గొప్ప భారతీయ ఋషుల నిరాడంబర జీవనశైలి నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?
పూర్వం అభిజిత్ అనే చక్రవర్తి సింధుప్రాంతంలోని రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాడు. అతనికి గణుడు అనే కొడుకు ఉన్నాడు. గణుడు విద్యావంతుడు, తపస్సుచేసి ఎన్నో వరాలు శక్తులు కూడా సంపాదించాడు. ఎంతటి శక్తిమంతుడంటే ఇంద్రుడుమీదకు యుద్ధానికి వెళ్ళి జయించి " నీ స్వర్గం నువ్వే తీసుకో, నీకన్నా గొప్పవాడిని అని తెలియచేయడానికే యుద్ధానికి వచ్చాను " అన్నాడు ఇంద్రుడితో.
గణుడు ఓ సారి వేటకు వెళ్ళాడు పరివారంతో. అలసిపోయి ఎక్కడయినా సేదదీరుదామని చూస్తూంటే ఒక ఆశ్రమం కనబడింది. అది కపిలమహర్షి ఆశ్రమం.
మహర్షి వీరిని ఆహ్వానించి " మీరందరూ ఆ నదిలో స్నానం చేసిరండి, మంచి విందు ఏర్పాటు చేస్తాను " అంటే గణుడు మనస్సులో " ఈ మహర్షి విందు అంటున్నారు కాని ఏవో కొన్ని ఫలాలు ఇస్తారేమో తినడానికి. సరే ఏదో ఒకటిలే " అనుకుని స్నానానికి వెళ్ళారు అందరూ.
వారికి వారి జీవితంలో రుచి కాదు కదా విననుకూడా వినని రకరకాల వంటకాలతో పసందైన భోజనం పెట్టారు మహర్షి. గణుడు ఆశ్చర్యపోయి " వంటసాల కూడా కనబడుటలేదు, ఇంత తక్కువ సమయంలో ఇవన్నీ ఎలా ఏర్పాటుచేసారు. మీరు రోజూ ఈ భోజనమే చేస్తారా " అని అడుగాడు.
మహర్షి " మేము భోజనమే చెయ్యము. ఆకలి తీర్చుకోవడానికి అప్పుడప్పుడు ఓ పండు తింటాం. మీరు మా అతిథులు కనుక ప్రత్యేక విందు ఏర్పాటు చేసాను " అని గణుడి సందేహనివృత్తి కోసం ఇలా చెప్పారు.
ఓ సారి ఇంద్రుడు వచ్చి మహర్షితో " మీరుచేసే అద్భుత యాగాలతో మా శక్తులు పెరుగుతున్నాయి. మీకు ఓ బహుమానం ఇద్దామని వచ్చాను " అని ఓ మణిని ఇచ్చారు. దానిపేరు చింతామణి. ఏది కోరుకున్నా ఇస్తుందని చెప్పారు. " నాకు ఏ సహాయమూ అక్కరలేదు, మణితో పనీ లేదు " అని మహర్షి అంటే ఇంద్రుడు అన్నారు " ఆ విషయం నాకు తెలుసు కాని యాగం చేయాలంటే ఎన్నో సమకూర్చుకోవాలి, పైగా శ్రమతో కూడుకున్నది కనుక మీ సమయం వృధాకాకుండా ఈ మణి చూస్తుంది, అన్ని ఏర్పాట్లు చేస్తుంది, మీరు ఇంకా ఎక్కువగా లోకకళ్యాణం కోసం యాగాలు చేయవచ్చు " అన్నారు. సరే అని తీసుకున్నాను. ఇన్నాళ్ళకు మీ అతిధిమర్యాదలకోసం ఆ మణి ఉపయోగపడింది అని తెలియచేసారు.
గణుడు " ఆ మణి మీదగ్గర ఉండి ఉపయోగమేముంది, నాలాంటి చక్రవర్తి దగ్గర ఉంటే ప్రజలకు ఉపయోగిస్తుంది. ప్రజలు కష్టపడకుండా ఆనందంగా జీవించవచ్చు " అంటే మహర్షి నేటికీ వర్తించే కొన్ని అద్భుత విషయాలు చెప్పారు.
" రాజా నీ ఆలోచనే తప్పు. ఎవరైనా సరే తన తిండికోసం, సుఖాలకోసం కష్టపడి సంపాదించుకోవాలి. ఊరికే వచ్చేదానికి అలవాటుపడితే ప్రజలు సోమరులు అవుతారు. సమయం ఎలా గడపాలో తెలియక వ్యసనాలకు అలవాటు పడతారు. దొంగతనాలు హత్యలు చేస్తారు. ఆ కారణంగా జాతి నిర్వీర్యమై రాజ్యం/దేశం భ్రష్టు పట్టిపోతుంది " అంటారు మహర్షి. ఎంతటి అద్భుత సందేశం.
ఈనాటి ప్రభుత్వ ఉచితపథకాలకు భవిష్యత్తులో జరగబోయేది ఇదే. వేల సంవత్సరముల క్రితమే మన ఋషుల దృక్పథం ఇది. అదీ మన సనాతనధర్మం గొప్పదనం.
ఋషులు చేసే పనులన్నీ సమాజ శ్రేయస్సు కోసమే.
శుభమస్తు
No comments:
Post a Comment