🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 ఆశీర్వాద ఫలం ➖➖➖✍అన్ని కాయలూ పళ్లవుతాయా? కావు. గుత్తులు గుత్తులుగా పూలు పూస్తాయి. అవన్నీ కాయలై, పళ్లయితే ఎంత పంట? అలా పండదు. అలా జరగదు. మతి ఎంతో గతి అంతే అంటారు. మనదైనది మనకు వస్తుంది. మనది కానిది మనకు రాదు. ఇలాంటి కర్మ సిద్ధాంతం మన నరనరాల్లో జీర్ణించుకుపోయి ఉంది. దీన్ని కొంతమంది ఒప్పుకోరు.దైవ ఆశీర్వాదం అందరికీ సమానమే. ఏ జీవికైనా సరే, అందులో తేడాలు ఉండవు. కొందరికి ఆ ఆశీర్వాదం వెంటనే ఫలిస్తుంది. కొందరికి ఫలించదు. కారణం దైవంలో లేదు. మనలో ఉంది. పాకం శుద్ధిగానే ఉంది. భాండం శుద్ధిగా లేదు! ఇచ్చేవాడు ఆలోచించకుండా ఇస్తున్నాడు. పుచ్చుకొనేవాడిలోనే ఎన్నో ఆలోచనలు. ఇవే ఆశీర్వాదాన్ని అడ్డగిస్తున్నాయి. అర్హత-యోగ్యత మనల్ని ఈ భూమి మీద ఉంచాయి. ఇక్కడ ఎవరి పని వారికుంది. ఖాళీగా ఎవరూ ఉండే ఏర్పాటు లేదు. ఎవరివంతు పాత్రను వాళ్లు చక్కగా పోషించాలి. ఒక పెద్ద యంత్రంలో అతి చిన్న మరకు సైతం ప్రాధాన్యం ఉంటుంది. ప్రపంచం పని ప్రపంచం చేస్తుంది. మన పని మనం చెయ్యాలి. అది అలా ఉండకూడదు, ఇది ఇలా ఉండాలి అని గీతలు గీసి వేలు పెట్టకూడదు. అనవసరంగా నెత్తిమీదకు తెచ్చుకోకూడదు.మన పనిలో మనం లీనమైతే, మన యోగ్యత మన అర్హతను వెలుగులోకి తెస్తుంది. దైవ ఆశీర్వాదం పని చేయడం ప్రారంభిస్తుంది. ఊహించని శుభాలు కలుగుతాయి. అర్థంకాని అదృష్టం మన వెంట పడుతుంది. ఇది ఆశీర్వాద ఫలం. కనిపించకుండా పని చేసే గొప్ప భావమే ఆశీర్వాదం.శ్రీకృష్ణుడి ఆశీర్వాదం వల్ల పాండవులను విజయలక్ష్మి వరించింది. శ్రీరాముడి ఆశీర్వాదం వల్ల హనుమంతుడు లంకను చేరుకొని సీతమ్మ జాడ తెలుసుకోగలిగాడు. ఈ ఆశీర్వాదం అందరికీ ఒకేలా ఫలితాలను ఇవ్వదని కొందరి భావన.సారవంతమైన భూమిలో నాటిన విత్తు తప్పక ఫలిస్తుంది. సందేహం లేదు.ఆశీర్వాద బలం ఫలాన్ని ఇస్తుంది. మట్టి సారవంతమైనది కాకపోయినా మట్టికి బలాన్ని, మంచి విత్తనాన్ని రెండూ అదే ఇస్తుంది. అదే మహానుభావుల ఆశీర్వాద ఫలం. ఒక పని మనం చేపట్టినప్పుడు చాలా శక్తులు అవసరమవుతాయి విజయం సాధించడానికి- కనిపించేవి కొన్ని, కనపడనివి కొన్ని. వాటిలో మన పని ముందుకు సాగనివ్వకుండా అడ్డుకట్ట వేసేవీ ఉంటాయి. వాటిని తొలగించేది ఆశీర్వాద బలం. మంచి మనుషులు మనకు మంచి జరగాలని, విజయం సాధించాలని కోరుకుంటారు. ఆప్తులు మనకు సహాయం చేస్తారు. దేవతలు ఆశీర్వదిస్తారు.పనికి ముందే మనం ఆశీర్వాదం సంపాదించుకోవాలి. అప్పుడు పట్టిందల్లా బంగారం అవుతుంది. అయితే ఆశీర్వాదం ఎలా దొరుకుతుంది, ఏం చెయ్యాలి? మంచి పనులు చేసేవారు ఆశీర్వాదం కోసం ప్రత్యేకంగా ప్రయత్నం చేయనక్కరలేదు. లోక హితం కోసం చేసే పనుల కోసం దేవతలే మనుషుల రూపంలో వచ్చి సహాయం చేస్తారంటారు. గొప్ప పనులు చేసేవారికి ఆశీర్వాద వర్షం కురుస్తుంది. చెడ్డ పనులు చేసేవాళ్లు దేవతలను పూజించినా, ఆ పూజలు ఫలించవు. ఆశీర్వాదం లభించదు. మన కర్మల్లో గుణ విశేషాలను బట్టే ఆశీర్వాద శక్తి మనకు అండగా ఉండి నడిపిస్తుంది. పుణ్య పురుషులకు… ఎండలో నడిచే మనిషికి పట్టే గొడుగులా ఆశీర్వాదం వెంట ఉంటుంది. సందేహం లేదు!కళ్లకు దేవతలు కనిపించరు. మన పనులు ఫలించే విధానాన్ని బట్టి వాళ్ల ఆశీర్వాదం ఎంతగా పని చేస్తుందో అర్థమవుతుంది. నమ్మేవాళ్లు నమ్ముతారు. నమ్మనివాళ్లు మంచి పనులు చేసినా, దైవ ఆశీర్వాదం తోడవుతుంది.✍. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🌷🙏🌷 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
సేకరణ
సేకరణ
No comments:
Post a Comment