Tuesday, August 26, 2025

 అందరికీ సులభంగా అర్ధమయ్యే
రీతిలో…
భగవద్గీత… ధారావాహిక-125.
264d3;268e3;
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀1️⃣2️⃣5️⃣.```
భగవద్గీత పఠనం…
మీ అన్ని సమస్యలకు పరిష్కారం…!
.```
                 *భగవద్గీత*
                 ➖➖➖✍️.```
      (సరళమైన తెలుగులో)
.```
*5. కర్మసన్యాస యోగము.*
      (ఐదవ అధ్యాయము)
_________________________```
“శ్రీకృష్ణుడు మొదట జ్ఞానయోగము కర్మయోగము గురించి క్లుప్తంగా చెప్పాడు. అప్పుడు అర్జునుడికి ఒక సందేహము వచ్చింది. ‘కర్మకంటే జ్ఞానం గొప్పది అయితే నన్ను ఈ పాప కర్మ అయిన యుద్ధం ఎందుకు చేయమంటున్నావు?’ అని నిలదీసాడు. 

దానికి సమాధానంగా కృష్ణుడు కర్మయోగము, జ్ఞానయోగము రెండింటి గురించి వివరంగా చెప్పాడు. కాని అర్జునుడికి మరొక సందేహము రానే వచ్చింది. కిందటి అధ్యాయంలో చెప్పబడినట్టు సందేహములు పోవాలంటే జ్ఞానం రావాలి. 
అంటే అర్జునుడికి మూడు అధ్యాయాలు ముచ్చటగా చెప్పినా ఇంకా జ్ఞానం రాలేదు అని అర్థం. అందుకే ఇక్కడ ఈ అధ్యాయంలో అర్జునుడు కర్మ, కర్మ సన్యాసము అనే రెండు విషయాలలో ఏది ఎంచుకోవాలి అనే సందేహం వ్యక్తం చేసాడు.

కర్మ సన్యాసము అంటే కర్మలను విడిచిపెట్టడం. పక్కన పెట్టడం!చేయకుండా ఉండటం. ఈ విషయం గురించి పరమాత్మ ఇప్పటి వరకు చెప్పలేదు. కేవలం నిష్కామ కర్మ గురించి కర్మఫల త్యాగము గురించి చెప్పాడు కానీ కర్మ చేయవద్దని చెప్పలేదు. కాని అర్జునుడు మాత్రము దీని గురించి అడుగుతున్నాడు. "కృష్ణా! నీవు ఒక సారి కర్మలను త్యాగం చేయమనీ అంటే కర్మలు చేయవద్దనీ, మరొక సారి కర్మలు చేయమనీ చెబుతున్నావు. నాకు చాలా గందరగోళంగా ఉంది. 
ఈ రెండింటిలో ఏది మంచిదో వివరించండి, ముందుగా నీకై నీవు ఏది మంచిదో నిశ్చయించుకొని, తరువాత నాకు చెప్పు, నీకే సందేహంగా ఉంటే నాకేం చెబుతావు" అన్నట్టుగా అన్నాడు.

అసలు ఇప్పటి వరకు కృష్ణుడు కర్మలు చేయవద్దని చెప్పనేలేదు. కాని దాని మీద అర్జునుడికి ఆసక్తి ఉంది. ఎప్పుడెప్పుడు ఈ యుద్ధం చేయకుండా తప్పించుకుందామా అని ఆలోచిస్తున్నాడు. కాబట్టి దాని గురించి అడుగుతున్నాడు. కాని కొందరు విశ్లేషకులు కర్మలో అకర్మను చూడటం, అకర్మలో కర్మను చూడటం అని చదువుకున్నాము కదా దానిని ఉదాహరణగా తీసుకొని, కర్మసన్యాసమును జ్ఞానయోగము అనీ, జ్ఞానయోగము కర్మయోగమునకు తేడా చెప్పమని అర్జునుడు ఇప్పుడు అడుగుతున్నాడనీ విశ్లేషణ చేసారు. 

