Wednesday, October 30, 2024

 తన భక్తుల కొరకు భగవంతుడైన శ్రీకృష్ణుడు చేయు పనులు విచిత్రములై వింత గొలుపుచుండును. 

పాండవులు తన పాదములు నమ్మిన భక్తులు. వారు బాధలు పడుచుండగా రక్షించుటకై వారి దూతగా బయలుదేరి వెళ్ళెను. 

అప్పుడు పాండవుల విరోధులైన కౌరవులు కృష్ణుని పట్టి బంధించుటకు సన్నాహము చూపిరి.  

కృష్ణుడు వారిని ఎదుర్కొనలేదు‌. ఎదుర్కొని నశింపజేయలేని బలహీనుడు కాడు. అసమర్థుడు కాడు. వారిని జయించు సంకల్పము లేకకాదు. 

ఆ సభలో శస్త్రాస్త్ర విద్యలలో గొప్పవారు, గొప్పవంశములలో పుట్టినవారు మొదలుకొని పలు విధములుగా గర్వపడుచు, అభిమానము పెంచుకున్న వీరులెందరో కలరు. వారు తలకొక విధముగా సజ్జనులను బాధపెట్టుచున్నారు. 

వారందరును సైన్యములతో గూడ ఒక్కమారు చనిపోయినచో భూభారము తగ్గును.  

అట్లు జరుగుటకు యుద్ధము సంభవింపవలెను. 

దాని కొరకై సమయము కోసం వేచి ఉన్నవాడు కనుక కృష్ణుడు కౌరవులు పలుకు దుర్భాషలకు కోపింపక,  అమసర్థుని వలె ప్రవర్తించెను.

శక్తిమంతులు సమయంకోసం ఎదురు చూచుట వారి సమర్ధతేకాని వారి అసమర్ధత కాదు.
శ్రీమద్భాగవతము. 3-71.
      🪷🦚🌼              

*అఖండశక్తితో మహోన్నతంగా స్థిరంగా నిలబడాలి.*

*పరిస్థితులు అనుకూలంగా ఉంటే అందరూ మంచిగానే ప్రవర్తిస్తారు. కానీ ఏదైనా వ్యతిరేకత ఎదురైనపుడు కూడా మనిషి ధైర్యంగా నెట్టుకు రాగలిగితేనే విజేతగా నిలుస్తాడు.*

*ఆపద కలిగినపుడు దాని నుండి పారిపోయి మరియొక సమస్య తెచ్చుకోవడం సరియైనది కాదు. భగవంతుని మార్గదర్శనం చేయమని నిజాయితీగా ప్రార్థించాలి.*

*మనం ఆ శ్రీమన్నారాయణునితో ఎంతగా సంబంధాన్ని ఏర్పరచుకుంటే అంతగా శక్తిశాలురం అవుతాము. ఇంక అప్పుడు ఏ బలహీనతలూ మనల్ని బాధించలేవు.*. 

No comments:

Post a Comment