*ఆత్రేయగీత*
మొదటి భాగం
అధ్యాయము - 13
"ఆత్మసాధనలో అంతిమ లక్ష్యం"
ఎచ్చటనుండి జీవుడు వచ్చేడో, అక్కడికి తప్పకా చేరుకోవలసిందే! అదే జీవాత్మ అసలు స్వరూపము! దానినే సులువుగా అర్ధంకాడానికి "విలీనం" అన్నారు పెద్దలు!
అలా చేరినప్పుడే వ్యక్తి జీవిత నాటకము సమాప్తమవుతుంది, అంతేకాని జీవుని మరణముతో సమాప్తము కాదు. జీవాత్మ, పరమాత్మతో విలీనం కానంతసేపు జీవునికి జనన మరణాలు తప్పవు.
అందరూ ఎంతో లోతుగా ఆలోచించాల్సిన విషయం
జీవం నుంచి జీవం పుడుతోంది (జీవుల సంతానం), దీనివెనకున్న చైతన్యం ఏది?
జడం నుండి జీవం పుడుతోంది (మట్టి నుండి మొక్కలు), దీనివెనకున్న చైతన్యం ఏది?
జీవం నుండి జడం పుటుతోంది (వెంట్రుకలు, గోళ్లు, కాయలు, పండ్లు, పాలు), దీనివెనకున్న చైతన్యం ఏది?
జడమే, జీవాన్ని పోషిస్తున్నది (ధాన్యాలు, కాయగూరలు, పాలు), దీనివెనకున్న చైతన్యం ఏది?
ఇలా ఎన్నో ఉదాహరణలు....
జడ, జీవ పదార్ధాలు రెండూ చైతన్యాన్ని కలిగివున్నాయి! ఎక్కడనుండి వస్తోంది ఈ చైతన్యం?
శరీరం స్వతహాగా జడమైనది! చైతన్యమైన ఆత్మతో కలసి జీవునిగా (జీవాత్మగా) వ్యక్తమైంది!
ఈ చైతన్యం అంతటా వ్యాపించివుంది! దానినే పరమాత్మ అంటారు!
అంటే, పరమాత్మ చైతన్యం నుండి వ్యక్తమైన జీవునికి, పరమాత్మకి తేడాలేదన్నమాట!
అలా ప్రకటితమైన అన్ని జడములు ఎప్పటికైనా ఆ పరమ చైతన్యంలో ఐక్యం కావలసిందే కదా!
ప్రతి భక్తుడు / సాధకుడు భగవంతుని / పరమాత్ముని సాక్షాత్కారం కోసం తపన పడుతూవుంటాడు! చాలామందికి
సాక్షాత్కారం అయ్యింది కూడా!
"సాధనా క్రమాన్ని శాస్త్రపరంగా చెప్పాలంటే -
ప్రాధమికదశ “ద్వైత స్థితి" లాంటిది. ఈ స్థితిలో భక్తుడు వేరు, ఆత్మ వేరుగా వుంటూ, భక్తి ఏమాత్రం తగ్గకుండా కోనసాగుతుంది.
ఇక మధ్యదశ "విశిష్టాద్వైత స్థితి” లాంటిది. ఈ స్థితిలో భక్తుడు ఆత్మకు అతిసమీపంగా వచ్చి, దానిని మనసా దర్శిస్తూ, మనసా ఆత్మతో సంభాషించే స్థితికి చేరుకుంటాడు. తాను, పరమాత్మలో ఒక అంశముగా భావిస్తాడు.
ఇక ఉత్తమదశను “అద్వైత స్థితి” అంటారు. తీవ్రమైనసాధన వలన, భక్తియొక్క పరాకాష్ట వలన, జీవునికి ఆత్మజ్ఞానం సిద్ధించి, ఆత్మానుభూతి పొందుతాడు. జీవాత్మ-పరమాత్మ ఒకటైపోతుంది. ఈ స్థితిలో జీవుడు సర్వదుఃఖముల నుండి విముక్తిపొంది, బ్రహ్మానందాన్ని అనుభవిస్తాడు.”.
No comments:
Post a Comment