Thursday, March 23, 2023

భగవన్నామ రహస్యం...

భగవన్నామ రహస్యం...

భగవన్నామ ప్రభావం చేత పాపాలు పటాపంచలౌతాయి అనటం లో ఎట్టి సందేహం లేదు. కానీ మనం దీని రహస్యాన్ని తెలుసుకోలేకపోవడం వలన దురుపయోగం చేస్తున్నాము. 

పాపాలను నాశనం చేసే అమోఘమైన శక్తి 
నామ మహిమకి ఉందని తెలిసి..
పాపం చేసిన తరువాత నామాన్ని జపించి 
దాన్ని కడుగుకుందాం అనుకుంటాము.
ఇలాంటి ఆలోచనలతోనే అధికంగా పాపపంకిలంలో చిక్కుకుపోతూ ఉంటాము. 

ఈ ఆలోచన వలన మన పాపాలు  అధికం అవుతుంటాయి. 
నామాన్ని అడ్డుపెట్టుకుని పాపం చెయ్యడం 
అనేది నామం యొక్క పది అపరాధాలలో ఒకటి.
అదే నామాపరాధం.

నామం యొక్క పది అపరాధాలు

సన్నిందాసతి నామవైభవకధా శ్రీశేశయోర్భేదధీహి
ఆశ్రద్దాశృతిశాస్త్ర దైశికగిరాం నామ్న్యర్దవాదభ్రమః
నామాస్తీతి నిషిద్ధవ్రుత్తి విహితత్యాగౌ హి ధర్మాంతరైహి
నామ్యం నామజపే శివస్య చ హరేర్నామాపరాధా  దశ..!!

1. సత్పురుష – ఈశ్వరుని భజన, 
ధ్యానం చేసేవారిని నిదించుట 

2. ఆశ్రద్ధాపరులకి నామము యొక్క మహిమని తెలియపరచటం 

3. శివ కేశవుల నామ రూపములలో భేద బుద్ధి కలిగియుండుట

4,5,6,  వేదములు, శాస్త్రములు, గురువుల ద్వారా చెప్పబడిన నామ మహత్యం మీద శ్రద్ధ లేకపోవడం 

7. హరినామమందు అర్ధవాదం యొక్క భ్రమ అనగా నామ మహిమ కేవలం స్తుతి మాత్రమే అనే భావం

8, 9. నామ బలం మీద విహిత కర్మత్యాగము, నిషిద్ధమైన దానిని ఆచరించుట

10. ఇతర ధర్మాలతో నామాన్ని పోల్చటం, 
అనగా శాస్త్రవిహిత కర్మలతో నామాన్ని పోల్చటం, ఇవన్నీ శివకేశవుల నామ జపంలోని నామం యొక్క పది అపరాధాలు. 

ఈ పది అపరాధాల నుండి తమని తాము రక్షించుకోకుండా నామజపాన్ని చేసేవారు, 
నామజపం యొక్క రహస్యాన్ని తెలియని వారే.

ఏవం ప్రసన్న మనసః భగవద్భక్తి యోగతః | 
భగవత్ తత్త్వ విజ్ఞానమ్ ముక్త సంగస్య జాయతే ||

నామ జపానికి ఎవరికైనా  పరిపూర్ణమైన యోగ్యత లేక పోయినా చుట్టూ నలుగురు పాడుతుంటే 
మెల్ల మెల్లగా నోరు కదిపే అవకాశం ఏర్పడి , 
మొదట ఇష్టం లేక ప్రారంభం చేసినది 
కొంతకాలం సాగగా ఇష్టంతో ప్రవర్తించేట్టు చేసి 
అది ఎంతవరకు వెళ్తుందంటే మొదట భగవంతుని నామాలు విన్నవాడికి  ఆ భగవంతుని గురించి కలిగే వాస్తవిక జ్ఞానం వరకు తీసుకెళ్తుంది. 

వాక్కు ద్వారా నామజపం చెయ్యటం కంటే 
మానసిక జపం చేయటం వలన నూరు రెట్లు అధికలాభం కలుగుతుంది అని భగవానుని ఉవాచ. 

ఆ మానసిక జపం కూడా అత్యంత ప్రేమ శ్రద్ధ లతో చేసినట్లయితే అది అనంత ఫలప్రదమవుతుంది. 

అదే గుప్తము గాను, నిష్కామ భావంతోనూ చేసినట్లయితే శీఘ్రంగా పరమేశ్వర ప్రాప్తిని కలిగించేదవుతుంది. 

కాబట్టి ఈ రహస్యాన్ని చక్కగా తెలుసుకుని భగవన్నామాన్ని ఆశ్రయిద్దాము.

No comments:

Post a Comment