Sunday, November 21, 2021

అసూయపై గెలిచే మార్గం

🍀🌻💥🌹🦚🚩


🔥అసూయపై గెలిచే మార్గం🌹

పగ, ప్రతీకారాలకు ప్రతీక... అసూయ. మానవ సంబంధాల్ని క్షణంలో దిగజార్చి, అంతం చేయడానికి సైతం వెరవని అంటువ్యాధి అసూయ. అది క్షణాల్లో వైషమ్యాలను సృష్టిస్తుంది. ఎంతటి అనుబంధాలనైనా అణుబాంబు కంటే వేగంగా విచ్ఛిన్నం చేస్తుంది.

‘అసూయ లేకపోవడమే అహింస’ అన్నారు వివేకానంద.

రామాయణం, మహాభారతం, అన్నింటిలోనూ అసూయ, ద్వేషం, పగ, ప్రతీకారాల ప్రస్తావన ఉంటుంది. వాటి ఆధారంగా మనిషి ఏ విధంగా జీవించకూడదో తెలియజేసే గ్రంథాలు పుట్టుకొచ్చాయి.

కాలక్రమంలో అవి ప్రామాణిక, ఆధ్యాత్మిక గ్రంథాలుగా రూపాంతరం చెందాయి.

అసూయ అనే నలక మనసులో పడితే చాలు….
పగ పొగ పెడుతుంది.
ద్వేషం ఆజ్యం పోస్తుంది.
ప్రతీకారం దారులు వెతుకుతుంది.
అంతే! అగ్నిజ్వాలలు రగులుకుని ఫలితాన్ని బూడిద రూపంలో మిగులుస్తుంది.

ఆప్యాయత అనగానే పొందే అనుభూతికి, అసూయ అనగానే పొందే భయానికి, చీకటి వెలుగులకున్నంత వ్యత్యాసం కనిపిస్తుంది. ప్రేమ ధైర్యానికి చిహ్నం అయితే, అసూయ భయానికి మారుపేరు.

మనిషికున్న ప్రబల శత్రువుల్లో ఆరోది అసూయ. కోరిక, కోపం, మోహం, లోభం, అహం- వీటిని జయించిన ఎంతటి తపోధనులు అయినా... అసూయకు అతీతులు కాదని చాటే ఉదంతాలు ఎన్నో ఉన్నాయి.

ఇద్దరు మునులు కఠోర తపస్సు చేస్తున్నారు. కొంత కాలానికి దేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలని ఒకరిని అడుగుతాడు.

“సమీపంలో మరో ముని తపస్సు చేస్తున్నాడు, అతడు కోరిన దానికి రెట్టింపు నాకు ఇవ్వమ”ని అడుగుతాడు.

దేవుడు రెండో ముని వద్దకు వెళ్ళి, మొదటి ముని కోరిన కోరిక తెలిపి, “నీకేం కావాలి?” అంటాడు.

వెంటనే ఆ రెండో ముని “నాకు ఒక కన్ను పోవాలి!” అని కోరుకుంటాడు.

“దేవుడు “తథాస్తు!” అంటాడు. ఫలితం తెలిసిందే!

బాల్యంలో ఊహ కలిగినప్పటి నుంచే అసూయ మొదలవుతుంది. అమ్మ ఒక పిల్లవాడిని ముద్దు చేస్తే మరొకరికి అసూయ, అసహనం కలుగుతాయి.

రుక్మిణిపై అసూయ కారణంగానే శ్రీకృష్ణుణ్ని సత్యభామ వీధిలో విక్రయించి, తులాభారం వరకు తీసుకెళ్ళింది.

అసూయను పూర్తిగా త్యజించి అప్రమత్తంగా ఉండేవారు సమస్త విశ్వంలోని ప్రేమను పరిపూర్ణంగా ఆస్వాదిస్తారు. దాన్ని నిస్వార్థంగా పంచగలుగుతారు.

‘అసూయ కలిగినవాళ్లు ప్రశాంతంగా ఉండలేరు. ఎప్పుడూ అసంతృప్తితో, ప్రతీకారేచ్ఛతో, సందర్భం కోసం ఎదురు చూస్తుంటారు. తమకు ఎంత ఉన్నా ఎదుటివారికి ఉన్న ‘కొంత’ను చూసి అసంతృప్తితో రగిలిపోతుంటారు.

నూరుగురు అన్నదమ్ములు, రాజ్యం, సకల సంపదలున్న దుర్యోధనుడు- దాయాదులైన పంచ పాండవులకు సూది మొన మోపినంత భాగం కూడా ఇవ్వననడం అసూయకు పరాకాష్ఠ.

అసూయతో సాధించేది శూన్యమని గ్రహించలేకపోవడం మూర్ఖత్వం. అసూయ కట్టెకు అంటుకున్న నిప్పు లాంటిది. అసూయకు ఆశ్రయం ఇస్తే వారిని అది చెదపురుగులా తొలుస్తూ, ఆఖరికి అస్తిత్వాన్నే ప్రశ్నార్థకం చేస్తుంది.

అసూయను పట్టుకుని శిఖరాగ్రం వరకు ఎవరైనా చేరారనుకోండి. అక్కడి నుంచి కిందకు చూస్తే, ఏ ఒక్క బంధం కనుచూపు మేరలో కనిపించదు. పైకి వెళ్ళలేక, కిందకు రాలేక, త్రిశంకు స్వర్గమనే శూన్యంలో ఒంటరిగా మిగలాలి.

అసూయను వదిలించుకోవాలంటే, ముందు దాని తాలూకు చెడు ప్రభావాలను అర్థం చేసుకోవాలి. అందుకు ఆధ్యాత్మిక సాధన ద్వారా ప్రయత్నం చెయ్యాలి.

‘అసూయను మించిన శాపం మరొకటి లేదు.

అసూయను ‘ప్రేమ, దయ, కరుణలతోనే జయించగలం’ అన్నాడు గౌతమ బుద్ధుడు.*✍️

సేకరణ. మానస సరోవరం 👏

Source - Whatsapp Message

No comments:

Post a Comment