Saturday, October 26, 2024

****దుష్టులకే సుఖాలెందుకు…? *కర్మ... ఫలితం!*

 🕉️ ఓం నమః శివాయ 🕉️‘

🙏 శివాయ గురవే నమః 🙏

దుష్టులకే సుఖాలెందుకు…? 

        *కర్మ... ఫలితం!*
                 

తెల్లవారి లేచినప్పటినుంచి మనం ఏదో ఒక సందర్భంలో  ‘కర్మ’  అనే మాటను వింటూనే ఉంటాం. 

ఇంతకీ కర్మ అంటే ఏమిటి? అది ఎన్ని రకాలు? వాటి ఫలితం ఏమిటి అనే విషయాలు తెలుసుకుందాం. 

‘కారణం లేకుండా కార్యం జరగదు!’ అన్నది కర్మ సిద్ధాంతానికి పునాది కాబట్టి బిల్‌గేట్స్‌ లేదా వారెన్‌ బఫెట్‌ ఉత్తినే ప్రపంచ కుబేరులు కాలేదు. గతజన్మల్లో ఈ ఫలితం వచ్చే పుణ్యకార్యాలు వారు చేసి ఉండబట్టే  ఈ జన్మలో వారు కుబేరులయ్యారు. ఏ ప్రకారం వ్యాపార నడక సాగిస్తే, వారు  ఆ స్థితికి చేరుకోగలరో ఆ నడకని వారికి స్ఫురింప చేసేది వారి గత జన్మకర్మలే. 

దీనినే అమెరికన్లు ‘సరైన మనిషి, సరైన ప్రదేశంలో, సరైన సమయంలో’ అని చెబుతారు. హిందూమతం దీనినే కర్మసిద్ధాంతరూపంలో వివరిస్తుంది. దీన్ని లౌకికులు అదృష్టం లేదా దురదృష్టంగా పిలుస్తుంటారు.

కర్మకోణం నుంచి చూస్తే– కారణం లేకుండా కార్యం జరగడం అన్నది లేనే లేదు. కాబట్టి ఓ మనిషికి జరిగే మంచి కాని, చెడుకానీ లేదా వీటి మిశ్రమకర్మలు కాని గత లేదా ప్రస్తుత జన్మల్లో చేసిన కర్మల ఫలితంగానే ప్రాప్తిస్తాయి.

మనం చేసే కర్మ చెడుదా లేదా మంచిదా అన్నది నిశ్చయించేది అది చేయడానికి వెనక గల భావనే అని మన సనాతన ధర్మం స్పష్టం చేస్తోంది. చూడడానికి బయటికి చెడుకర్మగా కనిపించినా, ఒక్కోసారి అది భావనని బట్టి సుకర్మ కావచ్చు. మనిషికి కర్మ చేయడానికి వెనక గల భావనని బట్టే అతనికి ఆ కర్మ తాలూకు ఫలితం లభిస్తుంది. 

మన భావనలన్నింటిని గ్రహించే దేవుడికి అందుకే భావగ్రాహి అనే పేరు ఋషులు పెట్టారు. ఇందుకే సద్భావాన్ని ప్రసాదించమని  ప్రార్థిస్తారు. 

కర్మ కీలకం తెలిసిన ఋషులు మా కళ్లు ఎప్పుడూ మంచినే చూచుగాక, మా చెవులు ఎప్పుడూ మంచినే వినుగాక, మా నాలుక ఎప్పుడూ మంచినే రుచి చూడుగాక అని ప్రార్థిస్తారు.

మన మనసుని సద్భావాలతో నింపుకుంటే– సత్కర్మలని, దుష్టభావాలతో నింపుకుంటే దుష్కర్మలని చేస్తాం. 

ఆశాపరుడు అత్యంత దుష్టుడు. ఎందుకంటే ఆశపడేవాడి మనసు నిండా చెడుభావాలే ఉంటాయి. వారు చేసిన దుష్కర్మలే సరైన సమయంలో వారికి తగిన ఫలితాలనిస్తాయి.

