Vedantha panchadasi:
స్వానుభూతావవిశ్వాసే తర్కస్యాప్యనవస్థితేః ౹
కథం వా తార్కికం మన్యస్తత్త్వ నిశ్చయ మాప్నుయాత్ ౹౹29౹౹
29. స్వానుభవమునందు విశ్వాసము లేనిచో తర్కము అంతియ నిర్ధారణను ఇవ్వజాలనందున,తార్కికులకు తత్త్వనిశ్చయమెట్లు లభించును?లభింపదు.
బుద్ధ్యారోహాయ తర్కశ్చేదపేక్షేత తథా సతి ౹
స్వానుభూత్యనుసారేణ తర్క్యతాం మా కుతర్కతామ్ ౹౹30౹౹
30. అనుభూత విషయము సంభవమే అని తెలిసికొనుటకు తర్కము అవశ్యకమైనచో అనుభవము అనుసరించి తర్కించు.కుతర్కములు చేయకు.
ఎంత సూక్ష్మ తర్కమును అవలంబించి ఒకరు సిద్ధాంతము చేసినను,అతని కంటె బుద్ధిశాలురు మరింత సూక్ష్మతర్కముచే విపరీత సిద్ధాంతము చేయగలరు.ఇది తార్కికులంగీకరించిన విషయమే. కనుక తత్త్వనిర్ధారణలో కేవల తర్కముపై విశ్వాసముంచలేము. ఇక అనుభవమును కూడా విశ్వసింపనిచో తత్త్వనిశ్చయమునకు మార్గమే లేకపోవును.కనుక అనుభవమును విశ్వసించి దాని యందలి లోపదోషములను తొలగించి నిష్కర్షచేయుటకు మాత్రమే తర్కము ఉపయోగపడును.ఇట్లు తర్కము యొక్క పరిధిని గుర్తించి సదుపయోగము చేయవలెననే గాని కేవలము తర్కించుట వలననే ప్రయోజనము సాధింపబడదు.
అనుభూత విషయము ఎట్లు అనుభవమునకు వచ్చినదో తెలిసికొనిన ఇచ్ఛానుసారము ఆ అనుభవమును సంపాదించుకొనగలము.ఇట్టి జ్ఞానమును సంపాదించుటకు తర్కము అవసరమే.ఇట్టి తర్కము అనుభవమును అనుసరించి నడుచునే గాని పిడివాదములచే నడవదు.పక్షులెగురుట అనే అనుభవమును స్వీకరించి తర్కించి మానవుడు వామానముల నెక్కి తానును ఎగురగలుగు చున్నాడు.అట్లే బ్రహ్మవిదులు అనుభవమును స్వీకరించి సుతర్కము చేసి వారి అనుభవమును మనము కూడా సంపాదించుకొనవలెనే గాని కుతర్కమీలు చేయుట నిరర్థక ప్రయాస.
"మనువు"
ధర్మాధర్మ విచక్షణా జ్ఞానానికి, ప్రత్యక్ష అనుమాన ప్రమాణాలతో పాటు శ్రుతిలో ఉన్న ప్రమాణాన్ని కూడా గుర్తించాలని బోధించాడు.
అంతేకాకుండా వేద విరుద్ధంకాని తర్కంతో ఎవడు అనుసంధానం చేసుకుంటాడో,అతడే ధర్మాన్ని తెలుసుకోగలడని ఇలా వ్యక్తం చేసాడు:
"ప్రత్యక్ష మనుమానం చ శాస్త్రం చ వివిధాగమమ్,త్రయం సువిదితం కార్యం ధర్మా శుద్ధి మభీప్సతా,
ఆర్షం ధర్మోపదేశం చ వేద శాస్త్రోఽ విరోధినా యస్తర్కేణ అనుసంధత్యే స ధర్మం వేద నేతరః"
--------(మ.స్మృ12.105,106).
శాస్త్ర ప్రమాణం వల్లే, పరమాత్మ జగత్కారణం అని బ్రహ్మవాదులు విశ్వసిస్తారు.అలాగే సమ్యక్ జ్ఞానం వల్ల మోక్షప్రాప్తి కలుగుతుందని మోక్షవాదుల దృఢవిశ్వాసం.
అలాగే సమ్యక్ జ్ఞానం వల్ల మోక్షప్రాప్తి కలుగుతుందని మోక్షవాదుల దృఢవిశ్వాసం.
భూత,భవిష్యత్ వర్తమానాలకు చెందిన తార్కికులనందరినీ ఒక చోట చేర్చి నిర్ణయించటం, తార్కికవాదులకు శక్యం కాదు.శ్రుత్యాధారిత జ్ఞానసాధన,సమ్యక్ జ్ఞానాన్ని ప్రసాదిస్తుందనే విషయం నిర్వివాదాంశం.
శ్రుతిపరంగాను,శాస్త్రానుగుణంగా ఉన్న తర్కసిద్ధాంతాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించి,
"బ్రహ్మము" జగత్తుకు మూలకారణమని,
నిజస్వభావమని ఇచ్చట నిర్ధారించడమైనది. *
No comments:
Post a Comment