Thursday, March 10, 2022

కథ - ఈ ప్రపంచంలో ఎవరు నిజంగా సంతోషంగా ఉన్నారు? అసలైన ఆనందం యొక్క రహస్యం.

365 రోజులు✈️హార్ట్ ఫుల్ నెస్🌍కథతో


♥️ కథ-130 ♥


ఈ ప్రపంచంలో ఎవరు నిజంగా సంతోషంగా ఉన్నారు?


అసలైన ఆనందం యొక్క రహస్యం

ఒకానొకప్పుడు ఒక యువకుడు ఉండేవాడు, అతను అసాధారణంగా చురుకైన మనస్సు కలిగినవాడు. ఏదైనా చాలా త్వరగా, సులభంగా నేర్చుకునే ప్రత్యేకమైన ప్రతిభను కలిగినవాడు. చాలామందికి ఏదైనా నేర్చుకోవడానికి కొన్ని నెలలు లేదా సంవత్సరాలు పడుతుంది, అయితే అదే విషయాన్ని అతను కొద్ది రోజుల్లోనే నేర్చుకోగలడు.


అతని కీర్తి చాలా దూరం వ్యాపించి, అంతటి తెలివితేటలు కలిగినవారు ఎవరూ లేరని అందరూ చెప్పుకోవడం మొదలుపెట్టారు. కానీ లోలోపల అసంతృప్తిగా, కొంత కలవరానికి గురవుతున్నాడని అతనికిమటుకే తెలుసు. ప్రతి వ్యక్తికీ, బయటవారికి ఎలా కనిపించినా, తన అంతర్గత స్థితి గురించి, లోపల నుండి తాను ఎలా ఉన్నాడో తెలుస్తుంది. అలాగే ఇతను కూడా అంతర్గతంగా చాలా ఇబ్బందిపడుతున్నాడు, కానీ తన అహంకారంతో, గర్వంతో తన ఇబ్బందులను కప్పిపుచ్చాలనుకున్నాడు. చాలా మంది చేసేది ఇదే.


తన కీర్తిని మరింతగా పెంచుకోవడానికి రకరకాల కొత్త విషయాలను ఎప్పటికప్పుడు నేర్చుకుంటూనే ఉన్నాడు. చిత్రలేఖనం, శిల్పాలు చేయడం, పాటలు పాడడం, చక్రాలు చేయడం కూడా అతను నేర్చుకున్నాడు. ఇప్పటి వరకు జీవితంలో తాను చూసిన పనులన్నీ, చేయడం నేర్చుకున్నాడు.
అతను తన తెలివితేటలు చూసుకుని చాలా గర్వపడుతూఉంటాడు; ఎందుకంటే ఒక సాధారణ వ్యక్తి ఒకటి, రెండు లేదా మహాఅయితే మూడు పనులు చేయగలుగుతాడు. కానీ ఇక్కడ ఉన్న ఈ ప్రత్యేకమైన వ్యక్తి ప్రతిదీ చేయగలగడమే కాకుండా అన్నీ చాలా బాగా చేయగలడు కూడా.


ఒక రోజు అతను, గౌతమ బుద్ధుడిని చూడడం తటస్థించింది.

ఒక వ్యక్తిని చూసి అసూయపడడం అతనికి ఇదే మొదటిసారి. అప్పటిదాకా తనని చూసి అసూయపడే వాళ్లను మాత్రమే చూసాడు.
ఎక్కడ అసూయ ఉంటుందో, అక్కడ పోలిక ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ వ్యక్తి తనను తాను బుద్ధుడితో పోల్చుకోవడం మొదలుపెట్టాడు.

బుద్ధుడి వద్ద ఒక భిక్ష పాత్ర మాత్రమే ఉందని గమనించాడు, కానీ అతని వద్ద చాలా డబ్బు ఉంది. బుద్ధుని బట్టలు చాలా మామూలుగా ఉన్నాయి, కానీ తాను మాత్రం అత్యుత్తమవైనవి, విలువైన దుస్తులతో ఆకర్షణీయంగా ఉన్నాడు. బుద్ధుడు నేలపై చెప్పులు లేకుండా నడుస్తాడు, చెప్పులు లేకుండా నడిచే అవసరం తనకు ఎప్పుడూ రాదు.

ఈ విధంగా, ఆ వ్యక్తి బుద్ధుడిని వందల విషయాలలో పోల్చడం కొనసాగించాడు, కానీ ఎన్నిరకాలుగా పోల్చిచూసినా కూడా, బుద్ధుడి పట్ల అతనికున్న అసూయ ఒక్క శాతం కూడా తగ్గలేదు.


తనలో తాను ఇలా ఆశ్చర్యపోయాడు: "అతని కంటే 100 రెట్లు మెరుగైన జీవితం నాకు ఉన్నప్పుడు, ఈ పేద సన్యాసిని చూసి నేను ఎందుకు అసూయపడుతున్నాను? ! ప్రజలందరూ కూడా అతనికి చాలా గౌరవం ఇస్తున్నారు. అతనిని చూసి నేను అసూయపడే విషయం - అతని వద్ద ఉన్నది, నావద్ద లేనిది, ఏమిటి?"


చాలా సమయం తన స్వంత ఆలోచనలలో, ప్రశ్నలలో మునిగిపోయిన తర్వాత, ఆ వ్యక్తి స్వయంగా బుద్ధుని వద్దకు వెళ్లి అతని విజయరహస్యమేమిటని అడగాలని నిర్ణయించుకున్నాడు.

