*కురుక్షేత్ర యుద్ధం పూర్తి అయిన తర్వాత శ్రీకృష్ణుడు ముందు అర్జునుని రధం దిగమని, తర్వాత తాను దిగిన పిదప రధం మాయం అవుతుంది. కాని భీష్ముని పైకి కోపం తో రధం దిగి వెళ్తాదుకదా. ఎలా?*
కృష్ణుడు యోగేశ్వరుడు. సారథ్య బాధ్యత స్వీకరించాడు.. రథిని కాపాడడం సారథి విధి. అది నెరవేర్చాడు.
వివిధాస్త్రాలు ప్రయుక్తమయ్యాయి. ప్రయోగించిన వారి సామర్థ్యాన్నిబట్టి అవి అమేయశక్తి గలవే.. కానీ , వాటికి ఆ బలం అనుగ్రహించిన మంత్రస్రష్టను అవేమి చేయగలవు?
ఆ ప్రయోగాలు రథం మొత్తంమీద ప్రయుక్తమైనవి. కేవలం రథం మీద మాత్రమే కాదు. రథము అంటే — కృష్ణుడు, అర్జునుడు, చక్రరక్షకులు, కేతనము అందరిమీదనూ ఆ అస్త్రాలు శక్తిచూపి ఉంటాయి.
భారతకథనం ప్రకారం ద్రోణ కర్ణుల అస్త్రాల బలం కృష్ణుడు ఆపిపెట్టినట్టు తెలుస్తున్నది.
బహుశా భీష్ముడు వాత్సల్యం చేతనో / ధర్మాతిక్రమణ దోషం తనకు కలగకుండా ఉండడానికో / ఉగ్రమయి సర్వం నాశనం చేయగల అస్త్రాలను ఆ పది రోజులూ ప్రయోగించి ఉండలేదని ఊహించవచ్చు.
ద్రోణుడు భీష్మానంతరం తనకు దుర్యోధనుడు సర్వసేనాధిపత్యం ఇచ్చిన సందర్భంలో చేసిన వాగ్దానాల వల్లనో , కర్ణుడు సహజంగానే అర్జునుడిపై పెంచుకొన్న వైరంవల్లనో ఉగ్రాస్త్రాలు ప్రయోగించి ఉండవచ్చు..
అస్త్రం కేవలం లక్ష్యమైన ఆ వ్యక్తి మీదనే కాక ఇతర సామగ్రి మీదనూ ప్రయోగించడం ఇక్కడి విషయం. (వైపరీత్యం)
ప్రతిగా ఏదీ చేయలేని జీవకోటిమీద గానీ, జడపదార్థాల మీద గానీ అస్త్రం ప్రయోగించడం అధర్మం. అది అస్త్రాన్ని అవమానించడం ఔతుంది.
పాశుపతం ఇచ్చినప్పుడు పరమేశ్వరుడి పరీక్ష అదే.
నోరులేని సూకరం మీద అర్జునుడు అస్త్రప్రయోగం చేయలేదు. వచ్చింది కేవలకిరాతుడని తలచినపుడూ అస్త్రం వేయలేదు. —ఇది హిమాలయం. దేవభూమి. ఎవరో దివ్యుడు ఈ రూపంలో వచ్చి తన తపస్సుకు విఘాతం కలిగిస్తున్నాడు అని తోచినపుడే మంత్రస్మరణకు యత్నించడమూ, ఆ మంత్రాలూ జ్ఞప్తికి రాకపోవడమూ జరిగింది. అపుడే మల్లయుద్ధం చేసియైనా దుష్టుణ్ణి నిగ్రహించాలి అని తలపోయడమూ.
ఇక్కడ ద్రోణ కర్ణులు మాత్రం ఈ ఉగ్రత పొంది ప్రవర్తించారు.
