Tuesday, October 29, 2024

 Vedantha panchadasi:
తచ్చేద్విరోధి కేనేయమావృతిర్ హ్యనుభూయతామ్ ౹
వివేకస్తు విరోధ్యస్యాస్తత్త్వజ్ఞానిని దృశ్యతామ్ ౹౹32౹౹

32.  కూటస్థ చైతన్యమునకే అవిద్యతో విరోధమైనచో అవిద్య ఉన్నదనే అనుభవం ఎవరికి కలుగుచున్నది?
(అవిద్యను గూర్చిన ప్రతీతియే లేక పోవునని భావము)
కాని వివేకము అవిద్యకు విరోధి. తత్త్వజ్ఞానుల యందు అవిద్య లేకుండుటను చూడుము.

వ్యాఖ్య:    వివేకమనగా ఉపనిషద్విచారణ జన్యమైన జ్ఞానము.ఈ జ్ఞానము అవిద్యను తొలగించును.దానితో అవిద్యాకార్యములైన 
స్థూల సూక్ష్మ కారణ శరీరముల బోధ కూడా తొలగి కూటస్థ చైతన్యపు నిరంతరాయమైన బోధ కలుగును.ఇట్టి బోధ కలిగినవారే తత్త్వజ్ఞానులు.

మాయను ఉపాధిగ స్వీకరించిన బ్రహ్మము ఈశ్వరుడనీ అవిద్యను ఉపాధిగ స్వీకరించిన బ్రహ్మము జీవుడని చెప్పబడినది.
ఈ అవిద్యయే కారణ శరీరము. అవిద్యకు గల ఆవరణ శక్తి వలన కూటస్థ చైతన్యమును గూర్చిన బోధ ఆవరింపబడుచున్నది.

విక్షేప శక్తి వలన అవిద్యా కల్పితములైన సూక్ష్మ స్థూల శరీరములు భాసించుచున్నవి. సూక్ష్మశరీరమున,అనగా అంతఃకరణమున,ప్రతిఫలించిన కూటస్థ చైతన్యము చిదాభాసుడు అనబడుచున్నాడుఇదే"జీవుడు"అని వ్యవహారము.ఈ విక్షేపశక్తియే అన్యోన్యాధ్యాస,అధ్యాస,
అధ్యారోపము అనీ తెలియబడుచున్నది.

ఉపనిషదుపదేశములను చక్కగా వివేచించి విచారించి అనుభవమునకు తెచ్చుకొను ప్రయత్నము చేసినచో వివేకము కలిగి అవిద్య తొలగి ప్రత్యక్ చైతన్యబోధ అనుభవగతమగును.

కేవలము ఉపనిషద్ గ్రంథములను 
మాత్రము అధ్యయనము చేసినచో
కలుగునది పరోక్ష జ్ఞానము.అది సాపేక్షము(relative).దీని వలన మనకు అజ్ఞానము,అవిద్య కలదు అని మాత్రము బోధపడును. అవిద్యకు ఈ జ్ఞానము విరోధి కాదు.కనుకనే సాధారణ పండితులు విద్వాంసులయందు అపారమైన తాత్త్విక పాండిత్యమున కూటస్థచైతన్య బోధరాహిత్యమును ఏకకాలమున చూచుచున్నాము.

ఉపనిషత్తులు ఉపదేశించిన మార్గమును అవలంబించి అభ్యసించిన వారియందు కూటస్థ చైతన్యపు దివ్య ప్రకాశమును అవిద్యా రాహిత్యమును మనము చూడగలుగుదుము.వారియందు కేవల పండితప్రకాండులు సూర్యుని ముందు దివిటీల వలె వెలవెల బోవుదురు గదా!
ఇట్టి తత్త్వదర్శులకు కలిగిన జ్ఞానము అపరోక్ష జ్ఞానమను బడుచున్నది.ఇది చైతన్యినుభవజన్యమైన జ్ఞానము.

కనుక బోధ స్వరూపమైన కూటస్థచైతన్యము అజ్ఞానము,అవిద్యతో ఏకకాలమున ఉండుట అసంభవమేమీ కాదు.కాగా అవసరము కూడా.

అవిద్య ఉన్నదని తెలిసిననే దానిని తొలగించే ప్రయత్నము జరుగును.
అవిద్యను గూర్చిన జ్ఞానము కూడా లేని మనుష్యులు ఇతర జంతువుల వలెనే పుట్టుచు చచ్చుచు సంసార చక్రమున తిరుగుచుందురు.

No comments:

Post a Comment