Wednesday, October 5, 2022

దుర్గా శరన్నవరాత్రుల విశ్లేషణ

 300922e1947.    011022-5.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


    దుర్గా శరన్నవరాత్రుల విశ్లేషణ
                 ➖➖➖✍️

అమ్మవారు జ్ఞానదాయిని, మోక్షదాయిని, సర్వవిద్యాప్రదాయిని. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమినుండి దశమి వరకు ఉండే పది తిథులలోనూ నిష్ఠగా ఉండి ఇంద్రియాలను జయించాలని, దానివల్ల పునర్జన్మ ఉండదని దేవ్యుపనిషత్తు తెలుపుతోంది.

అమ్మ అంటే ప్రకృతి. ఈ ప్రకృతిని ప్రేమించడం, దానిని వికృతిని చేయక రక్షించడమే అమ్మపూజ అని, అదే మానవ ధర్మమనీ బ్రహ్మాండపురాణం చెబుతోంది.

ఈర్ష్యను వదలడం, సత్యం, అహింస, ధర్మం, దురాశను వదలడం, జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడం, దురాచారాలు, పాపాలు త్యజించి, పరస్త్రీని, పరధనాన్నీ కోరకుండా ఉండటం, ఆత్మస్థైర్యంతో సర్వకార్యాలనూ సాధించడం... ఇవే శరన్నవరాత్రుల పూజలలోని విశేషార్థం.
  
అమ్మవారికి వసంతకాలంలో వచ్చే చైత్ర శుక్ల పాడ్యమి మొదలుగా గల నవరాత్రులన్నా, శరత్కాలంలో వచ్చే ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలుగా గల నవరాత్రులన్నా ఇష్టమైన రోజులు. 

ఈ ఋుతువులు రెండూ రోగాలు వ్యాపింపజేసే లక్షణాలున్నవే. వర్షాలు వెనకబడటం వల్ల శరత్కాలంలోనూ, చలి తొలగడం వల్ల చైత్రంలోనూ కొత్త రోగాలు వచ్చి ప్రజలను పీడించి ప్రాణాలు తీస్తాయనీ, అందువల్ల వీటిని యముని కోరలుగా పిలుస్తారనీ, ఈ బాధల నుండి బయటపడటానికి అమ్మను పూజించాలని వేదవ్యాసుడు జనమేజయ మహారాజుకు చెప్పాడు.

కేవలం మహిషాసుర సంహారం వల్ల శరన్నవరాత్రుల పూజలు ఆరంభమయ్యాయని చాలామంది భావిస్తారు. కానీ అది తప్పు. శరన్నవరాత్రులు ఆరంభం కావడానికి మూలకారకుడు కృతయుగంలోని దుర్గముడు.
  
హిరణ్యాక్షుని కొడుకు రురుడు. వాడి కొడుకు దుర్గముడు. వాడు బ్రహ్మ గురించి తపస్సు చేసి, విప్రులు వేదాలు మరచిపోవాలనీ, అవి తనకే చెందాలనీ వరం కోరాడు.

ఆ వరం వాడికి బ్రహ్మ ఇవ్వడంతో విప్ర, మునులంతా వేదాలు మరచిపోయారు. దాని వల్ల యజ్ఞాలు ఆగిపోయాయి. హవిస్సులు అందక దేవతలు కృశించిపోయారు. దేవతలు కృశించడంతో వర్షాలు కురవక భూలోకవాసులు తల్లడిల్లిపోయారు.
  
అప్పుడు వారంతా అమ్మను ప్రార్థించగా, శ్రీదేవి వారికందరికీ ముందుగా ఆహారాన్ని పెట్టింది. అప్పటి నుంచి అమ్మవారిని శాకంభరి అన్నారు. ఆపై దుర్గముడిని చంపివేసింది. వాడి చావుతో బ్రహ్మ వాడికిచ్చిన వరం తొలగిపోయి యథాస్థితి ఏర్పడింది. లోకం సుభిక్షమైంది. దుర్గముడిని చంపడం వల్ల అమ్మవారికి దుర్గ అని పేరు వచ్చింది. శ్రీమత్ దేవీభాగవతంలోని సప్తమ స్కంధంలో ఈ కథ ఉంది. దుర్గాసప్తశతిలో కూడా అమ్మ స్వయంగా, దుర్గముడిని చంపిన తనకు దుర్గ అనే పేరు వచ్చిందని చెప్పింది. 

ఆశ్వయుజ శుక్ల అష్టమి నాడు అమ్మవారు దుర్గముడిని చంపడం వల్ల ఆనాటి నుండి దుర్గాష్టమిగా దానిని పేర్కొన్నారు.

శరన్నవరాత్రులు ఉత్తమ మనువు కాలంలో ఈ దుర్గమ వధ వల్ల ప్రారంభమైనట్లు కాళికాపురాణం చెప్తోంది.
  
పూర్వం శ్రీరాముడు సీతాన్వేషణ సమయంలో లంకకు వెళ్లే ముందు నారదుని సలహాపై అంబికను ప్రతిష్ఠించుకుని దేవీనవరాత్రి పూజలు చేశాడు.

