్వరంపెంచి ఏడుస్తూ అన్నాడు. వాడు ఆక్షణంలో నటనలో ఆరితేరిపోయిన నటుడైపోయాడు. అయినా దొరగారు మాట్టాడలేదు, ఉలకలేదు పలకలేదు. అనుమానంవచ్చిన మాణిక్యం ముక్కుదగ్గర చెయ్యిపెట్టిచూసి ఒక్కసారి ఘొల్లు మన్నాడు. జనం పోగయ్యారు. డాక్టరువచ్చి ‘‘ హార్టు ఎటాక్, పోయి చాలాసేపయింది ’’ చెప్పాడు. ఊరంతా ఏడ్చింది. దొరగారుచేసిన మంచిపనులు ఒకళ్ళకొకళ్ళు చెప్పుకున్నారు. విషయం తెలిసిన దమయంతి ‘‘చచ్చేలా ఏడ్చింది, పాతికలక్షలు ఇస్తానన్నాడు, ఇవ్వకుండానే గుటుక్కుమన్నాడు, పువ్వుల్లో పెట్టి ఇస్తానన్నాడు, ఉత్తి పూలబుట్ట ఇచ్చాడు’’ డబ్బును తల్చుకుని తల్చుకుని ఏడ్చింది. ‘‘ఇంక ఏడ్వటం అనవసరం అనుకుని ’’ కాసేపు ఏడ్చి ఇంటికెళ్ళిపోయింది. దమయంతితో వచ్చిన అమ్మ రాత్రి దొరగారు పంపిన పూలు దండగుచ్చి తెచ్చింది కాబోలు ‘‘ఈ దండ ఇలా వేయాల్సి వస్తుందనుకోలేదు ’’ అనుకుని శవంమెళ్ళోవేసి ముక్కు తుడుచుకుంటూ బయటికి వెళ్ళిపోయింది.
‘‘పాపం దొరగారికి ఎంతో నమ్మకస్తుడు. ఎలా బ్రతుకుతాడో ఏంటో ’’ నటనలో జీవించేస్తున్న మాణిక్యాన్నిచూసి అనుకున్నారు ఊరోళ్ళు. పదిరోజుల తర్వాత రాణిగారు మాణిక్యాన్ని పిలిచి ‘‘ వారికి నువ్వు చిన్నతనంనుండీ ఎన్నో సేవలుచేసి, వారికి తలలో నాలుకలా ఉండేవాడివి, నీ ఋణం ఏమిచ్చినా తీరదు ఇవి ఉంచు అంటూ ‘‘ డబ్బుల కట్టొటి’’ మాణిక్యం చేతిలో పెట్టారు. మాణిక్యం ఆవిడ దగ్గర విపరీతంగా నటించేసాడు, మళ్ళీ కుళ్ళికుళ్ళి ఏడ్చాడు.
No comments:
Post a Comment