Vedantha panchadasi:
స్వానుభూతి రవిద్యాయామావృతౌ చ ప్రదర్శితా ౹
అతః కూటస్థ చైతన్య మవిరోధీతి తర్కతామ్ ౹౹31౹౹
31. మనము అవిద్యను అనుభవించుచుండుట ఆ అవిద్య
మన చైతన్యమును ఆవరించి ఉండుట ముందే చూపబడినది. కనుక కూటస్థ చైతన్యమునకు విరోధము లేదని తర్కింపుము. అనగా కూటస్థ చైతన్యము, అవిద్య ఏక కాలముననే ఉండుట సంభవమే అని స్వీకరింపవలెను.
మనము "చైతన్యవంతులము" అని అనుటలో ఎవరికీ సంశయము లేదు.తెలియనిది కాదు.
కాని మనలోని ఏ అంశము చైతన్యము?అని ప్రశ్నించినచో సమాధానము మనకు తెలియదు.
శరీరమా?మనస్సా?బుద్ధియా?వీటన్నిటికంటె విలక్షణమైన మరియొకటియా?ఇట్లు మనయందున్న చైతన్యపు అనుభవము దాని స్వరూపమును గూర్చిన అవిద్యయు ఏకకాలముననే యుండుచున్నవి. కనుక వానికి విరోధము లేదు.
చైతన్యం నిత్యమూ సర్వవ్యాప్తంగా,బాహ్యాభ్యంతరాలలో అంతటా నిండి వుంది.కానీ మనలోని చైతన్యం
శరీర మనోబుద్ధులద్వారా బాహ్యంగా చూసినప్పుడు మనకు చైతన్యంగా కనిపించుడంలేదు.
జీవ చైతన్య రూపమయిన బ్రహ్మం ఏ శరీరంలోనయినా లేనట్లయితే,ఆ శరీరము ప్రపంచములో ఎటువంటి పనినీ చెయ్యజాలదు.ఈ విధంగా మనమందరమూ కూడా ఒకే ఒక మహత్తర సత్యం యొక్క వ్యక్తరూపాలం మాత్రమే.
మనకీసత్యం ఎందుకు బోధపడడంలేదు?మన అనుభవానికి ఈ సత్యం ఎందుకు అందడంలేదు?
ఎందుచేతనంటే అజ్ఞానమే దీనికంతటికీ కారణం.సత్యాన్ని గ్రహించ పోవడంవలన ఇది మన అనుభవానికి అందడంలేదు. ఏకత్వాన్ని అనుభవపూర్వకంగా గ్రహించలేకపోతున్నాము.
మన విజ్ఞాన శాస్త్రవేత్తలు కనుగొనక పూర్వం కూడా విద్యుచ్ఛక్తి ఉండనే ఉంది. అదేవిధముగా మనకు తెలియకపోయినప్పటికీ ఈ ప్రపంచములో కనబడే కార్యాలన్నింటికీ కూడా కారణంగా ఏకమయిన సత్యం మాత్రమే ఉంది.
కుండ,దాక,కూజా,గోలం మొదలయిన వాటినెన్నింటినో మనం నిత్యము వాడుతూనే ఉంటాము.వాటి ఉపయోగాని కనువుగా ఉండే ఆకారము మీదను వాటి పేరు మీదనూ దృష్టి ఉంచడం వలన అవి వస్తుతః మట్టి మాత్రమేననే విషయాన్ని గుర్తిండంలేదు.అవన్నీ నిత్యమూ మట్టి మాత్రమే అయినప్పటికీ వాటి ఉపయోగాల కనుగుణంగా వాటిని వేరువేరగా భావిస్తున్నాము.
వాడుకలో మన దృష్టి వాటి ఆకార పరిమాణాల మీదనూ నామం మీదనూ మాత్రమే కేంద్రీకృతమై ఉంటుంది.
ఆయా నామరూపాలనుండి మన దృష్టిని మళ్ళించినప్పుడు అంతటా మట్టి మాత్రమే మనకు కనిపిస్తుంది.
అవిద్య వలన మనకు ఈసత్యం బోధపడడంలేదు.
సునిశితము ఏకాగ్రమూ అయిన దృష్టితో మనం మన వ్యవహారాలన్నింటినీ పరిశీలిస్తూ వాటిలోగల మార్పులనుండీ విభేదాలనుండి దృష్టిని మళ్ళించినప్పుడు అంతర్గతముగా ఉన్న శుద్ధచైతన్యాన్ని గ్రహించగలుగుతాము.
No comments:
Post a Comment