Monday, March 28, 2022

సృష్టి ఎందుకు?

సృష్టి ఎందుకు?

అందరికీ కలిసి ఒక ప్రపంచం లేనే లేదు...
యెవడి ప్రపంచంలో వాడున్నాడు...
యెవడి స్వప్నప్రపంచం వాడిదే అన్నట్టుగా...

నీ కలలో ఇదే విధమైన సంభాషణే జరిగిందనుకో...
ప్రశ్నించేవాడు...
సమాధానమిచ్చేవాడు...
ఇద్దరూ నీవే కదా అవుతావు....

ఎవడి కలకు వాడే కర్త.
ఎవడి జగత్తుకు వాడే కర్త.
స్వప్న జగత్తుకు...
జాగ్రత్ జగత్తుకు...
ఇంచుకైనా భేదం లేదు...

భగవంతుడు ఎందుకు సృష్టించాడు?
అని ప్రశ్నించేవాడు ఆ భగవంతునికి అభిన్నం.
ఆడించేవాడూ భగవంతుడే...
ఆడేవాడూ భగవంతుడే...

తన మూలం వెళ్లి...
తనలో కలిసిపోయి...
తాను ఒక్కడే శేషించినప్పుడు...
ఆ తాను భగవంతుడే అని అనుభవమాయ్యాక...
ఆ ఏకాత్మస్థితిలో...
సృష్టితో పాటు...
ప్రశ్న, ప్రశ్నించేవాడు కూడా మాయమౌతారు...

"ఎందుకు" అన్న ప్రశ్నకు...
ఖచ్చితమైన సమాధానం...
వాచా ఎప్పటికీ దొరకదు...
తాను భగవంతునిలో అంతర్భాగమై ఉన్నప్పటికీ...
తాను "అదే" అయినప్పటికీ....
మనకు తెలియడం లేదు...

ఒకడు గూబ గుయ్యమనేట్టు చెంపమీద కొట్టాడు...
ఎందుక్కొట్టావు? అని అడిగితే...
నా బలమేమిటో నీకు తెలియడానికి అన్నాట్ట...
ఈ సృష్టి యెందుకు చేశావు?
అని భగవంతుణ్ణి అడిగితే...
నేనొకడ్ని ఉన్నానని...
నీకు తెలియడానికి అన్నాట్ట...

ఇది హాస్యాస్పదంగా అనిపించినప్పటికీ...
సృష్టి కారణమేమి? అన్న ప్రశ్నకు...
ఇంతకు మించి సమాధానం లేదనిపిస్తుంది...

గొంతెత్తి పాట పాడకుంటే...
అతడు గాయకుడు అని ఎలా తెలుస్తుంది?
వీణ పై స్వరాల్ని మీటకుంటే...
అతడు వైణికుడు అని ఎలా తెలుస్తుంది?
రాతిని శిల్పంగా మలచుకుంటే...
అతడు శిల్పి అని ఎలా తెలుస్తుంది?
చిదాకాశమనే తెరపై విశ్వసృష్టిని గీయకుంటే... అతడు భగవంతుడు అని ఎలా తెలుస్తుంది?

బ్రహ్మ మానసపుత్రుడైన వశిష్ఠమహర్షి...
పుట్టుకతోనే శుద్ధబ్రహ్మజ్ఞాని...
అతనికి బంధంగానీ, దుఃఖంగానీ తెలియవు...
నీవు గడియకాలం అజ్ఞానానికి లోనవుదువుగాక...
అని అకారణంగా, ఓ సదుద్దేశంతోనే...
వశిష్ఠునికి శాపం పెట్టాడు బ్రహ్మ...
వశిష్ఠుడు అజ్ఞానవశుడై విచారవదనంతో...
తన అకారణ దుఃఖాన్ని పోగొట్టమని ప్రార్థించగా...
అందుకు బ్రహ్మ చేసిన ప్రబోధమే యోగవాశిష్ఠం...

కష్టసుఖాలనేవి ఎలా ఉంటాయో...
అనుభవంలో ఉన్నప్పుడే...
అందుండి బయటపడడానికి అనువైన బోధను...
లోకులకు చేయగలిగే సమర్థత...
వశిష్ఠునికి వస్తుందనేది బ్రహ్మగారి సదుద్దేశము...

మితం అనేది తెలియకపోతే
అమితం అనేది ఎలా తెలుస్తుంది?
అంతం అనేది తెలియకపోతే
అనంతం అనేది ఎలా తెలుస్తుంది?
బాధ అనేది తెలియకపోతే
ఆనందం అనేది ఎలా తెలుస్తుంది?
అజ్ఞానం అనేది తెలియకపోతే
జ్ఞానం అనేది ఎలా తెలుస్తుంది?

భగవంతుడు చేసిన సృష్టికార్యము కూడా అలాంటిదే...
ఏకంగా ఉన్న తాను ఏకంగా ఉండక...
అనేకమైనాడు అది లీల అయ్యింది....
తిరిగి అనేకం నుండి ఏకం వైపుకు ప్రయాణమయ్యాడు...
అది జీవితం అయ్యింది...

"ఎందుకు?" అని అడిగితే,
లోకవత్ లీలా కైవల్యం అంటుంది బ్రహ్మసూత్రం.
"లీల" అన్నాక ఇంకేం మాట్లాడగలం?
"లీల యెందుకు?" అని అడగలేం.
ఆనందం కోసం ఆడేది క్రీడ.
ఆనందంగా ఉండి చేసేది లీల.

ఎందుకు దుఃఖిస్తున్నావు?
అని అడుగుతామే గాని...
ఎందుకు ఆనందంగా ఉన్నావు? అని అడగం...
దుఃఖానికి కారణం ఉంటుందేగాని...
ఆనందానికి కారణం ఉండదు...

శిశువు అకారణ ఆనందానికి బాహ్యచేష్టలే కేరింతలు...
శివుని అకారణ ఆనందానికి బాహ్యరూపమే ప్రపంచం...
శివుని ఆనందసాగరంలో తేలియాడే నురగలు
ఈ ద్వంద్వాలు, త్రిపుటులు...
*

సేకరణ

No comments:

Post a Comment