Tuesday, February 18, 2020

శివపురాణం – లింగావిర్భావం

ఒకనాడు లింగావిర్భావకాలమునందు ఒకానొక కల్పంలో బ్రహ్మకి శ్రీ మహావిష్ణువుకి ‘నేను అధికుడను అంటే నేను అధికుడను’ అని వాదోపవాదం జరిగింది. వీరి మధ్య వాదోపవాదం జరుగుతుండగా అది తీవ్రస్థాయిని పొందుతుంటే దేవతల మొరవిన్న పరమేశ్వరుడు ఒక జ్యోతి స్తంభంగా వారిమధ్య ఆవిర్భవించాడు. దాని ఆది కనుక్కోవడానికి శ్రీమహావిష్ణువు వరాహరూపంలో భూమిని తవ్వుకుంటూ వెళ్ళారు. బ్రహ్మగారు హంసవాహనం ఎక్కి దాని చివర కనుక్కుందుకు వెళ్ళారు. బ్రహ్మగారు వెళుతూ ఉండగా కేతకీ పుష్పం(మొగలి పువ్వు) ఒకటి క్రింద పడింది. దానిని నీవు ఎక్కడి నుంచి వస్తున్నావు?” అని అడిగారు. అపుడు మొగలిపువ్వు ఎవరో ఒక మహానుభావుడు పరమభక్తితో నన్ను శంకరుడి మీద వేశాడు. అక్కడి నుంచి నేను క్రింద పడ్డాను. మీరు ఎక్కడికి వెడుతున్నారు?” అని అడిగింది. అపుడు బ్రహ్మగారు నాకొక ఉపకారం చేస్తావా?’ అని అడిగాడు. ఏమిటి కావాలి మీకు?” అని అడిగింది మొగలిపువ్వు. ఆయన “క్రింద శ్రీమన్నారాయణుడు ఉంటారు. నేను ఆ పైభాగమును చూశానని సాక్ష్యం చెప్తావా? అని అడిగాడు. చెప్తాను అన్నది మొగలి పువ్వు. బ్రహ్మగారు మొగలిపువ్వుతో కలిసి క్రిందకు వచ్చారు. శ్రీమహావిష్ణువును ఆయన చూసి వచ్చారా? అని అడిగారు. అపుడు విష్ణువు నాకు కనపడలేదు. ఎంతదూరం వెళ్ళినా నేను కనుగొనలేకపోయాను అన్నారు.
అపుడు బ్రహ్మ గారు నేను చూసి వచ్చాను. సాక్ష్యం ఈ కేతకీ పుష్పం అన్నారు. ఇప్పుడు జ్యోతి స్తంభంగా ఉన్న పరమాత్మ సాకారమును పొంది బ్రహ్మగారితో బ్రహ్మా నీకు దర్శనం అయిందని అబద్ధం ఆడావు. కాబట్టి నీకు భూమియందు పూజ లేకుండుగాక! కానీ బ్రహ్మ స్థానమని ఒక స్థానం ఉంటుంది. ఆ స్థానమునందు ఆవాహన పొంది నీవు గౌరవింపబడుతుంటావు. మహావిష్ణువు నేను చూడలేదు అని చెప్పారు కాబట్టి నాతో సమానంగా ఆయనకు వైభవోపేతంగా పూజలు ఉంటాయి. ఆ ఉత్సవములకు నీవు ఆధిపత్యం వహిస్తూ ఉంటావు. అందుకే బ్రహ్మోత్సవం అని బ్రహ్మగారి రథం ఉత్సవములకు ముందు నడుస్తుంది. కేతకీ పుష్పం అబద్ధం చెప్పింది కాబట్టి ఈ పుష్పం నా పూజయందు వినిమయం అవకుండుగాక! ఇప్పుడు కేతకీ పుష్పం నాకు పూజార్హత లేదా అని బాధపడింది. నాకు పూజింపబడవు కానీ నా భక్తులయిన వారు నిన్ను తలలో ధరిస్తారు. వారు ధరిస్తే నేను ఎక్కువ ప్రీతి పొందుతాను. పూజ జరిగే ప్రాంగణం మొగలి పువ్వులతో అలంకారం చేస్తే ప్రీతి పొందుతాను. అని చెప్పాడు. అలా ఏర్పడిన శివలింగం జ్యోతి స్తంభంగా ఏర్పడినదే మహాశివరాత్రి. ఇది మెల్లమెల్లగా లింగాకృతి తగ్గిపోయి కంటిచే చూడదగినటువంటి లింగాకృతిని పొందిన రూపమే అరుణాచలంలో ఉన్న కొండ. ఆ శివుడు నిర్దేశించిన తరువాత పూజ ప్రారంభమయిన రోజే మహాశివరాత్రి. కాబట్టి భగవత్ స్వరూపములు అన్నీ సమానములే. ఎన్ని దీపములు వెలుగుతున్నా వెలుగుతున్నది ఒక్క జ్యోతి రూపమే. ఇన్ని రూపములుగా ఉన్నది ఒక్కటే అని మీరు తెలుసుకోవాలనే జ్యోతిర్లింగం ఆవిర్భవించింది.
