*✍🏼 నేటి కథ ✍🏼*
*కావ్.. కావ్.. కాకి నేర్పిన పాఠం!*
నరసాపురంలో ఉండే శాంతమ్మకు బడాయెక్కువ. అందరూ తననే పొగడాలని ఆశ. ఆ ఉబలాటంతో తన గురించి తాను గొప్పలు చెప్పుకునేది. ఉదయం నీళ్ల కోసం బావికెళ్లినప్పుడు, సాయంత్రం ఆడవాళ్లంతా అరుగుల మీద చేరినప్పుడు.. ఇలా అప్పుడూ ఇప్పుడూ అని లేకుండా గొప్పలు చెప్పుకునేది.
అవకాశం కల్పించుకుని మరీ వసపిట్టలా వాగేది. తను కొనుక్కున్న పదివేల రూపాయల పట్టుచీర నుంచి వాళ్ల అన్నయ్య చేయించిన ఎర్రరాళ్ల హారం వరకు ప్రదర్శనకు పెట్టేది. తన చేత్తో నాటిన ఏ మొక్కైనా బతికి తీరాల్సిందేనని బీరాలు పోయేది.
చివరికి శాంతమ్మ కనిపిస్తే చాలు.. ఇరుగుపొరుగు వాళ్లందరూ మొహం చిట్లించుకోవడం మొదలు పెట్టారు. శాంతమ్మ మాత్రం వాళ్లకు ఏడుపెక్కువని భావించేది.
‘మనకు మంచి ఇరుగూపొరుగూ దొరకలేదండీ. మంచి చీర కొన్నా, కొత్త నగలు చేయించుకున్నా ఒక మెప్పూ లేదు. మేకతోలూ లేదు ఏడుపుగొట్టు మొహాలు’ అంటూ భర్త హరికి చెప్పుకొని బాధపడింది.
‘అరె! ఎంత అందమైన చీర.. పదివేలు పోసి కొన్న నారింజరంగు పట్టుచీర.. చూపిస్తే మెచ్చుకోవడానికి ఒక్కళ్ల నోరు కూడా పెగలలేదు’ అని ఒక రోజంతా శాంతమ్మ గోలతోనే హరికి సరిపోయింది.
గోడ మీద నుంచి కళ్లు తిప్పుకోలేనంత అందంగా కనిపిస్తున్నాయి.. తన ఇంట్లో గులాబీలు. నాటిన మీ చెయ్యి మంచిదంటే వాళ్ల కిరీటాలు పడిపోతాయా?’ అని మరో రోజు ఆమె బాధ.
భార్య ధోరణితో హరికి చిరాకేసింది. జాలి కలిగింది. ఆమెకు అర్థమయ్యేలా చెప్పే అవకాశం కోసం ఎదురుచూడసాగాడు. ఒక రోజు శాంతమ్మ జాజిపూలు మాల కట్టుకుంటోంది.
కావ్.. కావ్.. కాకి నేర్పిన పాఠం!
‘శాంతా..! మన మామిడి చెట్టు మీద ఒక కాకి గూడు కట్టుకుంటోంది.. చూశావా?’ అన్నాడు హరి. ‘అయితే?’ అంది శాంతమ్మ. ‘పాపం.. ఆ కాకి ఎంత కష్టపడుతోంది. ఎక్కడెక్కడి నుంచో చెట్టూ చేమా వెతికి పుల్లా పుల్లా ఏరి తెచ్చుకుని గూడు కట్టుకోవాలి. ఇలా ఎన్ని పుల్లలు పోగేస్తే ఒక గూడయ్యేను? ఎంతైనా కాకి చాలా గొప్పది’ అన్నాడు హరి.
శాంతమ్మ తన భర్తను విచిత్రంగా చూసి పూలు కట్టుకోసాగింది.
‘పైగా గడ్డి పరకలు తెచ్చి, పుల్లలు పిల్లలకు గుచ్చుకోకుండా మెత్తగా చేస్తోంది. ఎంత గొప్ప విషయం’ అన్నాడు హరి ఆగకుండా.
శాంతమ్మకు చిర్రెత్తుకొచ్చింది. ‘ఏంటండీ గొప్ప? ఎవరికి గొప్ప. దాని గూడు అది కట్టుకుంటోంది. అదేమన్నా పక్క కాకులకు ఆశ్రయం ఇస్తోందా ఏంటి?’ అంది విసుగ్గా.
దొరికావులే... అన్నట్లుగా నవ్వాడు హరి. ‘నువ్వూ అంతేకదా! నీకు నువ్వు నగలు, చీరలు కొనుక్కుంటున్నావు. అంతేగా.. నువ్వు కొనుక్కున్న వాటిని చూడమంటే అలాగే ఉంటుంది మరి ఇరుగు పొరుగు వాళ్లకు కూడా’ అన్నాడు.
శాంతమ్మ కళ్లు తెరుచుకున్నాయి. ‘నిజమే కదా! వాళ్లను అనవసరంగా ఏడుపుగొట్టు మొహాలని తిట్టుకున్నాను’ అని బాధ పడింది.
నాలుగురోజుల తర్వాత.. ఆ వీధి కాపలాదారుడు రంగయ్య అనారోగ్యంతో మంచం పట్టాడు. వీధి చివర పాకలో ఒంటరిగా ఉంటాడతను. శాంతమ్మ వేడి వేడిగా అన్నం, పప్పు, పులుసు ఒక పళ్లెంలో పెట్టింది. ఒక గ్లాసులో చిక్కని మజ్జిగ తీసుకుంది. పైన అరిటాకు కప్పి తీసుకువెళ్లి రంగయ్యకిచ్చింది.
ఆమెను చూసి ఆశ్చర్యంతో లేచి కూర్చున్నాడు రంగయ్య. అరిటాకు తీసి చూసిన అతని కళ్లు మెరిసిపోయాయి. చేతులెత్తి దండం పెట్టాడు.
ఇంటికొస్తున్న శాంతమ్మను ఎదురింటి కల్యాణి ‘చాలా మంచి పని చేశారొదినా’ అంటూ పిలిచి మరీ మెచ్చుకుంది. పక్కింటి వనజ కూడా ‘అవునవును.. అసలు మాకీ ఆలోచనే రాలేదు. మీది మంచి మనసు. నేను సాయంత్రం రొట్టెలు, కూర పంపుతాను’ అంది.
ఇన్నాళ్లూ అందరూ తనను పొగడాలని ఎదురుచూసిన శాంతమ్మను ఈ రోజు చాలామంది పొగిడారు.
కానీ విచిత్రంగా ఆమెకు అవి సంతోషాన్ని ఇవ్వలేదు. ఆకలితో నీరసంగా ఉన్న రంగయ్య కళ్లలో మెరిసిన కృతజ్ఞత కలిగించిన సంతోషం ముందు ఆమెకు ఇవి చాలా చిన్నవిగా తోచాయి.
నిజమైన సంతోషం, పొందిన పొగడ్తలో కాదు.. చేసిన మంచి పనిలో ఉందని తెలుసుకుని సంతృప్తి పడింది.
ఆ రోజు నుంచి బడాయి శాంతమ్మలో వచ్చిన మార్పు అందర్నీ ఆశ్చర్యపరిచింది.
*- గుడిపూడి రాధికారాణి*
No comments:
Post a Comment