కాబట్టి మనం కర్మసన్యాసము అంటే జ్ఞానయోగము అని అనుకోవాల్సివస్తుంది. 
ఈ అధ్యాయంలో జ్ఞాన యోగము, కర్మయోగము ఈ రెండింటిలో ఏది గొప్పదో తెలుసుకోడానికి ప్రయత్నం చేద్దాము. 
కాని మూడవ అధ్యాయం మొదట్లో కూడా అర్జునుడు ఇదే ప్రశ్న కాస్త అటు ఇటుగా అడిగాడు. మరలా అదే ప్రశ్న అడుగుతున్నాడు.```


*1. వ శ్లోకము:*

*”సన్న్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససిl*
 *యచ్చ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితమ్ll”*

“కృష్ణా! నీవు ఒక సారి కర్మలను త్యాగం చేయమని చెబుతున్నావు. మరలా కర్మయోగము మంచిది అని అంటున్నావు. ఈ రెండింటిలో ఏది నాకు శ్రేయస్సును కలిగిస్తుందో, ముందు నీవు నిశ్చయం చేసుకొని, తరువాత నాకు చెప్పు.”
```
‘మనం ఇక్కడ కర్మసన్యాసయోగము (కర్మలను వదిలిపెట్టడం) అంటే జ్ఞానయోగము అనీ, కర్మయోగము అంటే నిష్కామ కర్మయోగము అనీ అర్థం చేసుకుంటూ ముందుకు సాగుదాము. ఇప్పుడు ఈ అధ్యాయంలో అర్జునుడు వేసిన ప్రశ్నను నిశితంగా పరిశీలిద్దాము. కృష్ణా! తమరు ఒక సారి కర్మయోగమే శ్రేష్టము అని అంటున్నారు. వెంటనే కర్మలను సన్యసించడం అంటే కర్మలను చేయకుండా ఉండటం కూడా మంచిది అని అంటున్నారు. మీ మాటలు ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. నాకు అంతా అయోమయంగా ఉంది. ఏది చేయాలో అర్థం కావడం లేదు. కాబట్టి ఈ రెండింటిలో నాకు ఏది శ్రేయస్సును కలుగ చేస్తుంది. నాకు నిరంతర సుఖాన్ని కలుగజేస్తుంది అనే విషయాన్ని ముందు నీవు నిర్ణయించి తరువాత నాకు చెప్పు. అని స్పష్టంగా అడిగాడు. దానికి కృష్ణుడు ఈ విధంగా సమాధానం చెబుతున్నాడు..
```

*2. వ శ్లోకము:*

*”సన్న్యాసః కర్మయోగశ్చ  నిశ్శ్రేయసకరావుభౌl*
 *తయోస్తు కర్మసన్న్యాసాత్కర్మయోగో విశిష్యతేll”*

