సేద్యయాగం
🌺సేద్యయాగం🌺
అడవుల్లో, కొండల మీద వాటంతట అవే మొలిచే తృణధాన్యాలను గమనించాడు మనిషి. వానకారు రుతువు తోడుగా తన భుజబలంతో కూడా ఆ పని చేయవచ్చని గ్రహించాడు. అదిగో... అప్పటినుంచే సేద్యం మొదలైంది. పురాతన కాలంలో వ్యవసాయాన్ని కేవలం ఒక వృత్తిగా కాకుండా, ఒక యాగంలా ఎలా నిర్వహించేవారో కృషి సూక్తం తెలియజేస్తుంది.
సేద్యం మూలరూపం ఛేద్యం(ఛేదింపదగినది). అధర్వణ వేదంలో ఎరువుల ప్రస్తావన కూడా కనిపిస్తుంది కాబట్టి సేద్యాన్ని భారతీయుల అతిపురాతన వృత్తిగా భావించవచ్చు. వేదసంహితలు, పురాణాల నిండా సందర్భం వచ్చిన ప్రతిసారీ వ్యవసాయం తాలూకు వర్ణనలు కనిపించడం ఈ వాదనకు వత్తాసు పలుకుతుంది. పరాశర సంహితకర్త పరాశరుడు కృషీపరాశరుడిగా ప్రసిద్ధుడు. ఈ కర్షక రుషి కాలం మన లెక్కల ప్రకారం దాదాపు మూడు వేల సంవత్సరాల నాటిది. సేద్యం గొప్పదనం గురించి ఎన్ని విధాలుగానో ప్రశంసిస్తుందీ పరాశర సంహిత. వ్యవసాయానికి సంబంధించిన సమాచారం చాలా విపులంగా ఈ సంహితలో కనిపించడం విశేషం.
శునం వహా శునం నరః శునం కృషతు లాంగలం/ శునం వరత్రా బధ్యంతాం శున మష్ట్ర మ్ముదిజ్ఞయ’- ఎడ్లు సుఖంగా లాగు గాక, మనుషులు సంతోషంగా పనిచేయుదురు గాక, నాగలి చక్కగా దున్ను గాక... అని దానికి అర్థం. నాగలిని ఒక యంత్రంగా సంబోధిస్తూ, దాని ఆరు భాగాలను కొలతలతో సహా ‘ఈషాయుగోహల’ అధ్యాయంలో వివరించింది పరాశరసంహితే. వేదకాలం నాటి వ్యవసాయ పనిముట్లు, వాటి తీరుకూ ఇప్పటి పరికరాలు వాటి పనితీరుకూ అంతగా భేదం లేకపోవడం ఆశ్చర్యం కలిగించే అంశం. ఏటేటా పంటలు మారుస్తూ సాగు చేసే పద్ధతి యుక్తి తల్పతరు సూక్తుల్లో కనిపిస్తుంది. వాజసనేయి సంహితలోని చమకంలో ఇప్పటి మన వడ్లు, మినుములు, యవలు, నువ్వులు, సెనగలు వంటి ధాన్యాల ప్రస్తావన ఉంటుంది. ధరల ఆధారంగా రెండు పంటలు వేసే నేటి విధానం తైత్తిరీయ ఉషనిషత్ కాలంలోనూ ఉంది. స్థల, కాల భేదాలను అనుసరించి పంటలు వేసే సస్య సంప్రదాయం మౌర్యుల కాలం నాటికే అమలులో ఉన్నట్లు అర్థశాస్త్రం రెండో భాగంలో ఆధారాలు ఉన్నాయి! ఆరు రుతువుల కాలగణన విధానం కూడా క్రీస్తుకు పూర్వం రెండువేల అయిదు వందల ఏళ్ల కిందటనే ఆరంభమైనట్లు పరిశోధనలు చెబుతున్నాయి.
శరదృతువుల్లో పైరు పెట్టే నేటి ఆచారాలు వేదకాలం నుంచి సాంప్రదాయికంగా వస్తున్నాయి. రుగ్వేదంలోని కృషి సూక్తం సాగును ఒక యాగంగా వర్ణిస్తుంది. అధునాతన దిశగా సాగుతున్న నేటి వ్యవసాయ విధానాలు- సనాతన కాలంలో మన సాగుదారులు భక్తి శ్రద్ధలతో సాగించిన సేద్యయాగ ఫలాలే!🙏
✍️కర్లపాలెం హనుమంతరావు
No comments:
Post a Comment