*ఆత్రేయగీత*
మూడవ భాగం
“జ్ఞాన మంజరి” (వేదవిజ్ఞాన వీచికలు)
1వ భాగము.
పరిశోధన - శ్రీ శాస్త్రి ఆత్రేయ (ఆకుండి శ్రీనివాస శాస్త్రి).
అనాదిగా వేదాలను ఒక జ్ఞాననిధిగా, అన్నింటికీ మూల ప్రమాణంగా గుర్తించడం జరిగింది. “విద్” అంటే తెలుసుకోదగినది అని అర్ధము. వేదములను ఎవరూ రచించలేదని, ఋషులు వాటిని పరమాత్మ ద్వారా విని గానంచేశారని విశ్వాసం. అందుకే వీటిని అపౌరుషేయములు, శ్రుతులు అని కూడా అంటారు. వేదములను విన్న ఋషులను ద్రష్టలు అని అంటారు. ద్రష్ట అంటే దర్శించినవాడని అర్ధం.
బృహత్తరమైన వేదరాశిని, వ్యాసుడు ఒక క్రమప్రకారం విభజించాడు. ఋక్కులు అన్నింటినీ ఋక్సంహితగాను, యజస్సులు అన్నింటినీ యజుస్సంహితగాను, సామములు అన్నింటినీ సామసంహితగాను, అథర్వమంత్రాలన్నింటినీ అథర్వసంహితగా తయారుచేసాడు. కనుకనే అతడ్ని భగవాన్ వేదవ్యాసునిగా పిలవడం జరిగింది. వాటిని ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణవేదము అని పిలవడం జరిగింది.
ఈ వేదాలను ఆధారంగా తీసుకొని శాక్తేయము, వైష్ణవము, శైవము, ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము ఇలా ఎన్నో తత్వమార్గాలు ఏర్పడ్డాయి. ఇవి కాకుండా పరిపాలన విషయాలు, ఆయుర్వేదము, ఖగోళము, ఆచారాలు, సాంప్రదాయాలు, నిత్యజీవనకర్మలు ఈ వేదాలతో ముడివడి వున్నాయి. బౌద్ధం మరియు ఇతర కొన్ని సిద్ధాంతాలు వేదాలలో పేర్కొన్న కర్మకాండను అంగీకరించలేదు గానీ అందున్న జ్ఞానకాండాన్ని అనుసరించక తప్పలేదు.
ప్రతి వేదంలోను నాలుగు భాగాలున్నాయి. అవి -
1. సంహితలు - మంత్రాలు, స్తోత్రాలు, ఆవాహనలు తెలిపేవి.
2. బ్రాహ్మణాలు - సంహితలోని మంత్రమును, శాస్త్రవిధిని వివరించి, యజ్ఞయాగాదులు చేసే పద్ధతిని తెలిపేవి.
3. అరణ్యకాలు - వివిధ కర్మ, యజ్ఞ కార్యముల అంతరార్ధాలను వివరించేవి.
4. ఉపనిషత్తులు - ఇవి పూర్తిగా జ్ఞానకాండను తెలిపేవి. జీవాత్మ, పరమాత్మ, జ్ఞానము, మోక్షము, పరబ్రహ్మ స్వరూపమును గురించి వివరించేవి.
వీటిలో మొదటి రెండూ "కర్మకాండ”ని బోధించగా, తరువాత రెండూ “జ్ఞానకాండ”ని బోధించేయి.
వేదాలను అర్థం చేసుకోవడానికి ఎన్నో వివరణ గ్రంథాలను ఋషులు తయారుచేసేరు. వాటికి వేదాంగాలు అని పేరు పెట్టేరు. అవి…
1. శిక్షా : వేదశబ్దాల మూలాలు, శబ్దాల ఉచ్ఛారణ, స్వరములను తెలుపుతుంది.
2. వ్యాకరణం : ధాతువుల అర్థాన్ని, దానికి తగ్గట్టుగా ఉచ్ఛారణను తెలుపుతుంది.
3. కల్పము : యజ్ఞంకోసం యాగశాల, వేదిక ఏర్పాటు విషయాలను తెలుపుతుంది.
4. నిరుక్తం : వేదాల్లో వివిధ పదాల నిర్మాణాన్ని తెలుపుతుంది.
5. ఛందస్సు : వేద మంత్రాల అక్షరాలు, పదాల కలయిక, వాటి అర్థాలను తెలుపుతుంది.
6. జ్యోతిషం : కాలనిర్ణయం, ఆచరించాల్సిన విధులను ఎప్పుడు చెయ్యాలో తెలుపుతుంది.
వేదాలను అర్థంచేసుకోవడం సామాన్య ప్రజలకు కష్టం కనుక వేదవ్యాసుడు వేదసారంతో కూడిన అష్టాదశ పురాణాలను రచించాడు.
No comments:
Post a Comment