Monday, December 13, 2021

అనుభూతి - ధ్యానం ద్వారా, నా మనస్సును అత్యున్నత లక్ష్యంపై కేంద్రీకరించగలిగినందుకు నేను కృతజ్ఞతతో ఉన్నాను.

365 రోజులు✈️ హార్ట్ ఫుల్ నెస్🌍కథతో

♥️ కథ-36 ♥️

అనుభూతి - ధ్యానం ద్వారా, నా మనస్సును అత్యున్నత లక్ష్యంపై కేంద్రీకరించగలిగినందుకు నేను కృతజ్ఞతతో ఉన్నాను.

ఏకాగ్రతతో పని చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

ఆల్ఫ్రెడ్ ఇంగ్లండ్ చరిత్రలో ప్రసిద్ధి చెందిన రాజు. అతను ప్రజల మంచి కోసం అనేక గొప్ప కార్యాలను చేశాడు, దాని కారణంగా అతన్ని 'ఆల్ఫ్రెడ్ ది గ్రేట్' అని కూడా పిలుస్తారు.

మొదట్లో, మంచి చెడుల వ్యత్యాసం లేకుండా పూర్వీకులను గుడ్డిగా అనుసరించే ధోరణి కారణంగా, ఆల్ఫ్రెడ్ కూడా అందరి సాధారణ రాజుల్లాగే విలాసవంతమైన జీవితాన్ని గడిపాడు.
అతని జీవితం కేవలం తినడం, త్రాగడం, ఆనందించడంలో మునిగిపోయింది.
సముద్రంలో పడిన ఎండుగడ్డి అలలతో పాటు పైకి లేచి పడుతున్నట్లుగా, అతనికి తన జీవితం మీద నియంత్రణలేక, పూర్తిగా గందరగోళ పరిస్థితిలో ఉంది.

ఒక రోజు ఆ బద్ధకమే శత్రువులకు ప్రయోజనకరంగా మారింది. రాజ్యాన్ని ఇతరులు స్వాధీనం చేసుకోవడంతో, ఆల్ఫ్రెడ్ పదవీచ్యుతుడయ్యాడు.
అక్కడక్కడా తిరుగుతూ కష్టపడుతూ, ఆల్ఫ్రెడ్ ఒక రైతు ఇంట్లో పని చేయాల్సి వచ్చింది.

వంటగదిలో పాత్రలు కడగడం, నీరు నింపడం, ఇలా అన్నిరకాల పనులు అతనికి అప్పగించబడ్డాయి.
అతని పనిని రైతు భార్య పర్యవేక్షించేది. ఆల్ఫ్రెడ్ తన జీవితాన్ని అజ్ఞాతంలో గడపవలసివచ్చింది.
ఒకరోజు రైతు భార్య ఏదో ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళవలసివచ్చింది.
పొయ్యి పైన ఉడుకుతున్న కూరను వదిలి, ఆమె తిరిగి వచ్చే వరకు దానిని చూడమని ఆల్ఫ్రెడ్ ను అడిగింది.
ఆమె తన పని ముగించుకుని తిరిగి వచ్చేసరికి, ఆల్ఫ్రెడ్ కూర్చుని పగటి కలలు కంటున్నాడు, అంతేకాకుండా కూర మొత్తం మాడిపోయిఉంది.

దానితో ఆమె - "మూర్ఖుడా ! నువ్వు ఆల్ఫ్రెడ్ రాజు ప్రభావంలో ఉన్నట్లు అనిపిస్తోంది! ఏకాగ్రతతో ఏ పనిని పూర్తి చేయలేవు. అతనిలాగే నువ్వు కూడా కష్టపడుతూ తిరుగుతావు." అని అంది.
పాపం ఆమెకు తాను ఆల్ఫ్రెడ్ తోనే మాట్లాడుతోందని తెలియదు.

కానీ ఆల్ఫ్రెడ్ తన తప్పును గ్రహించాడు, "నేను ఏ పని చేసినా పూర్తి ఏకాగ్రతతో చేస్తాను. ఊహాల్లో కోటలు కట్టి ప్రయోజనం లేదు!" అని ధృడంగా నిశ్చయించుకున్నాడు.

ఆల్ఫ్రెడ్ తన మిత్రపక్షాలతో మళ్ళీ కలిసాడు.
ధనం సేకరించి, సైన్యాన్ని సమీకరించి, శత్రువుపై దాడి చేసి, లండన్ ను తిరిగి స్వాధీనం చేసుకున్నాడు.
ఈసారి అతను మొత్తం ఇంగ్లాండ్ ను ఒక తాటిపై నిలిపి, నూతన ఉత్సాహంతో, అవగాహనతో, పూర్తి ఏకాగ్రతతో పని చేశాడు, అది దేశ పురోగతికి దారితీసింది.

ఒకరోజు, ఆల్ఫ్రెడ్ రైతు ఇంటికి తిరిగి వెళ్లి, "అమ్మా! ఆరోజు మీరు నాకు గుణపాఠం చెప్పకపోతే, నేను ఈ స్థితికి వచ్చేవాడిని కాదు" అని ఆ స్త్రీకి చాలా ధనం ఇచ్చాడు.

తన క్రింద ఉన్నవారి నుంచి కూడా మంచి సలహాలను స్వీకరించి, గౌరవించే ఆయన గుణం ఇప్పటికీ
కొనియాడబడుతుంది.

ఆ రోజు అలాంటి మహానుభావుడితో అనాలోచితంగా పరుషమైన మాటలు మాట్లాడినందుకు ఆ మహిళ అపరాధ భావనకు గురైంది.


♾️


జీవితంలో అత్యంత క్లిష్టమైన పరిస్థితులలో కూడా ఒక క్షణం ఆగి, పరిస్థితిని విశ్లేషించి, తదనుగుణంగా చర్య తీసుకోగలిగేలా మనస్సును నిశ్చలంగా ఉంచడమే ధ్యానం యొక్క ఉద్దేశ్యం.

దాజీ



హార్ట్ ఫుల్ నెస్ ధ్యానం 💌


అనువాదబృందం ఆంధ్రప్రదేశ్

సేకరణ

No comments:

Post a Comment