గుర్తుకొస్తున్నాయి
*************
బడి సంచీలు
-----------
అప్పుడు మా చిన్నప్పుడు మాకు బడికెళ్ళడానికి యూనీఫామ్ లు లేవు.నిజానికి మేం మా రౌతులపూడి బళ్ళోచదువతున్నప్పుడు అసలామాటనే అప్పట్లో మేము విననేలేదు.మాసంగతి వదిలేయండి.మావి బొత్తిగా వానాకాలం చదువులు. నాతర్వాత ,నా చెల్లెళ్ళూ,తమ్ముళ్ళ చదువుల సంగతి చెపుతున్నాను.
అయితే వాళ్ళచదువుల సమయానికి కూడా యూనిఫరాలననేవిలేవు.అయితే స్కూలు బట్టలనేవి వేరే వుండేవి.అవి ఖరీదైనవా, ,కొత్తవా, కావా అనే పట్టింపులేదుకానీ ,పరిశుభ్రతగా వున్నాయా లేవా? అన్నదిమాత్రము మాఉపాద్యాయులు చూసేవారు.చిరిగినా ఫరవాలేదుకానీ, మాసినవి మాత్రం కాకూడదు అన్నమాట.ఆరోజుల్లో బడి బట్టలతో ఇంట్లోకి రానిచ్చేవారుకాదు.ఇంచుమించు అవి మైలబట్టలతో సమానం.అందుకని ఇంట్లోవాళ్ళు.బడినుంచి రాగానే, మా మెట్లగదిలో మూలగా స్టాండుమీద బడిబట్టలు తగిలించి ,ఆగదిలోనే దూరంగా పెట్టుకొన్న ఇంటి బట్టలు కట్టుకొని లోపలకు వచ్చేవారం.
ఇప్పట్లా వందల వేల ఖరీదులుచేసే స్కూలు బ్యాగులనేవి వుంటాయనే సంగతే ఆనాడు తెలియదు. అప్పట్లో మాకు.అసలు పుస్తకాలుంటేగదా బేగులుండడానికి.
మా అమ్మ చిరిగిపోయిన మడతమంచం గుడ్డలతో చెరువంత సంచీలను మా ఆస్థాన టైలరు తాతబ్బాయిచేత కుట్టించేది, ఆడపిల్లలకూ మగపిల్లలకూ. ఒకటవ తరగతిలో కుట్టించిన మడతమంచం గుడ్డ సంచీ పదవతరగతిలోకొచ్చినా పాడవడమన్న మాట లేనేలేదు.
అయితే ,మా బడిలో పిల్లలందరికళ్ళూ కుట్టేలా ,ఈరంకి దత్తుడుగారమ్మాయిలు మటుకు రామలక్షీ ,కామేశ్వరీ ,పద్మా వాళ్ళూ మాత్రం తళతళా మెరిసిపోతూ ,డబడబా చప్పడయ్యే సిల్వర్ స్కూలు పెట్టెలు తెచ్చుకొన్నప్పుడు ,ఆ అమ్మాయలను చూస్తే చెప్పొద్దూ చిన్న అసూయా,మా మడతమంచం గుడ్డ సంచీలని చూస్తుంటే బోల్డంత అసహ్యం కలిగేది.
మా నాన్నని ఎన్నిసార్లు పుస్తకాల పెట్టెలు తెమ్మన్నా, రాజమండ్రీ వెళ్ళినప్పుడో,కాకినాడ వెళ్ళినప్పుడో తెస్తాను.అనకాపల్లి బెల్లం అమ్మడానికి వెళతానుకదా! అప్పుడు జ్ఞాపకం చేయండి ,అందరికీ తలోపెట్టీ తెచ్చేస్తాను అనేవారు.
రోజూ ఆలస్యంగా లేచే వాళ్ళం నాన్న అనకాపల్లో, రాజమండ్రియో,కాకినాడో వెళుతున్నారన్న విషయం తెలిసి, నాన్న ఐదుగంటలకే ఫస్టుబస్ కి బయలుదేరుతుంటే,కళ్ళునులుముకుంటూనిద్రమంచంనుంచి లేచివచ్చి,"నాన్నా!పుస్తకాలపెట్టెలు అని అడగడం,బలే గుర్తుచేశారమ్మా!తప్పకుండా తెస్తానని నాన్న భరోసాగా అనడం,పిల్లలందరూ కొండంత సంబరపడడం, రాత్రి ఆఖరి బస్సులో పదిగంటలకు వచ్చేటప్పుడు నాన్న పెట్లు తెచ్చేస్తారని ఆరాటంగా నిద్రమానుకొని ఎదురుచూడడం,నాన్న సంగతి ముందే తెలుసుకనుక "వెళ్ళిపడుకోండి.పెట్లు తెస్తే ఎక్కడికి పోతాయి?.పొద్దున్న చూసుకొందురుగాని"అమ్మ అదిలించడం,నిద్రముంచుకొచ్చినవాళ్ళు నిరాశగా వెళ్ళి పడుకోవడం,ఆశాజీవులు నిద్రనాపుకొని కళ్ళుకాయలు కాసేలా నాన్నకోసం ఎదురుచూసి,నాన్న వచ్చినా పెట్టెలు రాలేదని బిక్కమొఖం వేయడం,"పనుల హడావాడిలో పడి మరచిపోయేనమ్మా! మళ్ళీ వేళ్ళినప్పుడు తప్పకుండా తెస్తానని నాన్న చెప్పినప్పుడు,ఆశా నిరాశల మధ్యన ఊగులాడుతూ,ఆరాత్రి నిద్రలో తళతళలాడుతూ మెరిసిపోతూ,బడబడమని చప్పుడుచేసే సిల్వర్ పెట్టిలో పుస్తకాలతో బడిలోకెళ్ళుతున్నట్లు కలలుగంటూ పడుకొని ఉదయం లేవగానే , బడి టైముకి మామూలుగా మడతమంచంగుడ్డలసంచీలని భుజానికి తగిలించుకొని హుషార్ గా బడికి పరుగో పరుగుతీయడం మరచపోలేని జ్ఞాపకాలవా..మేమూ ఏదోరోజు పుస్తకాల పెట్టెలతో బడికి వెళ్ళకపోతామా అన్న ఆశ మా వాళ్ళనందరినీ ఐదో తరగతి దాటించేసి,ఆపైన పుస్తకాల పెట్టెలతో పనిలేకుండా చేసింది. మాబడినీ, మాఊరినీ పైచదువులకు పట్నం చేర్చెసింది.
సత్యవాణి కుంటముక్కుల
8639660566
No comments:
Post a Comment