Saturday, September 6, 2025

 ఆడపిల్లకు ఎలాంటి వరుడిని నిర్ణయించాలని భీష్ముడు  చెప్పారు?!

ధర్మరాజుకు వివాహ నిర్ణయం ఎలా చెయ్యాలో వివరిస్తూ భీష్ముడు చెప్పిన మరోకథ..

అష్టావక్రుడు అనే మునికుమారుడు వదాన్యుడి కుమార్తె సుప్రభను చూసి మోహించాడు. ఆమెనే వివాహం చేసుకోవాలని అనుకుని తనకోరికను వదాన్యుడికి తెలిపాడు.  దానికి వదాన్యుడు "కుమారా ! ఉత్తరదిక్కున కుబేరుడినగరం దాటినతర్వాత ఉన్న హిమాలయ పర్వతాలలో శివుడికొరకు పార్వతీదేవి తపస్సు చేసిన అతిపవిత్రమయిన ప్రదేశముంది.

అక్కడ పార్వతీ పరమేశ్వరులు విహరిస్తుంటారు. ఆప్రదేశం దాటితే ఒక వనం కనిపిస్తుంది. అక్కడ ఒక ప్రౌఢ వయస్కురాలైన స్త్రీ కనిపిస్తుంది. నీవు ఆ స్త్రీని కల్సివస్తే నీకు నాకుమార్తెనిచ్చి వివాహంచేస్తాను" అని  చెప్పాడు.   “సరే !” అని..అష్టావక్రుడు కుబేరుడుండే నగరానికి చేరుకుని కుబేరుడిని కలుసుకున్నాడు. 

కుబేరుడు మునివర్యులకు ఆతిథిసత్కారాలు చేసాడు. కుబేరుడు ఏర్పాటుచేసిన అందమైన నృత్యాలుచేసిన స్త్రీలెవరూ అష్టావక్రుడిని ఆకర్షించ లేదు. తరువాత శివపార్వతులు విహరిస్తున్న ప్రదేశం చేరుకున్నాడు.  అదిదాటి వదాన్యుడు చెప్పిన గుర్తులప్రకారం కడిమివనానికి చేరుకున్నాడు. అక్కడ ఎన్నో బంగారు మేడలనుచూసి తానొచ్చినట్టు వారికి వర్తమానంపంపాడు.

అందమైనవనితలు అతడికి ఎదురొచ్చి స్వాగతంచెప్పి అష్టావక్రుడిని లోనికి తీసుకెళ్ళారు. అక్కడ అష్టావక్రుడిని వదాన్యుడు చెప్పిన ప్రౌఢవనిత కలిసింది. ఆమె అతడిని తన పక్కన కూర్చోబెట్టుకుని అతడికెన్నో మర్యాదలు చేసింది. ఇంతలో రాత్రయింది. చలివేళలో అతడి పక్కనచేరిన ఆ ప్రౌఢవనిత అతడిలో ఎటువంటి చలనం లేకపోవడం గమనించింది.

"ఆర్యా ! పురుషులైనమిమ్ము నావంటి అందమైన స్త్రీ ఆకర్షించలేకపోవడమేమిటి ?  నా సంపదలన్నీ నీ పరంచేస్తాను నన్ను మీభార్యగా స్వీకరించండి. నేను మీ సేవచేసుకుని బ్రతుకుతాను" అని వేడుకుంది. అష్టావక్రుడు "అమ్మా ! పరస్త్రీలను కోరడందోషం. బ్రాహ్మణుడు శూద్రస్త్రీని చేరడం అత్యధిక దోషం. అదే బ్రాహ్మణస్త్రీ శూద్రుడిని చేరితే అది మహాపాతకము. నేను అవివాహితుడను కనుక నేను ఒకకన్యను వివాహం చేసుకోదలిచాను" అన్నాడు. అదివిని ఆ ప్రౌఢవనిత "అర్యా ! నేను మీ అందానికి వశురాలనైపోయాను.

మోహపరవశులు అయినవారు వావీవరుసలు, వంశహాని గురించి లెక్క చేయరుకదా ! నన్ను వివాహమాడండి" అని వేడుకుంది. అష్టావక్రుడు "మీరిలా మాటాడతగదు. ఇలాటివారిని నేను ఎరుగను. నీ కోరికమానుకో " అని పలికాడు. అప్పుడు ఆ స్త్రీ చిరునవ్వునవ్వి, "పోదువులేకాని ఉండు" అన్నది. అష్టావక్రుడు "నువ్వునాకు దూరంగా ఉంటేఉంటాను" అని మనసులో "ఈమె ఎవరో శాపగ్రస్థలా ఉంది. లేకున్న ఇలా ప్రవర్తించదుకదా !" అనుకున్నాడు.

తెల్లవారిన తరువాత అష్టావక్రుడికి ఆ స్త్రీ స్నానానికి తగిన ఏర్పాటు చేసింది. స్నానము తర్వాత అతడికి మృష్టాన్నభోజనం పెట్టి, విశ్రమించడానికి శయ్యను ఎర్పాటుచేసి విశ్రమించమని చెప్పింది. అష్టావక్రుడు అందుకు అంగీకరించకపోవడంతో ఆమె  "మహాభాగా ! నేను కన్యనే... తగినవరుడు దొరక్క ఇలా కన్యగా మిగిలాను. 

నా అదృష్టంవల్ల మీరు దొరికారు. కనుక నన్ను వివాహమాడండి" అంది.  అష్టావక్రుడు "అమ్మా ! బాల్యంలో తండ్రి, వివాహం తర్వాత భర్త, వృద్ధాప్యంలో కుమారుని సంరక్షణలో స్త్రీ జీవించాలి. కానీ స్త్రీ ఎన్నటికీ స్వతంత్రురాలుకాదు. కనుక నీకు నీవుగా వివాహం చేసుకోకూడదు. నన్ను అలా కోరినా నేను అందుకు అంగీకరించను. ఇంతకూ నీవెవరు ? నన్నిలా ఎందుకు పరీక్షిస్తున్నావు ?" అని అడిగాడు. 

ఆమె "మహాభాగా ! నిన్ను పరీక్షించడానికి వదాన్యుడు నన్ను ఇక్కడకుపంపాడు. నీనిష్టకు నేనుమెచ్చాను. వదాన్యుడు కూడా నిన్నుఅల్లుడుగా అంగీకరించి తన కుమార్తెనిచ్చి వివాహముచేస్తాడు" అని చెప్పింది. అష్టావక్రుడు ఆమెకు నమస్కరించి తిరిగివెళ్ళాడు.

వదాన్యుడు తన కుమార్తె సుప్రభను అష్టావక్రుడికిచ్చి వివాహంచేసాడు. “కనుక ధర్మనందనా! వరుడి గుణగణాలను పరీక్షించి కన్యను ఇవ్వాలి” అంటూ వర నిర్ణయం గురించి వివరించాడు🕉️🌹🙏

No comments:

Post a Comment