Thursday, February 5, 2026

 ఇది స్వీయ రచన 

అందరికిష్టుడు

అందరికీ ఇష్టుడైన ఒక ఒక కిష్టుడి గాథ ఇది.

అధ్యాయం 1: ఊరు,  జ్ఞాపకాలు

జలపురి స్టేషన్ పేరు జలపురే.
కానీ స్టేషన్ ఉన్నది కర్రిపూడిలో.
ఈ చిన్న వ్యత్యాసమే జలపురి స్వభావం—
పేరు ఒకటి, వేర్లు మరొకచోట;
కనిపించేది ఒకటి, జీవించేది ఇంకొకటి.
రైలు దిగి అడుగు పెట్టగానే ఎడమవైపు రామారావు ఇల్లు కనిపిస్తుంది.
 కిష్టుడికి అతనితో  విడదీయరాని స్నేహం.
జలపురి  హైస్కూల్‌లో చదివే రోజుల్లో, స్కూల్ పూర్తయిందంటే పుస్తకాల సంచి ఇంట్లో పడేసి స్టేషన్‌కి వెళ్లడం ఆనవాయితీ.
రామారావు ని  పిలుచుకుని ప్లాట్‌ఫారం మీద నిలబడి, రైళ్లను కాదు—జీవితాన్ని చూసేవాళ్లు వాళ్ళు.

అధ్యాయం 2: అందరికిష్టుడుll

కృష్ణమూర్తిని జలపురిలో “కిష్టుడు” అని పిలిచేవారు.
వ్యవహారంలో కిట్టు అయినది
అతను ప్రత్యేకంగా ఏమీ చేయలేదు అందరూ ఇష్టపడటానికి.
గొంతెత్తి మాట్లాడలేదు.
తన గొప్పతనం చెప్పుకోలేదు.
ఎవరినీ మెప్పించాలనే తాపత్రయం కూడా లేదు.
కానీ…
అతను ఉన్న చోట మనుషులు కుదుట పడేవారు.

బాల్యంలోనే గమనించారందరూ—
తనకు గొడవలంటే భయం లేదు,
అంతేకాదు గొడవలు తీర్చటం ఇష్టం.
ఎవరైనా రెండు మాటలు ఎక్కువ మాట్లాడితే,
అతను మధ్యలో మాటలు కలిపి వారిని తన దగ్గరకు పిలుస్తాడు.
వినడమే అతని మొదటి ఆయుధం.
తనలో ఒక ఆలోచన స్థిరపడింది—
“శిక్ష తప్పు కాదు. కానీ బాధను అర్థం చేసుకోకపోతే, శిక్ష కూడా హింసే.”
కాలేజీ రోజుల్లోనే నాయకుడిగా కనిపించిన అతను,
సమస్య వచ్చినప్పుడు వెతుక్కునేది అతనినే.
ఎందుకంటే… అతను ఎవరి వైపు నిలబడతాడో ఎవరికీ తెలియదు.
అతను సమస్య వైపు మాత్రమే నిలబడతాడు.
చాలామందికి అతను నచ్చాడు,
కొందరికి ఇబ్బందిగా మారాడు.
ఎందుకంటే అందరికీ నచ్చే వాడు, వ్యవస్థలకు సౌకర్యంగా ఉండడు.

ఎవరికి బాధ వచ్చినా, అతని పేరు గుర్తొచ్చేది.
ఎవరికి ఆనందం వచ్చినా, మొదట చెప్పాలనిపించేది అతనికే.
అలా అతని మీద ఒక పేరు పడింది—“అందరికిష్టుడు.”
అతనికి తెలుసు—
అందరికిష్టుడిగా ఉండటం వరంలా కనిపించినా,
చివరికి తనకు తాను నచ్చుకోవడం మరిచిపోతాడు.
అతను ఇంకా తెలుసుకోలేదు—
ఈ స్వభావమే అతనిని ఎత్తుకు తీసుకెళ్తుందని,
అలాగే ఒక రోజు, అదే స్వభావం, ప్రజల మనోపీఠాల పై అధిష్టింపచేస్తుందని.
*****

