ఇక్ష్వాకు వంశానికి చెందిన మహారాజుల్లో అంబరీషుడు పరమ భాగవతోత్తముడు. విష్ణుభక్తుల్లో అగ్రగణ్యుడు. అంబరీషుడు ఎన్నో యజ్ఞయాగాదులు చేశాడు. దానధర్మాలు చేశాడు. ప్రజలకు ఏ లోటు లేకుండా, రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించాడు. ఆయువు తీరిన తర్వాత అంబరీషుడు స్వర్గానికి చేరుకున్నాడు.
స్వర్గంలో అడుగుపెట్టిన అంబరీషుడికి ఇంద్రుడు స్వయంగా ఎదురేగి స్వాగతం పలికాడు. ‘అంబరీషా! స్వాగతం! ఎన్నో యజ్ఞయాగాదులు, పుణ్యకార్యాలు చేసి దేవలోకానికి వచ్చిన ఉత్తముడివి నువ్వు. నీ రాక సమస్త దేవతలకు మహదానందకరం’ అన్నాడు. అంబరీషుడు ఇంద్రుడిని సాదరంగా పలకరించి, చుట్టూ కలయజూశాడు. స్వర్గలోకం దేదీప్యమానంగా ఉంది. నయనానందకరంగా ఉంది. వైభవానికి ఆలవాలంగా ఉంది. అప్సరకాంతలు వొయ్యరాలు చిందిస్తూ నృత్యం చేస్తున్నారు. గంధర్వులు శ్రావ్యంగా గానం చేస్తున్నారు.
ఒకచోట పుష్పకవిమానంలో అప్సరసలతో పరాచకంగా సల్లాపాలాడుతున్న విలాసపురుషుడు కనిపించాడు. అతడు దివ్యతేజస్సుతో వెలిగిపోతున్నాడు. అంబరీషుడు అతణ్ణి తేరిపార చూశాడు. కొద్ది క్షణాలకు అతడెవరో గుర్తుపట్టాడు. ‘వాడు సుదేవుడు కదూ?’ అని పక్కనే ఉన్న ఇంద్రుణ్ణి అడిగాడు.
‘ఔను, అంబరీషా! అతడు సుదేవుడే!’ బదులిచ్చాడు. ‘అయినా, వాడెలా స్వర్గానికి వచ్చాడు? వాడు నా సేవకుడు. నాకు తెలిసినంత వరకు బతికి ఉన్న కాలంలో అతడు పెద్దగా పుణ్యకార్యాలేవీ చేయలేదు. వాడికి ఇంతటి సుకృతం ఎలా కలిగింది?’ ఆశ్చర్యంగా ఇంద్రుణ్ణి ప్రశ్నించాడు అంబరీషుడు.
‘అంబరీషా! ఏ సుకృతమూ లేకుండా, ఇక్కడకు ఎవరూ రాలేరు. సుదేవుడు గొప్ప సుకృతమే చేశాడు. అందుకే ఇక్కడకు వచ్చాడు. అతడు ఏం చేశాడో నీకు తెలియదు. నేను చెబుతాను విను’ అని ఇంద్రుడు– ‘ఒకసారి శతశృంగుడు అనే రాక్షసుడి కుమారులు సదముడు, విదముడు, దముడు అనేవారు నీ రాజ్యంపై దండెత్తారు కదూ!’ అని అంబరీషుణ్ణి ప్రశ్నించాడు.
‘ఔను! ప్రజలను పీడించుకు తినే ఆ రాక్షసులు నా రాజ్యంపై దండెత్తారు. అప్పుడు నేను ఈ సుదేవుణ్ణి పిలిచి, ఆ రాక్షస కుమారులను హతమార్చు. విజయం సాధించకుండా వస్తే మాత్రం నీ తల నరికి కోట గుమ్మానికి వేలాడగడతాను అని చెప్పి, తగినంత సైన్యాన్ని తోడిచ్చి పంపాను, సరేనని వెళ్లాడు. తర్వాత వాడి జాడ తెలియలేదు. ఇన్నాళ్లకు ఇక్కడ కనిపించాడు’ చెప్పాడు అంబరీషుడు.
‘నువ్వు చెప్పినట్లే అతడు సైన్యంతో వెళ్లి, ఒకచోట విడిది చేశాడు. శత్రువుల బలం తెలుసుకుని రమ్మని గూఢచారులను పంపాడు. వాళ్లు తిరిగి వచ్చి, శతశృంగుని కుమారులతో తలపడటం మంచిది కాదని చెప్పారు.
