*ఆత్రేయగీత*
మొదటి భాగం
అధ్యాయము - 14
'ముగింపు"
పుట్టినవానికి మృత్యువు తప్పదు. అది ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో తెలీదు. అది రాకముందే దానిని నివారించే మార్గము కనుక్కోవాలి. అక్షరమైనదానిని (నాశనము లేనిదానిని) పొందాలి.
అందుకోసము నిష్కామముతో జీవుడు తాను నిర్వహించవలసిన విధులు నిర్వహిస్తూ, సర్వకాలసర్వావస్తలయందు పరమాత్మయందు అర్పితమైన
మనస్సు, బుద్ధి కలవాడైయుండాలి. అందుకు ఏమాత్రము ఆలస్యము చేయకుండా సాధనచెయ్యాలి.
మనుజులకు ఇది సాధ్యమే. ఎందుచేతనంటే ప్రతిజీవి పరిశుద్ధమగు ఆత్మస్వరూపమే. శరీరము కేవలం ఉపాధి మాత్రమే. పంచభూతములతో కూడిన ఈ దేహమునకు- జీవునికి నిజంగా ఎటువంటి సంబంధము లేదు. అటువంటి బుద్ధితో సాధన చెయ్యాలి.
సాధన చేయుట జీవుని ధర్మము, సాయము చేయుట పరమాత్మ ధర్మము.
మానవుడు, తన తల్లితండ్రులను,
బంధువులను, భార్యాబిడ్డలను, స్నేహితులను, శత్రువులను, తన స్థిరాస్తిని, చరాస్తిని, తన పరపతిని, తన పేరుప్రతిష్ఠలను తెలుసుకుంటున్నాడు గాని “అసలు తానెవ్వడో” తెలుసుకునే ప్రయత్నం మాత్రం చెయ్యడంలేదు.
అంతా సాఫీగా జరుగుతున్నంతసేపూ తననుతానుbపొగుడుకుంటూ, కాస్త దుఃఖం ఎదురైనప్పుడు ఒక బాహ్య స్వరూపాన్ని భగవంతునిగా ఆరాధిస్తూ, ఇంకాస్త దుఃఖం వచ్చినప్పుడు అన్నింటిని భగవత్స్వరూపంగా భావిస్తూ, పూర్తి
దుఃఖంలో వున్నప్పుడు మాత్రమే అంతర్విశ్లేషణ చేసుకుంటూ, పరిస్థితులు తిరిగి బాగుపడినప్పుడు మళ్ళీ తననుతాను కీర్తించుకుంటూ జీవితాన్ని గడిపేస్తున్నాడు. కానీ ఒక స్థిరమైన అభిప్రాయానికి మాత్రం రాలేకపోతున్నాడు.
దానిమూలంగా తన నిజస్వరూపాన్ని గుర్తించలేకపోతున్నాడు. తుదకు తాను ఎంతో కృషితో సంపాదించిన ప్రతి వస్తువుని ఇక్కడే వదిలిపెట్టి ఈ దేహాన్ని త్యజిస్తున్నాడు.
ఇలాంటి మరణాలను తాను దగ్గరుండి ఎన్ని చూస్తున్నా, "స్మశాన వైరాగ్యం" అని భావిస్తూ, వాటిని అతి త్వరలోనే మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నాడు గాని శాశ్వత పరిష్కారం
గురించి ఆలోచించడు.
మానవుడు “తాను ఎవరో?” తెలుసుకునేందుకు ఉపయోగపడే అన్ని మార్గాలను, పద్దతులను, సాధనాలను ప్రతి సద్గురువు తన శిష్యులకు సూచిస్తాడు.
తనపై ఎటువంటి పెద్దరికాన్ని, కర్తృత్యాన్ని వేసుకోకుండా “ఇక నీకు ఏది ఆమోదయోగ్యమో, దానిని ఆచరించు” అని శిష్యునికే వదిలేస్తాడు సద్గురువు.
కాబట్టీ సద్గురువు బోధించిన జ్ఞానవాక్కుల వెనకున్న అంతరార్ధాన్ని పూర్తిగా అర్ధంచేసుకుని, ఆచరించాల్సిన బాధ్యత మాత్రం శిష్యునిదే.
దీన్నే “జ్ఞానయజ్ఞము” అంటారు. ఈ జ్ఞానయజ్ఞము అన్ని యజ్ఞములకంటే శ్రేష్ఠమైనది.
ఈ "ఆత్రేయగీత" లో సద్గురు శ్రీ శాస్త్రి ఆత్రేయ గారు
ప్రస్తావించిన ముఖ్యాంశాలు :
1. ప్రతి జీవి కర్మ చేయాల్సిందే. ఏ కర్మ చేయకుండా జీవుడు ఒక్క క్షణం వుండలేడు.
2. చేసే ప్రతి కర్మ, నిష్కామంతో (ప్రతిఫలం ఆశించకుండా) చేయాలి.
3. ఆత్మజ్ఞానము పొందాలంటే కర్మలన్నీ నిష్కామంతోనే చెయ్యాలి. ఇదే కర్మయోగము.
4. కర్మయోగికైనా, జ్ఞానయోగికైనా ఈ నిష్కామకర్మాచరణ తప్పదు.
5. కర్మలో అకర్మని, అకర్మలో కర్మని చూడాలి.
6. కర్మయోగంతో చిత్తశుద్ధికలిగి జ్ఞానము ఉదయిస్తుంది.
7. జ్ఞానము కలిగిన తరువాత వైరాగ్యముతో కూడిన అభ్యాసము చేయాలి.
8. అన్ని జీవులయందు సమదృష్టి కలిగియుండాలి.
9. ధ్యానంతో ప్రాపంచిక విషయాలనుండి దృష్టి మరల్చాలి.
10. తనలో నిగూఢంగా వున్న ఆత్మను దర్శించాలి.
11. ఆత్మవిచారణతో పరమాత్మను అర్ధము చేసుకోవాలి.
12. పరమాత్మను తెలుసుకున్న వెంటనే బ్రహ్మానందం సిద్ధిస్తుంది. ఇదే జ్ఞానయోగము.
13. దీనితో మానవుడు అన్ని బంధాలనుండి విడిపడి జీవన్ముక్తుడవుతాడు.
14. జీవాత్మ పరమాత్మలో విలీనము అవుతుంది.
15. అంతటితో ఈ జననమరణ చట్రము నుండి బయటపడి, అవసరాన్ని బట్టి ఆత్మ తన ఇచ్చానుసారం లోకంలో అవతరించుట, లోకము వీడివెళ్ళుట జరుగుతుంది. వారే సత్పురుషులు లేదా సద్గురువులు. ఇదే జ్ఞానయజ్ఞము.
ఇది గ్రహించక జీవుడు కామ్యకర్మలను ఆచరిస్తూ, అశాశ్వతములగు ప్రాపంచిక వస్తువులపై బంధము పెంచుకుంటూ, ఇంద్రియముల వశుడై సుఖదుఃఖములు చవిచూస్తూ, మిగిలిన కర్మఫలితములు అనుభవించుటకు జననమరణములు పొందుతూ, ఆత్మవస్తువును విస్మరిస్తూ, సత్యమును తెలుసుకొనక పరమాత్మకు దూరం అవుతున్నాడు. తాను వచ్చిన చోటుకి చేరుకోలేక పోతున్నాడు.
No comments:
Post a Comment