కిట్టు స్ఫూర్తిదాతలు వీరే.కిట్టు మాటలలోనే – 

ఆ రోజు స్కూల్ నుంచి ఇంటికి వచ్చి
పుస్తకాలు గోడకేసి పెట్టాను.
చొక్కా చెమటతోనే ఉంది.కళ్ల ముందు ఇంకా
బోర్డు మీద అక్షరాలే తిరుగుతున్నాయి.
అంతలో బయట ఏదో అలజడి.
వాకిట్లోకి వచ్చి చూస్తే మనోహర్‌ సైకిల్ మీద.
అది కూడా ఒక్క చేతితో అడ్డతొక్కుడు కాదు సూటిగా.
నాకు కళ్లుమిలమిల లాడాయి.
నిన్నటివరకు సైకిల్ అంటే భయపడే వాడు.
ఎవరో నవ్వినప్పుడు మౌనంగా నిలబడిపోయిన వాడు.
ఇప్పుడు మాత్రం ఆ సైకిల్ మీద అతడే రాజులా ఉన్నాడు.
నేను అరిచాను—
“ఏరా… ఎప్పటి నుంచి?”

ఆగకుండా తొక్కుతూనే నవ్వాడు.
తోట దాకా వెళ్లి మళ్లీ తిరిగి వచ్చాడు.
అంతే. అంతలోనే అతడు నేర్చుకున్నాడు.
అడ్డంగా కాదు.పడుతూ కాదు.నెమ్మదిగా కాదు.
ఆ రోజే.  ఒక్క రోజులోనే.అప్పుడు నాకు అర్థమైంది—
కొన్ని పనులు కాలం తో కావు.పట్టుదల కావాలి.
ఆ రోజు సైకిల్ నేర్చుకున్నది మనోహర్ కాదు.
పట్టుదల అంటే ఏమిటో నాకు నేర్పాడు.
నిజం చెప్పాలంటే అప్పుడు నాకు సైకిల్ రాదు.
అందుకే కావచ్చు— ఆ రోజు నుంచి
మనోహర్ నా హీరో.

కొన్ని రోజుల తరువాత మరో రోజు.
మా స్కూల్ గ్రౌండ్ పక్కన కృష్ణమూర్తి నిలబడి ఉన్నాడు.
ఏదో గొడవ. మాటలు ఎక్కువయ్యాయి.‌ఎవరో భయపడ్డారు. వెనక్కి వెళ్లారు.
కానీ కృష్ణమూర్తి ఒక్కడే ముందుకు వచ్చాడు.
చూపుల్లో కోపం లేదు.భయం లేదు.
మాటల్లో స్థిరత్వం ఉంది. ఆ రోజు నేను చిన్నవాడినే.
కానీ మనిషి ఎప్పుడు పెద్దవాడవుతాడో అర్థమైంది.
ఎత్తులో కాదు ధైర్యంలో.
ఆ రోజు నుంచి ప్రతికూల పరిస్థితి ఎదురైతే
నా మనసులో మొదట నిలిచే ముఖం కృష్ణమూర్తిదే.

ఇంకొక రోజు. పదో తరగతి.
అసెంబ్లీ హాల్. ప్యూపుల్ లీడర్ ఎన్నికలు.
బాల సుబ్రహ్మణ్యం ముందు వరుసలో కూర్చున్నాడు.
నవ్వుతూనే.
పోటీలో ఓడిపోయాడు.నేను అతడి వైపు చూడలేకపోయాను. ఎందుకో గిల్టీగా అనిపించింది.
మరుసటి రోజు అతడే నా దగ్గరకు వచ్చాడు.
“ఏమిట్రా… చదువు బాగుందా?”అదే చిరునవ్వు.
ఆ నవ్వులో ఓటమి లేదు.పగ లేదు. చిన్నతనం లేదు.
ఆ రోజు ఓడిపోవడం కూడా ఒక గుణమని నేర్చుకున్నాను.
అలా నా చుట్టూ ఉన్న మనుషులే నన్ను మెల్లగా తయారు చేశారు.
నేను కిట్టుగా మారడానికి ఒక్క కిట్టు సరిపోలేదు.
మనోహర్ నేర్పిన పట్టుదల, కృష్ణమూర్తి ఇచ్చిన ధైర్యం,
సుబ్రహ్మణ్యం చూపిన హుందాతనం—
ఇవన్నీ కలిసి నన్ను నడిపించాయి.