ఎదుటివాడి బలం ఎక్కువని తెలిశాక తలపడటం వల్ల ప్రయోజనం ఉండదు. అనవసరంగా సైన్యం ప్రాణాలు కోల్పోవడం తప్ప ఒరిగేది ఉండదు. వెనుదిరిగి వెళితే ప్రాణాలు దక్కవు. ఎలాగూ అంబరీషుడి చేతిలో శిరచ్ఛేదం తప్పదు. అందువల్ల తన తలను తానే పరమేశ్వరుడికి అర్పించుకోవడం మేలని తలచి, సైన్యాన్ని వెనక్కు పంపేశాడు. నేరుగా మరుభూమికి వెళ్లి, పరమశివుడిని స్మరిస్తూ, తన తలను తానే తెగ నరుక్కోవడానికి కత్తి దూసి, మెడ మీదకు తెచ్చాడు. వెంటనే పరమశివుడు ప్రత్యక్షమై, అతడి ప్రయత్నాన్ని వారించాడు. మెడ మీద పెట్టుకున్న కత్తిని తొలగించాడు.
పరమశివుడు ప్రత్యక్షమవడంతో సుదేవుడు ఉద్వేగభరితుడై, ఆనందబాష్పాలు రాల్చాడు. ‘దేవదేవా! శతశృంగుడి కుమారులను జయించకుండా తిరిగి వస్తే, శిరచ్ఛేదం చేస్తానన్నాడు మా అంబరీష మహారాజు. ఆ రాక్షస కుమారులు జయించరాని వారుగా ఉన్నారు. ఎలాగైనా చావు తప్పనప్పుడు నా తలను నీకే అర్పించడం మంచిదనుకుని, ఈ పనికి పూనుకున్నాను’ అని చెప్పాడు. సుదేవుడి పరిస్థితికి పరమశివుడు జాలిపడ్డాడు. ఒక దివ్యరథాన్ని, విల్లమ్ములను సుదేవుడికి ఇచ్చాడు. ‘ఇక నిన్ను యుద్ధంలో దేవదానవులెవరూ గెలవలేరు. ఒక విషయం గుర్తుపెట్టుకో– యుద్ధంలో రథం నుంచి కిందకు మాత్రం దిగవద్దు’ అని హెచ్చరించాడు.
పరమశివుని అనుగ్రహానికి సుదేవుడు పరమానందం చెందాడు. దివ్యరథాన్ని అధిరోహించి, ఒక్కడే రణరంగానికి దూసుకెళ్లాడు. తనపైకి ఆయుధాలతో దాడికి వచ్చిన రాక్షస సేనలను తన శర పరంపరతో చెల్లాచెదురు చేశాడు.
హోరాహోరీగా సాగిన యుద్ధంలో సదముడిని, దముడిని తెగటార్చాడు. సోదరులిద్దరి మరణాన్ని కళ్లారా చూసిన విదముడు పట్టరాని క్రోధంతో చెలరేగిపోయి, సుదేవుడి మీదకు దూసుకొచ్చాడు. సుదేవుడి బాణ ప్రయోగానికి విదముడి విల్లు ముక్కలైంది. అతడు కత్తి పట్టుకుని, రథం మీద నుంచి నేల మీదకు దూకి, సుదేవుడి మీదకు వచ్చాడు.
యుద్ధావేశంలో సుదేవుడు పరమశివుడు చెప్పిన మాట మరచి, తాను కూడా కత్తి పుచ్చుకుని రథం మీద నుంచి నేల మీదకు దూకాడు. వారిద్దరి ఖడ్గయుద్ధం కళ్లు మిరుమిట్లు గొలిపేలా సాగింది. చాలాసేపటి వరకు ఇద్దరూ సమ ఉజ్జీలుగా పోరాడారు. ఒకే సమయంలో ఇద్దరూ ఒకరినొకరు పొడుచుకున్నారు. అక్కడే కుప్పకూలి ప్రాణాలు వదిలారు. సుదేవుడు అలా శత్రుసంహారం చేయడం వల్లనే నీ రాజ్యం గొప్పగా ఉంది. యుద్ధంలో వీరమరణం పొంది వచ్చేవాడు స్వర్గంలో పొందే సత్కారానికి సమానమైనది మరేదీ లేదు’ అని జరిగినదంతా వివరించాడు ఇంద్రుడు.
తన కోసం సుదేవుడు ప్రాణత్యాగం చేసిన సంగతి తెలుసుకుని, అంబరీషుడు అశ్రుతప్తుడయ్యాడు. వెంటనే, సుదేవుడి వద్దకు వెళ్లి, అతణ్ణి గాఢాలింగనం చేసుకుని అభినందించాడు. నేరుగా మరుభూమికి వెళ్లి, పరమశివుడిని స్మరిస్తూ, తన తలను తానే తెగ నరుక్కోవడానికి కత్తి దూసి, మెడ మీదకు తెచ్చాడు. వెంటనే పరమశివుడు ప్రత్యక్షమై, అతడి ప్రయత్నాన్ని వారించాడు.
No comments:
Post a Comment