శివలింగమునకు ఒక విశేషం ఉంది. మొట్టమొదట అన్నిటికన్నా గొప్పదయినా లింగమును స్వయంభూ లింగము అని పిలుస్తారు. ఆ లింగమును ఒకరు ప్రతిష్ఠ చేయరు. తనంత తాను వెలుస్తుంది. శ్రీశైలాది క్షేత్రములు ఇందుకు ఉదాహరణ. రెండవది దివ్య లింగములు ఇవి దేవతలు ప్రతిష్ఠ చేసినవి. కుమారస్వామి ప్రతిష్ట చేసిన సామర్లకోటలోని కుమారారామం ఇందుకు ఉదాహరణ. మూడవది మానుష లింగములు. ఇవి మనుష్యులు ప్రతిష్ఠ చేసినవి. తరువాత ఆర్ష లింగములు. ఇవి మహర్షులు ప్రతిష్ఠ చేసినవి. రాక్షస లింగములు. రాక్షసులు ప్రతిష్ఠ చేసినవి. దైవిక లింగములు వాటంతట అవి ఏర్పడతాయి. అరకువేలీలోని బుర్రా గుహలలో పైనుండి నీటి బిందువులు క్రిందపడతాయి. కొండ ఉపరితలం ఎక్కడో పైన ఉంటుంది. పైనుండి నీటి బిందువు ఒకేచోట బయలుదేరి క్రింద ఒకేచోట పడుతుంది. ఆ నీటి బిందువు పడినప్పుడల్లా క్రింద ఉన్న భూమి కొద్దికొద్దిగా పైకి లేస్తూ శివలింగంగా మారిపోతుంది. ఇది క్రమక్రమంగా పెరిగి చివరకు ఎక్కడి నుండి నీరు పడుతోందో ఆ ప్రదేశమును తాకి ఇంక నీరు పడకుండా ఆపేస్తుంది. అలా అది మర్రిచెట్టు ఊడలా పెరిగిపోతుంది. దీనిని దైవిక లింగం అంటారు. బాణ లింగములు అని ఉంటాయి. అవి నర్మదానది ప్రవాహము ఒరిపిడి చేత ఏర్పడతాయి.
లింగము అరూపరూపి. ఉపాసనలో లింగోపాసన ఒక మెట్టు పైన ఉంటుంది. మీకు శివలింగమును చూపించి ఆ శివలింగం ఎటువైపు చూస్తోంది అని అడిగినట్లయితే దానికి సమాధానం చెప్పడం తేలికయిన విషయం కాదు. యథార్థమునకు మీరు శివాలయంలోపల కూర్చుని శివలింగమునాకు అభిషేకం చేయడం కన్నా రుద్రాధ్యాయంతో అర్చక స్వాములు అభిషేకం చేస్తుండగా బయట కూర్చుని కైమోడ్చి నమస్కరిస్తే దానివలన మీరు ఎక్కువ ప్రయోజనమును పొందుతారు. ఇది సాక్షాత్తు చంద్రశేఖరపరమాచార్య స్వామివారు చెప్పినమాట.
శివలింగంలో తూర్పుకు చూస్తున్న దానిని తత్పురుష ముఖము అంటారు. ఇది వాయువుకు అధిష్ఠానంగా ఉంటుంది. దీనివలన అజ్ఞానం కలుగుతుంది. దక్షిణమునకు చూసే ముఖమును అఘోర ముఖము అంటారు. ఇది అగ్నిహోత్రమును శాస్తిస్తుంది. అది అగ్నిహోత్రంగా ఉంటుంది లయం చేస్తుంది. ఇది మీ అజ్ఞానమును దహించేస్తూ జ్ఞానమును కూడా ఇస్తుంది. పశ్చిమానికి ఒక ముఖం చూస్తుంది. దీనిని సద్యోజాత ముఖం అంటారు. పశ్చిమ ముఖం నుండి పాలు, నీళ్ళు విభూతి, పళ్ళరసములు కారిపోతుంటే అది తడిసినప్పుడల్లా మీకు పరమేశ్వరుని అనుగ్రహం కలిగేస్తూ ఉంటుంది. అది భూసంబంధంగా ఉంటుంది. అది సృష్టికి కారణం అవుతుంది. అందుకే లోకంలో పిల్లలు పుట్టలేదని అంటే సుందరకాండ పారాయణం చేసుకోమని గాని, శివాభిషేకం చేసుకోమని గాని చెప్తారు. దుష్ట నక్షత్రంలో పిల్లాడు పుట్టాడు అని చెప్తే సుందరకాండ పారాయణ/శివాభిషేకం చేసుకోమని చెప్తారు. అపమృత్యువు వస్తుందేమోనని భయంగా ఉంది అంటే సుందరకాండ పారాయణం చేసుకోమని గాని, శివాభిషేకం చేసుకోమని గాని చెప్తారు. పీడకలలు వస్తున్నాయని చెప్తే సుందరకాండ పారాయణం చేసుకోమని గాని, శివాభిషేకం చేసుకోమని గాని చెప్తారు. ఈ రెండు క్రియలె చెప్తారు. ఎందుచేత? హనుమ శివాంశ. వర్షములు పడకపోతే శివలింగామునకు అభిషేకం చెయ్యండని చెప్తారు. అభిషేకం చేస్తే వామదేవ ముఖం కానీ తడిసినట్లయితే పరమేశ్వర అనుగ్రహం వలన వర్షములు పడతాయి. పైకి ఒక ముఖం చూస్తూ ఉంటుంది. దానిని ఈశానముఖం అంటారు. దీనిని సదాశివ అని పిలుస్తారు. ఇది ఆకాశ స్వరూపియై ఉంటుంది. ఇదే మోక్షమును కటాక్షిస్తుంది. ఈ అయిదు ముఖములతో పంచభూతములను శాసిస్తోంది. సృష్టి స్థితి లయ అజ్ఞాన మోక్షములకు కారకం అవుతుంది. సమస్త ఫలితములను ఇస్తుంది. కాబట్టి శివలింగం చల్లబడడం ఊరంతా చల్లగా ఉండడమే.
