Vedantha panchadasi:
అవిద్యావృతకూటస్థే దేసద్వయయుతా చితిః ౹
శుక్తౌ రూప్యవదధస్తా విక్షేపాధ్యాస ఏవ హి ౹౹33౹౹
33. అవిద్య యొక్క ఆవరణ శక్తిచే ఆవరింపబడిన కూటస్థ చైతన్యముపై సూక్ష్మ స్థూల శరీరములు విక్షేపశక్తి వలన కల్పింపబడుచున్నవి.
ఇదే విక్షేపాధ్యాస.ముత్యపు చిప్పపై రజితము ఆరోపింపబడినట్లే కూటస్థ చైతన్యముపై శరీరత్రయము అధ్యస్తమగుచున్నది.
అధ్యాసకు,అనగా ఒక వస్తువు మరొక వస్తువుగా భ్రమపడుటకు,
అద్వైత వేదాంతమున "అవిద్య" కారణముగా చెప్పబడినది.
అవిద్యకు గల ఆవరణశక్తి మొదట వస్తుస్వరూపమును కప్పిపుచ్చును.దానికి బదులుగా మరొక వస్తువు యొక్క అభాసను విక్షేపశక్తి సృష్టించును.
ఆవరణశక్తి ముత్యపుచిప్ప నిజస్వరూపమును కప్పిపుచ్చగా, విక్షేపశక్తి దానిస్థానమున రజతాభాసను కల్పింపగా,మనకు ముత్యపు చిప్పకు బదులు రజితము కన్నించుచున్నది.
అహం ప్రవృత్తి తొలగిపోగా ద్వైతము నశింపగా బేదభావము చిత్తములో రహితము కాగా, అజడమగు ఏస్థితికలదో అదియే స్వరూపస్థితి అని చెప్పబడును.
హేయమగు దృశ్యమును త్యజించువాడును,గ్రహింపదగిన ఆత్మవస్తువును గ్రహించువాడును, దృక్ స్వరూపమును చూచువాడును,దృక్కు కంటె అన్యమును చూడని వాడును తెలియదగిన పరతత్త్వమందు జాగరూకుడై జీవించువాడు చిల్లగింజచే జలము నిర్మలమగునట్లు విజ్ఞానవశమున అవిద్య తొలగినవాడునునగు మహానీయునకు స్వస్వభావము(ఆత్మస్థితి)
ప్రసన్నమగును.
జగద్వికారమైనవి, ఆత్మయందు వివిధ భంగిమలతో దృశ్యజగత్తుగా కనిపించుచున్నది.
అవిద్య యొక్క ఆవరణ శక్తిచే, ఏ బ్రహ్మము సత్యమైయున్నదో దానియందు విక్షేపధ్యాస వలన సూక్ష్మ స్థూల శరీరములు ఆరోపింపబడుచున్నవి.
లోకముల జ్ఞానము అనాది అయిన అవిద్య(అజ్ఞానము) అయినను, అది తత్త్వవిచారణసహాయముతో అదృశ్యమగును.
శుద్ధచైతన్యమే నా స్వరూపం. శారీరక బాధలు, మానసికాందోళనలు,బుద్ధిలోని అశాంతి నా చేతనే తెలియబడుతున్నాయి.వాటిని నేను తెలుసుకుంటున్నాను.నా స్వభావం సత్ చిత్ ఆనందం.
ఈ జ్ఞానాన్ని దృఢంగా నమ్మాలి.
ఆభరణములలోని బంగారాన్ని మాత్రమే చూడవలెను. తరంగములలో సముద్రమును మాత్రము చూడుము. అదేవిధముగా కేవలబ్రహ్మమును మాత్రమే దర్శించవలెను.
ఆత్మజ్యోతి యొక్క ప్రకాశమే సర్వాన్ని మనకు తెలిసేలా చేస్తోంది.దీని ప్రకాశంలో రాత్రిలోని చీకటికూడా తెలియబడుతొంది.
ఇది అగ్ని -దీపశిఖ మొదలయిన వాటి వంటి కాంతి కాదు.
No comments:
Post a Comment