🍁 *ఆప్తవాక్యాలు*
4):మధుమతీం వాచముదీయమ్
మధురమైన మాటలను పలకాలి(అథర్వణవేదం)
వాక్కు మన హృదయాన్ని, సంస్కారాన్నీ ప్రతిఫలింపజేసేది. అది 'మధురంగా’
ఉండాలని వేదం చెప్తోంది.
అంటే తీయగా మాట్లాడితే చాలు అని అర్థం చెప్పుకోవడం సరిపోదు. మనస్సులో
చెడు తలపుల్ని దాచుకొని, పలుకులు మాత్రం కమ్మగా ఉంటే అది 'మధుర' వాక్కు
కాదు.
మనస్సులోని మధుర భావాలను(సత్ భావాలను) మాటలో ప్రతిఫలింపజేయడమే ‘మధురంగా మాట్లాడడం'. సత్యం, ప్రియం, హితం - ఇవే మాధుర్యాలు. ఈ మాధుర్యాలు మన మాటల్లో ధ్వనించాలి. అని వేదమాత
శాసిస్తోంది.
మాటతో ప్రపంచంలో అన్ని కార్యాలూ సాధించవచ్చు. 'సర్వస్య కారణమ్' -
అన్నారు పెద్దలు. అలాంటి మాటను ఎలా సంస్కరించుకోవాలో భారతీయ సనాతన
వాఙ్మయం అనేక చోట్ల బోధిస్తోంది.
ఉద్విగ్నత లేకుండా, సత్యంగా, ప్రియంగా, హితంగా మాట్లాడడం 'వాచిక తపస్సు’
అవుతుందని - భగవద్గీత వచనం. పలుకులో ఆప్యాయత, శుభాకాంక్ష లేకుండా
ఎదుటివారిని గాయపరిచేటట్లు మాట్లాడడం కొందరి నైజం. వారి పలకరింపులే
పెళుసుగా, పుల్ల విరిచినట్లుంటాయి. ఎదుటివారి మనస్సుకి ఆహ్లాదం కలిగించేలా
పలకరించడం కూడా మాటలో మాధుర్యం పలికించడమే. కసురుకోవడాలు. తిట్టడాలు,
అవాచ్యాలు వాక్కులో దొర్లితే - అది మన మనస్సు నైజాన్ని చెప్పడమే కాకుండా.
మన వ్యక్తిత్వాన్నే భయంకరం చేస్తుంది.
స్మితభాషి, ప్రియభాషి, పూర్వభాషి - అని మహాపురుషుల వాక్ లక్షణాన్ని వర్ణించాయి
ఇతిహాసాలు. చిరునవ్వుతో ప్రియంగా మాట్లాడడం, ఎవరైనా కలిస్తే 'ముందు వాళ్ళు పలకరిస్తే, ఆ తరువాత మేము పలకరిస్తాం' - అనే అహంకృతి లేకుండా, ముందుగా తానే మాట కలుపుకొనే స్నేహ శీలతని 'పూర్వభాషి' అంటారు. ఈ లక్షణాలు గల వాక్కునే 'మధురవాక్కు' అని చెప్పాలి.
భగవంతుని గుణ వైభవ మహిమలని పేర్కొనడం, ఉత్తమవిషయాల గురించి
మాట్లాడడం కూడా 'మధుమయ వాక్కు'కి లక్షణం.
తనవున విరిగిన యలుగలు
ననువున బుచ్చంగవచ్చు, నతి నిష్ఠురతన్
మనమున నాటిన మాటలు
విను మెన్ని యుపాయములను వెడలునె యధిపా - అని మహాభారతం నీతి.
“యుద్ధంలో శరీరానికి తగిలే బాణాలు విరిగి శరీరంలో ఉండిపోతే, యుక్తితో వాటిని తొలగించవచ్చు. కానీ, మనస్సులో నాటుకున్న నిష్టూరపు మాటలు తొలగడం
అసాధ్యం" - అని భావం.
కొందరికి నోరు తెరిస్తే అశుభాలే పలుకుతాయి. ఏ పనైనా చేయబోతే "అదేమీ
జరిగేనా, పెట్టేనా" అనో, “ఇది మంచి ఫలితం ఇస్తుందో, లేదో” అనో నిరుత్సాహపరచడం వంటివి కూడా మాటలోని చేదుదనాలే. శుభాన్ని ఆశించమని, శుభాన్ని పలుకమనీ మన శాస్త్రాలు ఘోషిస్తాయి.
'భద్రం కర్ణేభిః శ్రుణుయామః' -
‘మంచినీ, క్షేమాన్నీ విందాం', 'మంచినే చూద్దాం' - అని ఆశించే సంస్కృతి మనది.
ఆశావాదం, ప్రోత్సాహం, సానుకూలధోరణి (పాజిటివ్ యాటిట్యూడ్) అనేది మన
మాటలో ధ్వనించాలి.
ఎదుటివారి వెన్ను తట్టేలా ఉండే మాట 'మధుమయ వాక్కు' అవుతుంది. వెన్ను
విరిచేలా ఆడే నిరుత్సాహ వచనాలు శల్యసారథ్యాలై విషవాక్కులౌతాయి.
మాట ఇచ్చే ధైర్యం, ఓదార్పు, స్ఫూర్తి అనన్య సామాన్యం.
స్థూలంగానే కాక, సూక్ష్మ జగత్తులో కూడా మధుమయ వాక్కులు దేవతలకూ
ప్రీతి కలిగిస్తాయి. కాబట్టి మంచి మాట్లాడమనీ, దేవతలే ఆ వాక్కులు వింటారని -
'తథాస్తు' అంటారనీ, మన దేశాచారాలు బాల్యం నుండి 'మంచిగా ఆలోచించడం',
'మంచిగా మాట్లాడడం' అనే సంస్కారాలని వివిధ విధాలుగా అభ్యాసం చేయించాయి.
No comments:
Post a Comment