అసలు లింగమునకు బాహ్యమునందు ఏమీ లేదు. బ్రహ్మాండములన్నీ లింగాకృతిలోనే ఉన్నాయి. లింగమునకు పూజ చేస్తే సమస్త లోకములకు పూజ జరిగినట్లే. శివాలయమునకు వెళ్ళినపుడు ముఖ్యంగా ఎనిమిది కనపడతాయి. మనం ఒక అపచార ధోరణి చేస్తూ ఉంటాము. శివాలయం గోడకు ఆనుకోవడం, స్తంభాలను ఆనుకోవడం చేస్తుంటాము. ఆ గోడలు, స్తంభములు అన్నీ ఈశ్వర స్వరూపమే అయి ఉంటాయి. దేవాలయ గోడను కొట్టినట్లయితే శాస్త్రం ప్రకారం శివుడిని కొట్టినట్లుగానే పరిగణింపబడుతుంది. శివాలయం నందు ఎనిమిది రూపములలో లింగం ఉంటుంది. అందుకే పూర్వం పెళ్ళిళ్ళు గాని, జరిగితే ధ్వజస్తంభం ఎక్కడివరకు కనపడుతోందో అక్కడ మేళతాళములు ఆపుచేసేవారు. గోపురంగా శివుడే ఉంటాడు. రెండవది శివుడు గర్భాలయ శిఖరంగా ఉంటాడు. ధ్వజస్తంభం శివుడు. ఇప్పటికీ కొన్ని దేవాలయములలో బలి పీఠమునకు, ధ్వజ స్తంభానికి అభిషేకం చేస్తారు. లోపల ఉన్న శివలింగమును మహాలింగం అని పిలుస్తారు. పెద్ద పెద్ద దేవాలయములలో కొన్ని మహాలింగముల మీద చారికలు ఉంటాయి. ఆ గీతలను బ్రహ్మసూత్రములు అని పిలుస్తారు. అవి సాధారణంగా స్వయంభూ లింగముల మీద ఉంటాయి.
శివాలయంలో ఉన్న ప్రధాన లింగమును ‘మూల లింగము లేక మహాలింగము’ అని పిలుస్తారు. చందీశ్వరుడు ఒక లింగము. ఇవి కాకుండా అర్చక స్వామి ఒక లింగము. అందుకే నందికి శివుడికి మధ్య అర్చకుడు వెళ్ళవచ్చు. శివాలయంలో దేవతామూర్తులు స్థానములు మారడానికి వీలులేదు. ఎంత పెద్ద శివాలయం అయినా సరే నైరుతిలో విఘ్నేశ్వరుడు, పడమట సుబ్రహ్మణ్యుడు, ఉత్తరమున చండీశ్వరుడు, దక్షిణమునందు దక్షిణామూర్తి, ఆగ్నేయం నందు సోమస్కందుడు, ఈశాన్యము =నందు నటరాజు కాని, భైరవ మూర్తి కాని ఉండాలి.
శివ లింగారాధనం ఎలా చేయాలి అని తెలిసి చెయ్యగలిగితే వాడంత అదృష్టవంతుడు సృష్టిలో లేడు. అభిషేకం చేసేటప్పుడు శివలింగంపై నీటిని సన్నటి ధారగా పోయాలి. అంతేకానీ పంచపాత్రలో నీళ్ళు తీసుకుని ఉద్ధరిణతో పోయకూడదు. అభిషేక జలం తొక్కకూడదు. శివాభిషేకం గురు ముఖతః చేయడం చాలా మంచిది. ఫేంటు ధరించికాని, తోలు బెల్టు పెట్టుకుని గానీ గర్భాలయం లోపలి వెళ్ళకూడదు.

No comments:

Post a Comment