అష్టమినాడు అమ్మవారిని 1008 తామరపూలతో, అవి కూడా వేయి రేకులున్న వాటితో పూజించదలిచాడు. సహస్రార కమలాలు కేవలం సౌగంధిక సరస్సులోనే ఉంటాయి. వాటిని హనుమంతుడు రాముడికి తెచ్చి ఇచ్చాడు.

నారదుని పౌరోహిత్యంలో అష్టమీ పూజ శ్రీలలితాసహస్రనామాలతో జరుగుతోంది. ఇంక రెండు నామాలున్నాయనగా రెండు పూలు తక్కువయ్యాయి. నారదుడు దీక్షలో నుండి కదలకూడదనీ, ఆలస్యం లేకుండా ఆ రెండు పూలూ కూడా సమర్పించకపోతే పూజ అంతా వ్యర్థమేననీ, పైగా అమ్మవారికి మహాపచారం కూడా చేసినట్లేననీ అన్నాడు. అప్పుడు రాముడు... నా కళ్లే తామరపూలకు బదులుగా ఇస్తాననీ, నన్ను ప్రజలు ‘రామః కమల పత్రాక్షః’ అంటారనీ పలికి, ఆ రెండు నామాలనూ నారదుడు చదువుతుండగా, తన కళ్లు పీకి అమ్మకు సమర్పించాడు.

అప్పుడు అమ్మ అష్టమినాటి ఆ రాత్రి వేళ ఆయనకు ప్రత్యక్షమై, తానే రాముడిని పరీక్షించడానికి పూలు మాయం చేశానని చెప్పి, రాముని అనన్య భక్తికి వరాలిచ్చి, దశమినాడు లంకకు వెళ్లమని, ఆయనకు సీతాసమాగమం అవుతుందని వరమిచ్చింది.

అప్పటి నుంచి దుర్గాష్టమి రామాష్టమిగా, విజయాష్టమిగా, మోక్షాష్టమిగా ప్రసిద్ధికెక్కిందని కాళికాపురాణం, శ్రీమత్ దేవీభాగవతంలోని తృతీయ స్కంధంలోనూ వ్యాసుడు వివరించాడు.

నవరాత్రులు తొమ్మిదిరోజులూ అమ్మవారిని పూజించలేనివారు కనీసం అష్టమి నుండి అయినా అమ్మను అర్చించడం ఫలదాయకం.

  
 అర్చన విధానం:

 అమ్మవారిని ఉంచే మండపాన్ని తోరణాలతో అలంకరించాలి. ఉదయమే లేచి పవిత్ర స్నానం చేయాలి. అమ్మవారిని వస్త్రాదులతో అలంకరించాలి. అమ్మవారి పాదాల వద్ద నవార్ణవ మంత్రంతో కూడిన యంత్రం స్థాపించాలి. వేదికపై కుడివైపు అంటే మనకు ఎడమవైపు కలశస్థాపన చేయాలి. కలశంలో పంచపల్లవాలు అంటే రావి, జువ్వి, మేడి, మద్ది, మామిడిచిగుళ్లు ఉంచాలి. కలశంలో నదీజలం, సువర్ణం, రత్నం వీలును బట్టి వేయాలి. ముందుగా ఆచమనం చేయాలి. సంకల్పం చెప్పుకుని పూజను ఆరంభించాలి.

గురూపదేశ మంత్రం జపించి,  సహస్రనామాలతో శ్రీచక్రాన్ని పూజించాలి. నిత్యార్చనలో పంచామృతాలు ఉపయోగించాలి. అమ్మవారి పూజలో గంధం, అగరువత్తులు, కర్పూరం, సుగంధ పుష్పాలు, అమ్మవారి పూజకు మందారం, కానుగ, అశోకం, సంపెంగ, గన్నేరు, మాలతి, బిల్వపత్రాలు, తామరపూలు, కలువపూలు ఉండాలి. నల్ల కలువలు శ్రేష్ఠం.


నైవేద్యంలో ఉండవలసిన ఫలాలు:

కొబ్బరికాయ, నిమ్మ, దానిమ్మ, అరటి, నారింజ, పనస, మారేడుకాయ.
పిండివంటలు: దద్ధ్యోదనం, పాయసం.

అమ్మవారి పూజాదులలో అనేక అంతరార్థాలున్నాయి. ‘దురాచార విఘాతినీం’ అని అమ్మను శ్రీ దేవ్యధర్వ శీర్షం వర్ణించింది. మనలోని అహంకార మమకారాలు, కోమక్రోధాదులు, జంతువు లను బలి ఇచ్చే హింసాది లక్షణాలకు ‘దుం’ అని పేరు. వాటిని తొలగించే తల్లి దుర్గ అని, దురాచారాలను తొలగించుకోవడమే శరన్నవరాత్రుల పూజలోని అంత రార్థమనీ, మనలోని నవరంధ్రాలను శుద్ధి చేసుకోవడమే నవరాత్ర పూజ అనీ, అథర్వ శీర్షంలోని మంత్రాలు వివరిస్తున్నాయి.✍️
.          సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.
                     ➖▪️➖

No comments:

Post a Comment