*"గురుకర్ణుల యస్త్రాగ్నుల*
*నెరసినయది మున్ను. దీని నిటుగాకుండన్*
*భరపడి రక్షించితి సం*
*గరము దెగినఁ దొలగి యిపుడు గాల విడిచితిన్.*
(శల్య 2–337)
యుద్ధంలో రథనష్టం అనే అనర్ధం పొడసూపకుండా కృష్ణుడు అన్నిటినీ నిగ్రహించి పెట్టాడు. తన వశంలో ఉంచుకొన్నాడు.
ఆయనకే చాలా శ్రమ అయింది. ఎట్లో సంగరం తెగేవరకూ (పూర్తి అయ్యేవరకూ) భరించి భరించి అగ్నికి ఇచ్చేసి బరువు దించుకొన్నాడట. ఆయన మాటే ఇది.
అస్త్రాలకు ఆ శక్తి తానే ఇచ్చాడు. అవి అట్లే ఉండాలి. నిర్వీర్యం కాగూడదు. ఇపుడు పని అయిపోయింది. "ఇక తీసుకో" అని ఇచ్చేశాడు. మంత్రం తనపని తాను చేసుకొన్నది.
*గాండీవం , తూణీరాలు బయటపెట్టించు. నువ్వు ముందు రథం దిగు, తర్వాత నేను దిగుతాను* —అన్నాడు కృష్ణుడు.
సాధారణంగా సారథి ముందు నొగలు నుండి తాను దిగి రథికుణ్ణి దించుకొంటాడు.
ఈ వేళ...
*కవదొనలును గాండీవము*
*నవలనిడం బనుపు ముందరదము డిగుమే*
*న విదప డిగియెద* *శుభకరమవు నివ్విధము..* — అని చెప్పాడు.
అలా చేయగానే, పగ్గాలు నొగలుపై ఉంచి కృష్ణుడు దిగేశాడు. కేతనంపై ఉన్న కపీశ్వరుడు భూతగణంతో పాటుగా వెళ్లిపోయాడు .
రథాన్ని అశ్వాలనూ అగ్నిసమర్పణం చేశాడు కృష్ణుడు.
అవి "చురచుర బోగా" అర్జునుడు చూచాడు. అవి కళ్ళ యెదుటే మండి పోయాయి. అంతర్ధానం కాలేదు.
అవి నిజానికి అగ్నిదేవుడు భావి భారతయుద్ధం కోసం నరనారాయణులకు ఇచ్చినవి. అర్జునుడు చేయవలసిన పని పూర్తి కాగానే అవి ఆయన్ను చేరుకొన్నాయి.
ఇక్కడ కృష్ణుడు సమస్తమూ కాపుకాస్తున్నాడు. రథంలో ఉండడం, ఉండకపోవడం ఒక విషయం కాదు.
ఇక్కడ అర్జునుణ్ణి కాచడానికి కారణం చెప్పాడు.
ధర్మరాజు యుద్ధం ఆరంభమయ్యే ముందు కృష్ణుణ్ణి అడిగాడట.
*"ఏను ఉపప్లావ్యంబునకు వచ్చి నిన్ను గనిన నీవు నాకు మధుపర్కంబిచ్చి వివ్వచ్చుంజూపి వీడు నీకు రక్షణీయుండు సుమ్మీ !"* అని అప్పగించావు గదా! అందువల్ల రక్షించా! అన్నాడు నవ్వుతూ.
ఆ అస్త్రాలు తమ బలం చూపకుండా ఇన్ని రోజులు రేయింబవళ్లు కనిపెట్టి ఉన్నాడు. కడకు బలి సమర్పణం నిదానంగా తాను అనుకొన్నప్పుడు చేశాడు. అవీ నిరీక్షించాయి. సంతృప్తి చెందాయి.
( గాండీవం, అమ్ములపొదుల అవసరం ఇంకా ఉంది . అవి రక్షింపబడ్డాయి ఇక్కడ. )
No comments:
Post a Comment