మనసులో నుంచి విషయం తొలగిపోవడమే మరుపు. మరుపు వరంగాను, శాపంగా కూడా పాత్ర పోషిస్తుంది. కొన్నింటిని ఇష్టమున్నా లేకున్నా మరచిపోవాలి. జీవిత గమనంలో ఇష్టమైన వస్తువులు, వ్యక్తులను కోల్పోతూ ఉంటాం. అలాంటి ఘటనలనే తలచుకుంటూ ఉంటే మనుగడకు విఘాతం ఏర్పడుతుంది. మనసు చాలా ఒత్తిడికి గురి అవుతుంది. కాబట్టి అటువంటి విషయాలను మరచిపోవాలి.
కొన్నింటిని మాత్రం ఎలాంటి పరిస్థితుల్లోనూ మరచిపోకూడదు. జీవిత పర్యంతం జ్ఞాపకం పెట్టుకోవాలి. అలాంటివాటిలో గతం ఒకటి. దాన్ని మరచిపోకూడదు. అప్పుడు జరిగిన మంచైనా, చెడైనా వాటి అనుభవాలను ఒరవడిగా చేసుకుని వర్తమానాన్ని, దాని ఆధారంగా భవిష్యత్తును రూపొందించుకోవాలి. మేలు చేసినవారిని, బతుకునిచ్చిన వారిని మరచిపోకూడదు. అలా చేస్తే అది కృతఘ్నత అవుతుంది. ఒక స్థాయికి ఎదిగినవారు సాధారణంగా మరచిపోయే అవకాశం ఉండేవి కొన్ని ఉంటాయి. విద్య నేర్చుకున్నాక గురువును, ధనం వచ్చాక మిత్రులను, భార్య వచ్చాక కన్నవారిని, గౌరవం వచ్చాక గతాన్ని, అవసరం తీరాక సహాయం చేసినవారిని కొందరు మరచిపోతుంటారు. అది మంచిది కాదు.🙏🕉️
No comments:
Post a Comment