Thursday, February 5, 2026

 ఆత్మస్నానమూ అవసరమే

శరీరం మీది దుమ్మూ ధూళిని నీటితో శుభ్రపర్చుకోవడమే 'స్నానం' అంటాం. ఉదయం 4-5 గంటల మధ్య చేసేది 'రుషి స్నానం'గానూ, 5-6 గంటల మధ్య చేసే దాన్ని 'దైవస్నానం'గాను విజ్ఞులు పేర్కొంటున్నారు. ఈ సమయాలు దాటి సూర్యభగ వానుడు నడినెత్తికొచ్చినపుడు చేసేది రాక్షసస్నానమే. స్నానానంతరం సూర్యభగవాను డికి నీటిని సమర్పిస్తూ అంజలి ఘటించడం ఆచారం. ఆ పరమేశ్వరుడు కూడా అభిషేక ప్రియుడు. జలంతోనే తృప్తిపడే సాదాసీదా తత్వం 'శివతత్వం'. ఆడంబరాలు తక్కువ. తెలిపే విషయం ఎక్కువ. ఏదీ స్థిరం కాదు, ఏదీ శాశ్వతం కాదు, లింగంపై పడిన జలధార కిందికి జారిపోతుంది. శివతత్వ సారమిదే.

చన్నీటి స్నానం బద్ధకాన్ని పోగొడుతుంది. వేడినీటి స్నానం శరీరానికి మర్దనగా ఉపయోగపడుతుంది. చన్నీటి స్నానాన్ని తలనుంచి, వేడినీటి స్నానాన్ని పాదాలనుంచి ప్రారంభించాలని పెద్దలు చెబుతారు. మంత్రా లను చదువుతూ స్నానం చేస్తే అది మంత్ర స్నానమై శరీరానికి 'శక్తి'నిస్తుంది. మనసులో దైవాన్ని స్మరిస్తూ చేసేది 'మానస స్నానం'. దీన్ని రుషులు- సంప్రదాయ వాదులు ఆచరిస్తారు. కొన్ని చెట్లు పెరిగేచోట నుంచి, పవిత్ర ప్రదేశాల నుంచి మట్టిని సేకరిస్తారు. దాంతో స్నానం చేస్తే అది 'మృత్తికా స్నానం' . చెట్ల ఔషధ గుణాలు, భూమిలోని ఖనిజాల శక్తి శరీరానికి పడుతుంది. తద్వారా అనేక రుగ్మతల నుంచి విముక్తి లభిస్తుంది. మునీశ్వరులు దీన్ని పాటించేవారు.
గోధూళిని దేహానికి పట్టించడాన్ని 'వాయువ్య స్నాన'మనీ, విభూది పూసు కోవడం ద్వారా శివుడికి చేరువవడాన్ని 'భస్మ స్నాన'మనీ చెబుతారు. స్నానం చేయగల స్థితిలో లేని వృద్ధులు, రోగులకు తడివస్త్రంతో దేహాన్ని శుభ్రం చేయడాన్ని 'ఆఘమర్షణ స్నానం' అంటారు. ఎండాకాలంలో కురిసే వర్షంలో చేసేది- దివ్యమైన స్నానం.

ఈ స్నానాలన్నీ శరీరానికి ఉద్దేశించినవి. శరీర స్నానం ఎవరికి వారు చేయవచ్చు. వేరొకరికి చేయించవచ్చు. తొలి- అంతిమ స్నానాలు మానవ ఎరుకలో లేనివి అన్న విజ్ఞుల మాటలు వాస్తవాలు.

కానీ మనసుకి పట్టిన మురికి ఎలా తొలగుతుంది? శారీరక స్నానంతో పాటు, అంతర్గత స్నానం కూడా అవసరమే. ఎవరికి వారే చేసుకోవాల్సిన ఆ స్నానాన్ని 'ఆత్మస్నానం' అన్నారు. ఇది ఎప్పుడు సాధ్యపడుతుంది- 'బుర్ర'ని బుట్టగా భావించి మంచి ఆలోచనలనే పువ్వులనే అందులో వేసుకున్నప్పుడు. చెత్త ఆలోచనలతో, దిగజారుడు మాటలతో బుర్ర బుట్టను నింపుకొంటే, దుర్గంధమే తప్ప సువాసనలెలా వస్తాయి? మనసులోకి ఏ చెత్తా చేరకుండా జాగ్రత్తపడాలి. తాజా పరిమళాల పుష్పాలను అందులో నింపగలగాలి. ఇది కళ్లు మూసుకుని శ్వాసను గమనిస్తేనే సాధ్యపడుతుందని గ్రహించాలి. అప్పుడే మనం ఆలోచనారహిత స్థితి పొందగలం. అదే అద్భుతమైన 'ధ్యానం'. ఆత్మ స్నానమాడే సందర్భం. అప్పుడే బుద్ధి వికసించి, 'మనసు' సాధకుడి నియంత్రణలోకి వస్తుంది. ఇది పాటిస్తే జగతికి శుభమస్తు.

No comments:

Post a Comment