Tuesday, August 26, 2025

 ప్రతిరోజూ...
మహాకవి బమ్మెర పోతనామాత్య..
         *శ్రీమద్భాగవత కథలు*```
(రామకృష్ణ మఠం, హైదరాబాద్ ప్రచురణ ఆధారంగా)```
247e4;
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀4️⃣3️⃣```
*వేదాలు వేయి సార్లు చదివినా లభ్యం కాని ముక్తి, భాగవతాన్ని ఒక్కసారి పఠిస్తే ముక్తి లభిస్తుంది..!```


*జంబూద్వీపంలో భారతవర్షం కర్మభూమి (Contd...)*
              ➖➖➖✍️

```
శాల్మలీ ద్వీపంలో శాల్మలీవృక్షం (బూరుగు చెట్టు) విస్తీర్ణం ప్లక్ష ద్వీపం విస్తీర్ణమంత ఉంటుంది. ఈ వృక్షం వల్లనే ఆ ద్వీపానికి శాల్మలీ అన్న పేరొచ్చింది. ఈ వృక్షం మూలంలో, వేదాలే అవయవాలుగా ఉన్న పతత్రి రాజు--పక్షిరాజు గరుత్మంతుడు నివసిస్తూ ఉంటాడు. శాల్మలీ ద్వీపానికి యజ్ఞబాహువు పాలకుడు. ఇతడు ప్రియవ్రతుడి కొడుకు. యజ్ఞబాహువు తన ఏడుగురు కొడుకుల పేర్లతో ఏడువర్గాలను విభజించి వారికిచ్చాడు. అవి: సురోచనం, సామనస్యం, రమణకం, దేవబర్హం, పారిభద్ర, అప్యాయనం, అభిజ్ఞాతం అనేవి. ఈ వర్షాలలో సరిహద్దు పర్వతాలు ఏడు ఉన్నాయి. అవి: సురస, శతశృంగ, వామదేవ, కుంద, ముకుంద, పుష్పవర్ష, శతశ్రుతులు అనేవి. ఏడు నదులు అక్కడ ప్రవహిస్తున్నాయి. అవి: అనుమతి, సినీవాలి, సరస్వతి, కుహువు, రజని, నంద, రాకలు అనేవి.

శాల్మలీ ద్వీపానికి చుట్టూ సురా సముద్రం ఉంది. దాని విస్తీర్ణం నాలుగు లక్షల యోజనాలు. సురా సముద్రానికి చుట్టూ కుశ ద్వీపం ఉన్నది. దాని విస్తీర్ణం ఎనిమిది లక్షల యోజనాలు. కుశ ద్వీపం చుట్టూ ఘృత సముద్రం ఉన్నది. ఆ ద్వీపంలో దేవతలు నిర్మించిన కుశస్తంభం ఉన్నది. ఆ స్తంభం ఉండబట్టే దాని పేరు కుశ ద్వీపం అని వచ్చింది. కుశ ద్వీపానికి ప్రియవ్రతుడి కొడుకు హిరణ్యరేతసుడు అధిపతి. ఇతడు తన కొడుకుల పేర్లతో వర్షాల్ని విభజించి ఏర్పాటు చేశాడు. కుశ (ద్వీప) వర్షం లో బభ్రువు. చతుశ్స్ఛంగం, కపిల, చిత్రకూటం, దేవానీకం, ఉర్ద్వరోమం, ద్రవిణం అనే ఏడు పర్వతాలున్నాయి. రసకుల్య, మధుకుల్య, శ్రుతవింద, మిత్రవింద, దేవగర్భ, ఘృతచ్యుత, మంత్రమాల అనే ఏడు మహానదులు ఉన్నాయి.

