Wednesday, October 30, 2024

 "ఆత్రేయగీత"

మూడువ భాగం

“జ్ఞాన మంజరి” (వేదవిజ్ఞాన వీచికలు)

4వ భాగము.

శ్రీ శాస్త్రి ఆత్రేయ

అసలు కర్మ అంటే ఏమిటి? పరిశీలిద్దాం!

ఒకడు ఒక వంటకాన్ని వండేడు (కర్త)! ఒక వంటకం తయారైంది (క్రియ)! అయితే దాన్ని తిన్నప్పుడు అనుభవించే రుచి (ఫలం) ఎక్కడ నుండి వచ్చింది? వంట చేయడం ద్వారా వచ్చిందా? లేదా చేసే విధానం ద్వారా వచ్చిందా?

చేయడం ద్వారా కాదు, చేసే విధానంతో రుచి (ఫలం) ఏర్పడింది కదా! కర్మ అంటే ఇదే! అందుకే కర్మ ఫలాన్ని అనుభవించాలి అంటారు! కర్త అంటే చేసేవాడు! క్రియ అంటే ఫలితం! కర్మ అంటే చేసే విధానం! అంటే చేసే విధానాన్ని బట్టీ “ఫలం” వుంటుందని అర్ధమౌతుంది.

క్రియ లోనే వుంది కర్మ! క్రియా ఫలితమే కర్మ ఫలం! క్రియ లేకపోతే కర్మ వుండదు!

దేహంతో, వాక్కుతో, మనస్సుతో చేయబడే క్రియను కర్మ అంటారని తెలిసింది. అయితే కర్మను నిర్వహించేది శరీరం అయినప్పటికీ చేయించేది, అనుభవించేది మనస్సు కాబట్టీ కర్మ ఫలం మనస్సుకే వుంటుంది.

అయితే ఆ మనస్సుకి కర్త ఎవరు అని ఆలోచిస్తే - “నేను - నాది” అన్న సమాధానం వచ్చింది.

ఆలోచిస్తే ఈ నేను (I/Self) అనేది శరీరం కాదు, ప్రాణం కాదు, జీవం కాదు, మనస్సు కాదు. ఇవన్నీ కూడా “నేను”కి “నావి” మాత్రమే! వాటన్నింటికీ కర్తగా అసలు “నేను” వేరుగా వుంటుందని అర్ధమైంది.

ఆ నేను అనేది పరమాత్మ అని అర్ధమైంది. పరమాత్మ జీవునికి పరిపూర్ణమైన జ్ఞానం ప్రసాదించినప్పటికీ మనోబుధ్యహంకార వికారముల వలన సాక్షాత్ పరమాత్మ స్వరూపుడైన జీవుడు అనేకమైన కర్మలు ఆచరించేడు కాబట్టి వాటి ఫలం అనుభవించడానికి ఇంకో దేహం ధరించవలసి వస్తుందని అర్థమైంది.

కర్మ - జన్మ, ఒక దానిని ఇంకోటి వెంటాడుతూనే వుంటుంది! కర్మ వున్నంతవరకు జన్మ వుంటుంది!

అయితే కర్మలు జడం కాబట్టి వాటికి ఫలము నిచ్చే శక్తిలేదు! పరమాత్మే కర్మఫల ప్రదాత! కారణం జీవుడు ఆచరించే అన్ని కర్మలకు అతడే సాక్షి! అందుకే తప్పక ఆచరించాల్సిన కర్మలను జ్ఞానంతో ఆచరించమని, ఎటువంటి భావన లేకుండా ఆచరించమని భగవద్గీత చెబుతుంది.

భావన లేదు కాబట్టీ, తప్పకా దాన్ని ఈశ్వరుడు స్వీకరించవలసిందే! అప్పుడది కర్మయోగంగా మారిపోతుంది! పరమాత్మ అనుగ్రహం పొందడానికి జీవుల ముందున్న ఏకైక మార్గం ఇదే! సంసారికైనా, సన్యాసికైనా ఆత్మానుభూతికి ఈ నిష్కామకర్మే పునాది!            

No comments:

Post a Comment