ఆ వ్యక్తి తన సేవకులతో కలిసి బుద్ధుని వద్దకు వెళ్లి, "నేను ఈ పట్టణంలోకెల్లా అత్యంత తెలివైనవాడిని, చాలా సంతోషకరమైన వ్యక్తిని. మీ చుట్టూ ఏ పని జరుగుతున్నా, ఆ పనులన్నీ ఎలా చేయాలో నాకు తెలుసు. నేను ఏ పనినైనా అతి తక్కువ సమయంలో నేర్చుకోగలను. నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ నన్ను గౌరవిస్తారు. అయినా కూడా నాకు మీ మీద అసూయగా ఉంది. మీరు ఏమి సాధించారో తెలుసుకోవాలన్న ఆత్రుతతో ఉన్నాను. ఇంతమంది మిమ్మల్ని ఎందుకు గౌరవిస్తున్నారు?"

బుద్ధుడు ప్రశాంతంగా ఇలా సమాధానమిచ్చాడు, "అలాంటి విజయాలేమీ నేను సాధించనప్పటికీ, ఒక విజయం సాధించానని మాత్రం చెప్పగలను."
ఆ వ్యక్తి "అదేమిటో నేను తెలుసుకోవచ్చా?", అని అడిగాడు.

దానికి బుద్ధుడు, "నేను సాధించిన విజయాలన్నింటినీ వదిలేసుకోవడమే నేను సాధించిన విజయం", అని అన్నాడు.

ఆ వ్యక్తి ఆశ్చర్యానికి లోనయ్యి, బుద్ధుడితో ఇలా అన్నాడు, " మీరన్నది నాకు అర్ధం కాలేదు."

బుద్ధుడు ఇలా అడిగాడు, "నిన్ను ఎవరైనా మెచ్చుకుంటే నీకు ఇష్టమా?"
దానికి ప్రతిస్పందిస్తూ, "అవును, అందరూ అది ఇష్టపడతారు కదా."

బుద్ధుడు, "మరి దూషిస్తే?"

ఆ వ్యక్తి, "ఈ ప్రపంచంలో ఎవరికీ దూషింపబడటం ఇష్టముండదు కదా?"

బుద్ధుడు ఇలా అన్నాడు, "సంతోషాన్ని కలిగించేదాన్ని, బాధ కలిగించేదాన్ని - నేను రెండింటిని అధిగమించాను. నేను దూషించటం వల్ల బాధపడను, లేదా ఏ ప్రశంసల వల్లా సంతోషించను. అదే నీకు, నాకు మధ్య ఉన్న తేడా."

దానికి అతను, "అది ఎలా సాధ్యమవుతుంది?"

బుద్ధుడు నవ్వి, "మీరు వందలాది విషయాలు నేర్చుకున్నారు, కానీ ఒక ముఖ్యమైన విషయం నేర్చుకోవడం మర్చిపోయారు" అని అన్నాడు.
ఆ వ్యక్తి ఆశ్చర్యంతో, "ఏమిటది?"

"మీ మనస్సును ఎలా నియంత్రించాలో మీకు తెలుసా?", బుద్ధుడు అడిగాడు.

ఇది విన్న వ్యక్తి తన అసూయకు కారణం ఏమిటో తక్షణమే గ్రహించాడు.

బుద్ధుడు ఇలా కొనసాగించాడు, "తన మనస్సును గెలవని వ్యక్తి, ప్రపంచాన్ని జయించినా ఏమీ గెలవనట్టే; తన మనస్సును జయించి, ప్రతిదీ కోల్పోయిన వ్యక్తి వాస్తవానికి ప్రతిదీ గెలిచినట్లే, ఎందుకంటే తన మనస్సును నియంత్రించేవాడు మాత్రమే నిజంగా సంతోషంగా ఉంటాడు."

బుద్ధుని మాటలు వినగానే, ఆ వ్యక్తి యొక్క అహం కరిగిపోయి, బుద్ధుడిని ఇలా అడిగాడు, "నా మనస్సును ఎలా జయించాలో నాకు నేర్పించగలరా?"

బుద్ధుడు, "తప్పకుండా, కానీ మీ విజయాలను మీ నుండి తీసివేయాల్సివస్తుంది", అని సమాధానమిచ్చాడు.

ఆ వ్యక్తి, "నేను సిద్ధంగా ఉన్నాను", అని
ఆ రోజు నుండి ధ్యానం చేయడం ప్రారంభించాడు. ఎందుకంటే మనస్సును అదుపులో ఉంచుకోవడానికి ధ్యానం ఒక్కటే మార్గం అని తెలుసుకున్నాడు కాబట్టి.


మనస్సు ఒక సామరస్య స్థితిలో ఉన్నట్లయితే, బాహ్య పరిస్థితుల, బాహ్య వాతావరణ ప్రభావం దానిపై ఉండదు, అంతరంగంలోని అలజడి కూడా ఉండదు. ధ్యానం యొక్క నిరంతర సాధనతో, మనస్సు ప్రశాంతంగా, స్థిరంగా ఉంటుంది.


♾️


మనస్సు యొక్క కార్యకలాపాలను నిశ్చలపరచడంలో, స్థిరపరచడంలోనే మన ఆనందపు రహస్యం దాగి ఉంది. 🌼
లాలాజీ మహారాజ్

సేకరణ

No comments:

Post a Comment