కుశ ద్వీపానికి చుట్టుకుని ఘృతసముద్రం ఉన్నది. దాని వైశాల్యం ఎనిమిది లక్షల యోజనాలు. దానికి అవతల పదహారు లక్షల యోజనాల విస్తీర్ణంతో క్రౌంచ ద్వీపం ఉంది. దాని మధ్యలో క్రౌంచం అనే ఒక పర్వతం ఉంది. దీని మూలంగానే ఆ ద్వీపానికి ఆ పేరొచ్చింది. ఈ ద్వీపానికి అధిపతి కూడా ప్రియవ్రతుడి మరో కొడుకు ఘృతవృష్ణుడు. తన కొడుకులైన ఆమోద, మధువహ, మేఘవృష్ణ, సుధామ, ఋషిజ్య, లోహితార్జ, వనస్పతులనే వారి పేర్లమీద వర్షాలను ఏర్పాటు చేశాడు. ఆ వర్షం (క్రౌంచ ద్వీపం) లో శుక్ల, వర్ధమాన, భోజన, ఉపబర్హణ, నంద, నందన, సర్వతోభద్రము అనే ఏడు పర్వతాలు; అభయ, అమృతౌఘ, ఆర్యక, తీర్థవతి, తృప్తిరూప, పవిత్రవతి, శుక్ల అనే ఏడు నదులున్నాయి.

క్రౌంచ ద్వీపాన్ని చుట్టుకుని పాల సముద్రం ఉన్నది. దాని విస్తీర్ణం పదహారు లక్షల యోజనాలు. దానిలో శాక ద్వీపం ఉన్నది. ఇది 32 లక్షల యోజనాల విస్తీర్ణంతో ఉన్నది. ఆ ప్రదేశమంతా శాక వృక్ష సుగంధంతో నిండి ఉండడం వల్ల ఆ ద్వీపానికి శాక ద్వీపం అన్న పేరొచ్చింది. ప్రియవ్రతుడి కొడుకైన మేధాతిథి ఈ శాక ద్వీపానికి అధిపతి. ఇతడి ఏడుగురు కొడుకుల పేర్ల మీద వర్షాలను విభజించి పట్టం కట్టాడు. అవి: పురోజన, పవమాన, ధూమ్రానీక, చిత్రరథ, బహురూప, విశ్వాధార, ఈ శాక ద్వీపానికి ఏడు సరిహద్దు పర్వతాలున్నాయి. అవి: ఈశాన, ఉరుశృంగ, బలభద్ర, శతకేసర, సహస్ర శ్రోత, దేవపాల, మహానస అనేవి. ఈ ద్వీపంలో అనఘ, ఆయుర్ధ, ఉభయసృష్టి, అపరాజిత, పంచనది. సహస్రసృతి, నిజధృతి అనే సప్త మహానదులున్నాయి.

శాక ద్వీపాన్ని ఒరుసుకుంటూ చుట్టూ పెరుగు సముద్రం ఉన్నది. దాంట్లో పుష్కర ద్వీపం ఉన్నది. దీని విస్తీర్ణం 64 లక్షల యోజనాలు. ఇది మహాద్వీపం. దీంట్లో పదివేల బంగారు రేకులతో పద్మం ఉన్నది. ఇది బ్రహ్మదేవుడి పీఠం. పుష్కర ద్వీపం మధ్యన మానసోత్తరం అనే పర్వతం ఉన్నది. ఇది వర్షాల మధ్య సరిహద్దు గిరిలాగా ఉంటుంది. మానసోత్తర పర్వతం ఎత్తు పదివేల యోజనాలు వైశాల్యం కూడా అంతే. దీనికి చుట్టూ నాలుగు పురాలున్నాయి. అవి: ఇంద్ర, అగ్ని, వరుణ, కుబేరు లోకపాలకుల పురాలు. ఈ పర్వతానికి పైన సంవత్సరాత్మకమై సూర్యరథ చక్రం మేరు ప్రదక్షిణం చేస్తూ ఉంటుంది. అది ఒకసారి ప్రదక్షిణం చేసే కాలమే అహోరాత్రం అనబడుతుంది. ప్రియవ్రతుడి కొడుకు వీతిహోత్రుడు పుష్కర ద్వీపానికి అధిపతి. అతడి ఇద్దరి కొడుకుల పేర్లమీద రమణక, దాతక అనే రెండు వర్షాలుగా ఈ ద్వీపాన్ని విభజించడం జరిగింది.

