Monday, March 21, 2022

కవిత: ఆమె నవ్వింది

ఆమె నవ్వింది
తెల్లని పలువరుస తళుకుల తారకలా
చల్లని ఆ మనసే కోవెల దీపికలా
ఆమె నవ్వింది
ఆరుబయట ఆరబోసిన
పండు వెన్నెల
గుండెలోకి వాలినట్లు
గోరుముద్దల నాయనమ్మ
జోలపాటతొ నిదురపుచ్చినట్టు
ఆమె నవ్వింది
ఆమె నవ్వితే
ఆలయంలో గువ్వల సవ్వడైనట్లు
ఆమె నవ్వితే
గోకులంలో మువ్వల
వేణువైనట్లు
ఆమె అలా అలా నవ్వితే
అమృతంపు సోన
హృదయంలో జలా జలా
కురిసినట్లు
ఆమె నవ్వింది
అసలు పసిపాపల ముసినవ్వుకు కొస రూపే తానయ్యినట్లు
అసలు వసి వాడని పసిడి కాంతి మిస మిసగా తానయ్యినట్లు
పారిజాత పరిమళాలు
దేవ లోక జయధ్వానాలు
ఒక్కసారే విరగ బూసి
కిలకిల మని వినిపించినట్లు
ఆమె నవ్వింది
అసలు
ఆమె నవ్వింది
నా కను కొలుకుల
తడి బిందువు
వేదనను పరిమార్చేందుకే
నా హృదయాంచల వాటికన
మధుమోహన తానయ్యేందుకే
అందుకే,
ఆమె నవ్వింది!!
-- దండమూడి శ్రీచరణ్
9866188266

సేకరణ

No comments:

Post a Comment