*ॐశ్రీవేంకటేశాయ నమః*
💝 *ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే!*
*సంగాత్సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే!!*
💖 *~యుక్తాయుక్త విచక్షణ, వివేకం బుద్ధికి ఉండవలసిన ప్రధాన లక్షణాలు. సరియైన క్రమశిక్షణతో ఈ లక్షణాలను వృద్ధిచేసుకొని బుద్ధిని సక్రమంగా వినియోగించుకోవాలి. ఈ వినియోగం ఇహజీవితాన్ని సార్థకం చేయడమే కాక, పరమార్థాన్ని సైతం సిద్ధింపజేస్తుంది. అందుకే ఇహానికీ, పరానికీ కూడా బుద్ధిశక్తిని యోగం ద్వారా పటిష్టంచేయడం ప్రధానం. దానికై మన గ్రంథాలు బహుసాధనల్ని ఆవిష్కరించాయి. ధ్యానం, యోగాభ్యాసం, జపం, తపస్సు, వేదాంత విచారణ…ఇవన్నీ బుద్ధిని సరిదిద్దడానికి ఏర్పరచినవే.*
❤️ *”సమత్వం యోగముచ్యతే” (గీత). బుద్ధి సమతౌల్యంలో ఉండడమే యోగం. ఆ సమతుల్య స్థితిలో ఉంటూ పొంగక, క్రుంగక కర్తవ్య పాలన చేయమని బోధించడానికే గీతావిర్భావం.*
💕 *‘యోగస్థః కురు కర్మాణి’ – యోగమునందు ఉండి కర్మలనాచరించమని – జగద్గురువైన శ్రీకృష్ణుని బోధ.*
💞 *బుద్ధి సమతులనత్వాన్ని కోల్పోవడం ఎలా జరుగుతుంది?*
💓 *శ్రీకృష్ణుడు గొప్ప మానసిక తత్త్వవేత్తగా ‘గీత’లో సాక్షాత్కరిస్తాడు.*
💝 *ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే!*
*సంగాత్సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే!!*
*క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః!*
*స్మృతి భ్రంశాత్ బుద్ధి నాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతే!!*
💕 *~లోకంలో ఉండే విషయవస్తువుల్ని ఎల్లప్పుడూ చింతనచేస్తూ ఉంటే, దానితో మానసికంగా ‘సంగం’(సంపర్కం) ఏర్పడుతుంది. ఆ సంగంవల్ల కామం కలుగుతుంది. ఆ కోరిక క్రమంగా అనుకూల, ప్రతికూలాల ఘర్షణలో క్రోధంగా పరిణమిస్తుంది. దానితో సమ్మోహం ఏర్పడుతుంది. ఆ మోహంవల్ల తానేమిటో, అసలు పరిస్థితులేమిటో పట్టని మరపు (స్మృతిభ్రంశం) కలుగుతుంది. ఆ మరపువల్ల వ్యక్తిత్వ నాశనం (అధోగతి) కలుగుతుంది. బుద్ధిశక్తిని పటిష్ఠపరచుకోవడానికి గొప్ప పరిష్కారాన్ని సూచించారు మహాత్ములు. విషయవాంఛలతో అంటుకోకుండా (సంగం కాకుండా) జీవనయాత్రకు తగిన పరిమితులతో సంసారాన మసలే వాడికి సంగం దోషం ఉండదు. దానివల్ల కామక్రోధమోహాదుల దాడిని తప్పించుకోవచ్చు.*
💝 *ఈ ‘సంగ’రాహిత్యానికై ఆత్మవిచారణ, యోగం వంటివి ఆచరించాలి. మరియొక విధానం ‘సత్సంగం’.*
💖 *సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం!*
*నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తిః!!*
❤️ *~సత్సాంగత్యం నిస్సాంగత్యానికీ, నిస్సాంగత్యం నిర్మోహత్వానికీ, నిర్మోహత్వం పరతత్త్వ జ్ఞానానికీ, జ్ఞానం జీవన్ముక్తికీ హేతువులవుతాయి. ‘సత్’వస్తువుతో సంపర్కమే సత్సాంగత్యం. ఆ సద్వస్తువే పరమాత్మ. నిరంతరం పరమాత్మను చింతనచేస్తే అది ప్రపంచంతో సంగాన్ని పోగొడుతుంది. దేనికీ అంటని పరమాత్మను అంటుకొనే బుద్ధి కూడా ప్రపంచపు వాసనల్ని అంటుకోని స్థితికి ఎదుగుతుంది.*
💞 *శ్రీకృష్ణుడు చెప్పిన క్రమం…భగవత్పరమైనప్పుడు అది మరోవిధంగా పరిణమిస్తుంది. నిరంతరం భగవంతుని చింతన చేసేవానికి భగవత్సంగం ఏర్పడి, ఆయనను ప్రాప్తింపజేసుకోవాలనే కోరిక పెరుగుతుంది. భగవద్విముఖమైన దుర్గుణాల పట్ల, దుస్సంగంపట్ల వెగటుభావం కలుగుతుంది. భగవద్విరహం వృద్ధి చెందుతుంది. దానితో భగవన్మోహం పెరిగి, ప్రపంచాన్ని మరచే భగవత్ స్మరణ ప్రబలమవుతుంది. క్రమంగా బుద్ధి పూర్తిగా ప్రపంచాన్ని వదలి, వ్యక్తిత్వం ఈశ్వరైక్యం చెందుతుంది. ఆ మనోలయమే మోక్షం.*
💝 *బుద్ధిని ప్రపంచంవైపు (విషయవాంఛలవైపు) త్రిప్పితే బంధం, పరమాత్మవైపు మళ్ళించితే మోక్షం అని మనం గ్రహించాలి.*
❤️ *ॐశ్రీవేంకటేశాయ నమః*
*~శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి*
No comments:
Post a Comment