ఇదీ, శుద్దోదక సముద్రం వరకు ఉండే సప్తద్వీప రూపంగా ఉన్న భూమండల వర్ణన.

పుష్కర ద్వీపాన్ని చుట్టుకుని 64 లక్షల యోజనాల విస్తీర్ణంతో శుద్దోదక సముద్రం ఉన్నది. ఈ సముద్రానికి అవతల లోకాలోకం అనే పర్వతం ఉన్నది. ఇది వెలుగుకు, చీకటికి మద్యన ఉండడం వల్ల దీనికి లోకాలోకం అన్న పేరు వచ్చింది. శుద్దోదక సముద్రానికి, లోకాలోక పర్వతానికి మధ్యలో ఎనిమిది కోట్ల ముప్పై తొమ్మిది లక్షల యోజనాలకు విస్తరించి బంగారు రంగులో అద్దంలాగా ఒక ప్రదేశం ఉన్నది. అది దేవతలు ఉండడానికి వీలుగా ఉంటుంది. అక్కడ నేలమీద పెట్టిన ఏ వస్తువైనా తిరిగి తీసుకోవడం కుదరని పని. అక్కడి నుండి లోకాలోక పర్వతం ఎనిమిది కోట్ల యోజనాలు. సూర్యుడు మొదలుకుని ధ్రువుడి వరకు ఉండే జ్యోతిర్మండలం కిరణాలకు (లోకాలకు) సరిహద్దుగా ఉన్నందున, ఆ తరువాత మొత్తం అలోకం (చీకటి) ఉన్నందున, దానికి లోకాలోక పర్వతం అన్న పేరొచ్చింది.

సప్త ద్వీపాలతో కూడిన భూమండలం మొత్తం విస్తీర్ణం ఏభై కోట్ల యోజనాలు. దాంట్లో నాల్గవ వంతు లోకాలోక పర్వతం ప్రమాణం. దీంట్లో సకల జగద్గురువైన బ్రహ్మ అంతర్యామిగా ఉంటాడు. బ్రహ్మదేవుడు, ఋషభం, పుష్కరచూడం, వామనం, అపరాజితం అనే పేర్లుకల నాలుగు దిగ్గజాలను లోకాలను రక్షించడానికి అక్కడ నిలిపి ఉంచాడు. భగవంతుడు సకల లోకాలను రక్షించడానికి లోకాలోక పర్వతం మీద కల్పాంతం వరకు వేచి ఉంటాడు.

వివిధాలైన ఈ లోకయాత్రలన్నీ భగవంతుడి చిచ్చక్తిస్వరూపిణి అయిన యోగమాయా విరచితాలే! ఇలా అనేక మంత్ర రహస్యాలతో ఆ లోకాలోక పర్వత శిఖరం మీద ఉన్న భగవంతుడికి తప్ప ఆ పర్వతానికి ఆవల వైపు ఇతరులెవ్వరికీ సంచరించడానికి వీలుపడదు. సూర్యుడు బ్రహ్మాండమధ్యంలో ఉన్నాడు. సూర్యుడి నుండి అండగోళం అంచులు రెండింటికి 25 కోట్ల యోజనాల మేర ఉన్నది. ఇలా ఉన్న సూర్యుడి వల్లనే దిక్కులు, స్వర్గం, మోక్షం, నరకం మొదలైనవన్నీ ఏర్పడుతున్నాయి. దేవతలకు, జంతువులకు, మనుష్యులకు, నాగులకు, పక్షులకు, గడ్డికి, లతలకు, పొదలకు, భూమి నుండి మొలిచే సర్వ జీవ సమూహానికీ సూర్యుడే ఆత్మగా ఉన్నాడు.✍️
(సశేషం)
🙏కృష్ణం వందే జగత్ గురుమ్!🙏
రచన:శ్రీ వనం జ్వాలా నరసింహారావు
```
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖
ఇలాటి మంచి విషయాలకోసం…
*“భగవంతుని విషయాలు గ్రూప్“*  లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి...  9440652774. లింక్ పంపుతాము. దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏

No comments:

Post a Comment