శర్మ అని నా స్నేహితుడు ఉండేవాడు.
స్నేహితుడు అనటం తక్కువే.
ఎంత అభిమానం నాకు శర్మ మీదో,అంతకన్నా ఎక్కువే
శర్మకు నాపై. శర్మది పక్క ఊరు. .రోజూ ఆ ఊరు నుండి జలపురి స్కూల్ కు వచ్చే వాడు

మధ్యలో శివాలయం.ఆ దారి కొంచెం నిర్మానుష్యం.
సాయంత్రం అయితే మరింత నిశ్శబ్దం.
ఒక రోజు శర్మ నన్ను ఆపాడు.
“కిట్టూ…నాకు కాస్త భయంగా ఉంది రా.మా ఊరు దాకా నడిచిపోవాలి.నాతో వస్తావా?”
అని అడిగాడు.
నేను నవ్వాను.“అరే… నువ్వు భయపడితే
నేను కూడా వస్తా. ఉండు” అన్నాను.
అంతే. ఇద్దరం కలిసి నడిచాం.
మాటలు. నవ్వులు.చిన్న చిన్న కలలు.
తెలియకుండాన శివాలయం దాకా వచ్చేశాం.
అప్పుడు శర్మ ఆగి అన్నాడు—
“ఇక్కడ దాకా వచ్చేశాం కదా…
ఇక భయం లేదు.”
ఆ మాటల్లో నాకు ఏదో తాకింది.
అది భయం గురించో కాదు.
ధైర్యం గురించో కాదు.స్నేహం అంటే ఏమిటో
ఆ క్షణంలోనే అర్థమైంది.
భయమొచ్చినప్పుడు
తలచుకునే మనిషి ఎవరో అదే స్నేహం.
వెనక్కి తిరిగి తన ఇంటి వైపు నడిచే శర్మను చూస్తూ
నేను ఒక్క క్షణం ఆగాను.
మనసులో అనుకున్నాను—
“ఇలాంటి స్నేహం
జీవితంలో ఒక్కసారి దొరికినా చాలు.”
అది పెద్ద మాట కాదు.ప్రమాణం కాదు.
వాగ్దానం కాదు.కానీ శివాలయం దాకా
తోడు నడిచిన ఆ స్నేహం ఇప్పటికీ నా లోపలే ఉంది.
నాకు ఎప్పుడైనా భయం అనిపించినప్పుడు
అది నన్ను అడుగుతుంది—
“శివాలయం దాకా వచ్చేశాం కదా…
ఇంకేం భయం?” ‌ఇలా చూస్తే
మనోహర్ పట్టుదల,
కృష్ణమూర్తి ధైర్యం,
సుబ్రహ్మణ్యం హుందాతనం,
శర్మ స్నేహం—
ఈ నాలుగూ నాపై ఎంతో ప్రభావం చూపాయి.

******

ఆ  ఊరి మొండిగుడి పక్కనే ఉన్న సత్రం ఆ రోజు అల్లకల్లోలంగా ఉంది. చెడుగుడు కోర్టు మీద రెండు జట్లు పగిలిపడుతున్నాయి.చప్పుళ్లు, కేకలు, మట్టిలో మునిగిన పాదాలు—అన్నీ ఒకే ఉత్కంఠ.
అంతలో ఒక బలమైన ఆటగాడు కూతకు వచ్చాడు.
కోర్టు అంతా చుట్టేస్తూ ప్రత్యర్థులను దాటుకుంటూ పోతున్నాడు.
అతన్ని ఆపడానికి ఇద్దరు ముగ్గురు ప్రయత్నించారు.
అతడు ఒక్కసారిగా గాల్లోకి ఎగిరాడు.
ఆ క్షణమే—
అవతల మూల నుంచి ఒకడు ముందుకొచ్చాడు.
శరీరంలో వేగం లేదు, కానీ కంట్లో తీక్షణ ఉంది.
ఎగిరిన ఆటగాడి కాలు అమాంతం పట్టుకున్నాడు.
ఆట అక్కడితో ముగిసింది.
అందరూ ఒక్కసారిగా నిశ్శబ్దమయ్యారు.
ఆ కాలు పట్టుకున్న వాడు ఎవరో కాదు—
ఆ ఊరికి కొత్తగా కరణం అయిన కిట్టు.
ముక్కున వేలేసుకున్నారు.
“కరణంగారు చెడుగుడు ఆడటమా?”
“అది కూడా ప్రత్యర్థి కాలు పట్టుకోవటమా?”
“కులం, గౌరవం?”
అలాంటి ప్రశ్నలు గాలిలో తిరిగాయి.
కానీ కిట్టు వాటిని లెక్కపెట్టే మనిషి కాదు.
ఆ రోజు కోర్టులో చేసిన అదే పని,
తర్వాతి రోజుల్లో జీవితంలోనూ చేశాడు—
బలవంతుడి కాలు పట్టి, బలహీనుడికి న్యాయం చేసే వాడు అయ్యాడు.