ఒకవేళ పూర్వజన్మలో వారు చేసిన సుకర్మలు ఈ జన్మలో అనుభవించాల్సిన అవసరం ఉంటే, అప్పుడు ఈ దుష్కర్మల ఫలితానుభవానికి పాత శుభకర్మల ఫలితానుభవం అడ్డుపడడంతో, అవి పై జన్మలకి వాయిదాపడి వచ్చే జన్మల్లో వారు దుర్భర కష్టాలు పడవచ్చు. కర్మ పని చేసే తీరు విషయంలో అజ్ఞానం గల సామాన్య ప్రజ ‘దుష్టులకే సుఖాలెందుకు? మంచివాళ్లకి కష్టాలెందుకు?’ అని ఆవేశంగా ఆలోచిస్తారు. 

దేవుడి మీద, కర్మ మీద నమ్మకాన్ని కోల్పోతారు. మనంచేసే ప్రతికర్మకి మనం జవాబుదారీ అన్న విశ్వాసం కలిగి ఉంటే చెడు చేయడానికి భయపడతారు. 

సమాజాన్ని దోపిడీ చేసేవారు కర్మ విషయంలో పూర్తిగా అజ్ఞానులు కాబట్టే, నిర్భయంగా చెడు పనులు చేస్తూ భవిష్యత్‌ జన్మలని అంధకార బంధురం చేసుకుని తమకి తాము అన్యాయం చేసుకుంటున్నారు.

నిష్కామ కర్మ ప్రతివారు చేయదగ్గ గొప్ప కర్మనివారిణి. 

నిష్కామకర్మలో ఐదు భాగాలున్నాయి.
1.పని చేయి 2. దాన్ని నీకోసం చేయకు 3.పరులకోసం చేయి 4.పని తాలూకు ఫలితాన్ని ఆశించకు 5. ఒకవేళ ఫలితం వస్తుందనుకుంటే దాన్ని దైవానికి సమర్పించు.

మన కర్మలకు మనమే కర్తలం. కర్మలలో నిష్కామ కర్మ చాలా గొప్పది. అంటే ఇతరులనుంచి ఏమీ ఆశించకుండా చేసేది. నిష్కామ కర్మ ప్రతివారు చేయదగ్గ గొప్ప కర్మనివారిణి. మనం చేసే దానధర్మాలు, పరోపకారం నిష్కామకర్మలు అవుతాయి. ఇవి ఎంత ఎక్కువ చేస్తే, మన పాపం అంతగా తొలగుతుంది. ముల్లుని ముల్లుతోనే తీసినట్లు మనం చేసిన దుష్కర్మని ఫలితాన్నివ్వకుండా నాశనం చేయడానికి నిష్కామకర్మ ఉపయోగిస్తుంది. 

చాలామంది దైవానికి మొక్కుకుంటారు. దానికన్నా మంచి పద్ధతి ఫలానా నిష్కామకర్మ చేస్తామని మొక్కుకోవడం. ‘మా అమ్మాయి పెళ్లయితే తిరుమల నడచి వస్తాము’ అనే మొక్కు కంటే ‘ఓ బీద కన్య వివాహానికి సహాయం చేస్తా’ అనుకుని చేయడం ఎక్కువ ఫలితాన్నిస్తుంది.  

మనకి ఉన్న అడ్డంకి(పాపాలు) తొలగడానికి పుణ్యక్షేత్ర సందర్శనతోబాటు దానధర్మాలని చేస్తారు.

క్రైస్తవంలో సేవాతత్పరతకి పెద్దపీట వేశారు. హిందూమతంలో భక్తికి పెద్దపీట. కాబట్టి గుళ్లూ గోపురాలకి వెళ్లడంతోనే సరిపెట్టుకుంటున్నారు తప్ప బీదవాళ్లకి సేవకోసం ఖర్చు చేయడం పెద్దగా అలవాటు లేదు.