“అర్జునా! కర్మయోగము, కర్మ సన్యాసము ఈ రెండూ ఒకటే నయ్యా, రెండూ శ్రేయస్సును కలుగజేస్తాయి. కాని ఈ రెండింటిలోనూ కర్మలను సన్యసించడం కంటే కర్మచేయడమే శ్రేష్టము.”
```
కర్మ చేయకుండా మానవుడు ఒక్కక్షణం కూడా ఉండలేడు, కాబట్టి ప్రారంభంలోనే కర్మలను చేయకుండా విడిచిపెట్టడం కంటే చేయడం మంచిది. కాకపోతే ఆ కర్మలను నిష్కామంగా చేయడం చాలా మంచిది. ఎందుకంటే ఇప్పటి దాకా మూడు అధ్యాయాలు చెప్పినా అర్జునుడికి ఏమీ తలకెక్కలేదు. జ్ఞానము అంటే ఏమిటో ఇంకా పూర్తిగా తెలియని స్థితిలో ఉన్నాడు. కాబట్టి జ్ఞానముతో కూడిన కర్మసన్యాసమునకు అతను అనర్హుడు. అందువలన అర్జునుడికి నిష్కామ కర్మయే మంచిది అని కృష్ణుడు చెప్పాడు.

ఇంకా ఈ శ్లోకాన్ని ఈనాటికి అన్వయించుకుంటే లోకంలో జ్ఞానం కలిగినవారి కన్నా అజ్ఞానులే ఎక్కువగా ఉన్నారు. ప్రాపంచిక విషయములలో విషయ వాంఛలలో ఆసక్తి కలవారే ఎక్కువ. వారికి ఇప్పట్లో జ్ఞానం వచ్చే అవకాశం లేదు. అందుకని ముందు వారికి నిష్కామ కర్మను అలవాటు చేసి తరువాత క్రమక్రమేణా వారికి జ్ఞానబోధ చేసి అప్పుడు అన్ని కర్మలను విడిచిపెట్టడమో, లేక అకర్మలో కర్మను చూడటంలాంటివి బోధించవచ్చు. లేకపోతే అందరూ కర్మలు చేయడం మానేసి సోమరులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అదేమంటే భగవద్గీతలో కృష్ణుడు కర్మసన్యాసం చెప్పాడు కాబట్టి మనం పనులు చేయడం ఎందుకు అని అన్ని పనులు ఎగ్గొడతారు. పతితులు అవుతారు. కాబట్టి మనందరి శ్రేయస్సు కోరి పరమాత్మ నిష్కామ కర్మను ప్రతిపాదించాడు.

కర్మచేయడం, కర్మ చేయకపోవడం ఈ రెండింటిలో ఏది మంచిది, ఏది మంచిది కాదు అని చెప్పడం కష్టం. రెండూ మంచివే. రెండూ శ్రేయస్సును ఇచ్చేవే. కాకపోతే ఒకటి తొందరగా ఫలితాన్ని ఇస్తుంది. మరొకటి నిదానంగా ఫలితాన్ని ఇస్తుంది. అది మనం ఆచరించే విధానాన్ని బట్టి మనలో ఉన్న శ్రద్ధను బట్టి ఉంటుంది. కొంత మందికి కర్మసన్యాసం చేయడం ఇష్టం. వారి మనసుకు అది సరిపోతుంది. మరి కొందరికి కర్మయోగం ఆచరించడం ఇష్టం. ఎందుకంటే అది అతని స్వభావానికి సరిపోతుంది. ఎవరికి ఏది ఇష్టమో, ఏది సరిపోతుందో ఎంచుకొని వారు దానిని ఆచరించవచ్చు. ఈ రెండు మార్గాల ద్వారా జ్ఞానాన్ని పొందవచ్చు.

కాని, కర్మసన్యాసము అంటే అంత సులభం కాదు అందరికీ వీలుపడేది కాదు. దానికి మానసిక బలం కావాలి. ఏకాగ్రత కావాలి. నిష్ట కావాలి. ముఖ్యంగా మౌనంగా ఉండగలగాలి. అందుకని, ఏదో కొంత మంది మాత్రమే కర్మసన్యాసము అవలంబించగలరు. కాబట్టి కర్మసన్యాసము కంటే కర్మలు చేయడమే చాలా మంచిది. ఆచరణయోగ్యము అయినది. అందరూ ఆచరించతగ్గది. అందుకే కృష్ణుడు అర్జునుడి మానసిక స్థితిని, అతనిలో ఉన్న రజోగుణప్రధానమైన క్షత్రియధర్మాన్ని గమనించి అర్జునుడికి కర్మసన్యాసము కంటే కర్మలు చేయడమే ముఖ్యము అని ప్రతిపాదించాడు.✍️```
```(సశేషం)
   🙏యోగక్షేమం వహామ్యహం🙏
రచన:శ్రీమొదలి వెంకటసుబ్రహ్మణ్యం, 
 (రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ.పి.హైకోర్టు.)
.    *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
           🌷🙏🌷

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
```
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖
ఇలాటి మంచి విషయాలకోసం…
*“భగవంతుని విషయాలు గ్రూప్“*  లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి...  9440652774. లింక్ పంపుతాము. దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏

No comments:

Post a Comment