****

1977 నవంబర్ 19.
దివిసీమను నేలమట్టం చేసిన రోజు.
సముద్రం పగిలి వచ్చినట్టుంది.
గుడిసెలు గుర్తుల్లేకుండా పోయాయి.
పెంకుటిళ్లు ఊపిరాడుతూ నిలిచాయి.
భవంతులు మాత్రం ఊరంతటిని అక్కున చేర్చుకున్నాయి.
ఆ గందరగోళంలో ముందువరుసలో కిట్టు ఉన్నాడు.
ఇతర గ్రామాధికారులతో కలిసి ప్రభుత్వాన్ని ఒప్పించాడు.
ప్రతి ఇంటికి నష్టపరిహారం ఇవ్వాలని.
ప్రభుత్వ ఆదేశం స్పష్టం—
ఇంటికి రూ.500.
కానీ జలపురిలో ఇళ్లకన్నా కుటుంబాలు ఎక్కువ.
ఒకే ఇంట్లో రెండు, మూడు కుటుంబాలు.
డబ్బు పంపిణీ పూర్తయ్యాక
ఐఏఎస్ అధికారిణి కె.ఎల్. విజితారావు విచారణకు వచ్చారు.సంఖ్యలు చూసి ఆశ్చర్యపోయారు.
కిట్టును ప్రశ్నించారు.అతడు నిశ్శబ్దంగా చెప్పాడు—
“నేను ప్రతి కుటుంబానికి రూ.500 ఇచ్చాను.
బీదరికం వల్ల ఒక ఇంట్లో ఎన్నో కుటుంబాలు ఉంటున్నాయి.
వారి దారిద్ర్యాన్ని ఇంకోసారి ఎగతాళి చేయలేక,
కుటుంబాన్ని ఒక యూనిట్‌గా తీసుకున్నాను.”
ఆ సమాధానం విని అధికారులు మాట్లాడలేకపోయారు.
విజితారావు గారు రాత్రికి రాత్రి ఊరంతా తిరిగారు.
ప్రతి ఇంట్లో అడిగారు.
ప్రజల సమాధానం ఒక్కటే—
“మాకు డబ్బు అణాపైసలతో సహా ముట్టింది.”
“మా కరణంగారు దేవుడు.”
“చిల్లి పైసా కూడా తీసుకోడు.”
“ఇచ్చే చెయ్యి గానీ, తీసుకునే చెయ్యి కాదు.”
మరుసటి రోజు
ఆవిడ కిట్టును పిలిచి అంది—
“రూల్స్‌ని అలా మార్చుకోవడం కరెక్ట్ కాదు…
కానీ మీ ధైర్యం, ప్రజల మీద మీ ప్రేమ, మీ నిజాయితీ—
నాకు మాటలు రావడం లేదు.”

*******
ఎక్కడో గుడిసె తగలబడితే ఊరంతా పరుగెత్తేది.
ఆ పరుగులో ముందువరుసలో ఉండేవాడు కిట్టే.
కష్టం కనిపిస్తే
అక్కడికి చేరి,‌వారిని అక్కున చేర్చుకోవడం
అతని సహజ స్వభావం.