నిష్కామకర్మ వల్ల స్వార్థం కరిగి, మనిషి ఉన్నతుడవుతాడు. మనం చేసిన కర్మఫలితాన్ని అనుభవించడానికి కారణం దాని విశిష్టతను మన అంతరాత్మ గ్రహించడానికే అని పెద్దలు చెబుతారు. ఒకరిని బాధిస్తే తిరిగి మనకి బాధ కలిగి వారెంత బాధ అనుభవించాల్సి ఉంటారో తెలుసుకోవడం ద్వారా మన అంతరాత్మ తిరిగి అలాంటి దుష్కర్మ చేయకూడదని నేర్చుకోవడం కోసం కర్మఫలితాన్ని మనం అనుభవిస్తాం.

ఇలా ప్రతి జన్మలో గతంలో చేసిన వివిధ కర్మల ఫలితాలని అనుభవిస్తూ, వాటినుంచి పాఠాలు నేర్చుకుంటూ ఓ ఉపాధి(జన్మ) నుంచి మరో ఉపాధికి జీవాత్మ ఎదుగుతూ, అంచెలంచెలుగా ఆధ్యాత్మికంగా ఎదిగి చివరికి పరిశుద్ధ ఆత్మ అవడమే ముక్తి అని, ఇందులో కర్మలు, కర్మఫలితానుభవాలు సోపానాలు అని కర్మ సిద్ధాంతం తెలియజేస్తోంది.

నిజానికి పాపం చేస్తున్నానన్న స్పృహ లేకుండా చాలా విషయాలలో పాపాన్ని మూటగట్టుకుంటారు. 

ఉదాహరణకు పక్కింటివారి చెట్టు నుంచి కరివేపాకు లేదా గోరింటాకు కోయడం, వృద్ధులు లేదా గర్భవతులు నిలబడి ఉంటే లేచి వారికి తను కూర్చునే ఆసనం ఇవ్వకపోవడం, నిజం తెలియకుండా నిందారోపణలు చేయడం, తను పని చేసే సంస్థకి సంబంధించిన గృహోపకరణాలను, వాహనాలని, సిబ్బందిని స్వప్రయోజనాలకు వాడుకోవడం, ఇతరులకి హాని కలిగేలా వాహనాన్ని మితిమీరిన వేగంతో నడపటం, ఎవరైనా పొరపాటున ఎక్కువ చిల్లర ఇస్తే తిరిగి ఇవ్వకపోవడం, రోడ్డుమీద చెత్త వెయ్యడం మొదలైన దుష్కర్మలు చేయకుండా స్వయం నియంత్రణను అలవరచుకోవాలి. లేకపోతే జీవితకాలంలో ఈ దుష్కర్మల భారం బాగా పెరుగుతుంది.

మనకి ఏ కష్టం వచ్చినా దానికి బాధ్యులుగా మనుషులు లేదా పరిస్థితులు కనిపించినా అది నిజం కాదని, వారు కేవలం మనం పూర్వం చేసిన దుష్కర్మల ఫలితాలని అనుభవించడానికి కారణాలు మాత్రమేనని గ్రహించి ఆ ఫలితాన్ని నిశ్శబ్దంగా స్వీకరించడం మంచిది.

ఇతరులకి ఏది  చేస్తే తను బాధపడతాడో అది ఏ మనిషీ చేయకూడదు. చేస్తే పాపంలో చిక్కుకుని దానికి సరిపడే కష్టాలని అనుభవించాకే ఆ పాపాన్ని అతను నిర్మూలించుకోవాల్సి వస్తుంది. కాబట్టి చెడు చేసి కష్టాలు అనుభవించి పాఠం నేర్చుకునేకంటే తెలివైన జీవి ముందుగానే పాఠం నేర్చుకోవడం ద్వారా ఆధ్యాత్మికంగా ఎదగ గలుగుతుంది. ఇదే సుకర్మల ప్రయోజనం.
🙏 హర హర మహాదేవ శంభో శంకర 🙏

No comments:

Post a Comment