ఎక్కడో అరుపు మొదలయింది.
మొదట అది స్పష్టంగా  లేదు.
గాలి మీద ఎగిరే ఒక భయపు శబ్దం మాత్రమే.
“మంటలు మంటలు ”
అంతలోనే ఊరు కదలడం మొదలుపెట్టింది.
గుడిసెల వరుసలో ఒక చోట మంటలు ఎగసిపడుతున్నాయి.ఎండిపోయిన తాటాకులు,
టార్పాలిన్ పైకప్పులు అగ్నికి ఆహారం అవుతున్నాయి.
ఒక్కసారిగా ఊరంతా ఉరుకులు పరుగులు.
ఎవరు ఎవరి కోసం పరిగెత్తుతున్నారో తెలియదు.
ఎవరికీ ఒక నిర్దిష్ట ఆలోచన లేదు.ఆ పరుగులో
ముందువరుసలో కిట్టు కనిపిస్తున్నాడు.
అతను ఆలోచించడు.ఎవరిని పిలవడు.
ఎవరికీ ఆదేశాలు ఇవ్వడు.
కాళ్లు ముందుకు కదులుతున్నాయి.
మనసు ఇప్పటికే అక్కడే ఉంది.
మంటల దగ్గరికి చేరుతూనే
ఒక పిల్లాడు ఏడుస్తూ కనిపిస్తున్నాడు.
తల్లి లోపలే ఉందని చెబుతున్నాడు.
కిట్టు ఆగడు.
ఎవరో చేయి పట్టుకుంటారు— “లోపలికి వెళ్లద్దు…”
అతను చేయి విడిపించుకున్నాడు.
“వాడి అమ్మ ఉంది అన్నాడు,”
అని ఒక్క మాట మాత్రమే చెప్పాడు
.
అది వివరణ కాదు. అనుమతి కాదు.
అది అతని స్వభావం. పొగలోకి వెళ్తాడు.
కొద్దిసేపటికి ఒక స్త్రీని పట్టుకుని బయటకు వస్తాడు.
ఆమె చేతులు వణుకుతున్నాయి.
కళ్ళు ఏమీ చూడటం లేదు.
కిట్టు ఆమె భుజం మీద చేయి వేస్తాడు.
“ఏం కాదు. ఇక్కడే కూర్చో,”
అంటూ నేల మీద కూర్చోబెడతాడు.
ఆ మాటలో ఆశ్వాసన ఉంది..ఆదేశం లేదు.
మరోవైపు
కొంతమంది నీళ్ల బిందెలు తీసుకొస్తున్నారు.
ఎవరో దుప్పట్లు తెస్తున్నారు.
ఇది ఎవరూ చెప్పిన పనులు కాదు.

కిట్టు అక్కడే నిలబడి ఉన్నాడు..
ఒక్కొక్కరిని చూస్తున్నాడు.
ఎవరికేమి కావాలో
చెప్పకుండానే అర్థం చేసుకుంటున్నాడు.
ఒక వృద్ధుడి దగ్గరికి వెళ్లి— “నువ్వు ఇక్కడే ఉండు,” అంటాడు.
ఒక యువకుడిని చూసి— “ఆ వీధిలో ఇంకెవరైనా ఉన్నారా?” అని అడుగుతున్నాడు.
ఎక్కడా గందరగోళం లేదు.
ఎక్కడా అరుపు లేదు.కిట్టు శబ్దం పెంచడం లేదు.
అతని ఉనికే శబ్దాన్ని తగ్గిస్తోంది.
మంటలు అదుపులోకి వస్తున్నాయి.
గుడిసెలు కాలిపోయినాయి.
కానీ మనుషులు నిలబడ్డారు.

ఆ రాత్రి ఎవరూ కిట్టు పేరు పిలవలేదు.
ఎవరూ కృతజ్ఞతలు చెప్పలేదు.
కానీ ప్రతి చూపులో ఒక నమ్మకం నిలిచింది.
“ఇలాంటప్పుడు కిట్టు ఉంటాడు.”
అది ప్రచారం కాదు.
అది తీర్మానం కాదు.
ఊరు తన సహజ ప్రవృత్తితో ఒక మనిషిని అంగీకరిస్తోంది.
కష్టం కనిపిస్తే అక్కడికి చేరి వారిని అక్కున చేర్చుకోవడం— అది కిట్టు చేసే పని కాదు.
అది కిట్టు  విధానం.
*****
---కొండముది సుబ్బారావు

No comments:

Post a Comment