🕉️అష్టావక్ర గీత 🕉️
అధ్యాయము 18
శ్లోకము 88
శ్లో॥ నిర్మమః శోభతే దీరః సమలోష్టాశ్మ కాంచనః |
సుభిన్న హృదయగ్రంధి: వినిర్ధూత రజస్తమః || 88
. నిర్మమః మమతారహితుడును, సమలోష్టాశ్మ కాంచనః = మట్టి పెళ్ళను బంగారపు ముద్దను సమానముగా చూచువాడును, సుఖిన్న హృదయగ్రంధీః భేదింపబడిన హృదయగ్రంధులు గలవాడును, నిరూత రజస్తమః ఎగురగొట్టబడిన రజస్తమోగుణములు గలవాడునగు, ధీరః=జ్ఞాని, శోభతే = ప్రకాశించుచున్నాడు.
హృదయంలోని అజ్ఞానగ్రంధులు నశించగా అహంకార రహితుడైన జ్ఞానికి మట్టి, రత్నం, బంగారం అన్నీ సమాన భావాన్నే కలిగిస్తాయి. అహం కారం లేకపోవడంతో రజోగుణమూ తమోగుణమూ నశించి సత్త్వప్రధానుడై ప్రకాశిస్తాడు.
ఈ శ్లోకంలో, మన పురాతన శాస్త్రగ్రంధాలలో వాడబడిన మూల్య రత్నాలవంటి పదాలు ప్రదర్శింపబడుతున్నాయనిపిస్తుంది. ఉపనిషద్ వాజ్మయపు భావార్థ గంభీరతో, భగవద్గీతలోని భాషాసౌందర్యంతో ఈ శ్లోకం అత్యంత మనో హరంగా శోభిస్తోంది.
ఆత్మజ్ఞానాన్నిపొంది జీవన్ముక్తుడయిన జ్ఞాని అలౌకిక తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటాడు. వ్యక్తిత్వానికి వ్రణంవలె సమస్త బాధలను సృష్టించే అహం కారం అతనిలో అదృశ్యమయి పోతుంది. బుద్ధిపరంగా అతడెక్కడా ఎప్పుడూ ద్వైతాన్ని చూడనే చూడడు, అతడు బాహ్యవస్తుమయ ప్రపంచాన్ని చూస్తున్నా, ఆ గుర్తింపబడిన భావాలన్నీ చైతన్యస్వరూపమయిన తన కదలికలే అని అతనికి స్పష్టంగా తెలుస్తుంది. సామాన్యులు అత్యంత విలువయినవిగా భావింపబడే కొన్ని విచిత్రాలను ఇక్కడ తెలుసుకుందాం. ఆఫ్రికాలో కొన్ని జాతులలో వేట కుక్కల వాడి దంతాలను అపురూపంగా భావించి వాటిని హారాలుగా మలిచి మెడలో ధరిస్తారట! వారికి వజ్రాలకంటే ఈ శునక దంతాలే అత్యంతము విలువ యినవి! నవీన నాగరికులలో హిప్పీలు కొందరు తమ మెడలో ఒక గంటను కట్టు కుంటారు. అది వారిచే ఎంతో అమూల్యంగా భావింప బడుతుంది. మనదేశంలో గడ్డిమేసే ఆవు మెడలో ఈ గంటలు చిరుధ్వనులు చేస్తూ ఉండడం మనందరికీ పరిచయమే!!వస్తువులలో వస్తుతః విలువలేదనీ, ధరించేవాని మనోభావమే వాటికి విలువ నిస్తోందనీ ఇక్కడ స్పష్టపడుతోంది. ఇక్కడ మహర్షి వర్ణించే జ్ఞానికి, మట్టి, రత్నం, బంగారం, అన్నీకూడా వివిధ వర్ణాలలో ఆకారాలలో కనిపించే పదార్థాలు మాత్రమే "సమలోష్టాశ్చ కాంచనః" ---ఈ పదజాలం భగవాన్ శ్రీకృష్ణుని గీత నుండి (అధ్యాయం 6-8) ఉన్నది ఉన్పట్టుగా గ్రహింపబడింది.
మానవ వ్యక్తిత్వాన్ని పరిశీలించిన మన మహర్షులు, ఇది ముఖ్యంగా మూడు ముడులచే బంధింపబడి ఉందవి అంటున్నారు. హృదయగ్రంధి హృద యాన్ని బందించే ముడులు మూడు అని "అవిద్య","కామం","కర్మ". మన సహజ స్వరూపం తెలియకపోవడం అవిద్య, అవిద్యతో మనలను మనం అసంపూర్ణ వ్యక్తిగా, పరిమితంగా భావించుకుంటున్నాము. ఈ పరిమితులను తొలగించుకోవాలనే తపనతో బుద్ధిచేసే ప్రయత్నం అనేక కోరికల రూపంలో వ్యక్తమవుతుంది. బుద్ది లోని కోరికలు మనస్సులో అశాంతిని కలిగిస్తాయి. ఈ అశాంతి కారణంగా నిర్వి రామంగా శరీరంతో అనేక కర్మల నాచరిసాం. అవిద్య, కామం, కర్మ, ఈ మూడే మనలను పరిమితం చేసి కష్టనష్టాలని కలిగించి బందీని చేస్తున్నాయి. జీవిత మంతా బందంతో ముకి కోసం తపనతో బాధామయంగా గడచిపోతుంది.
త్రివిధములయిన ఈ బంధాలకు కారణం మన అజ్ఞానమే. సత్యాన్ని సరిగ్గా గుర్తించకపోవడమే అవిద్యగా అన్యధా గ్రహణానికి ఆధారమవుతోంది. అపరోక్షానుభూతిలో, ఆత్మానుభవంలో అజ్ఞానాన్ని దగ్ధం చేసినవాడే జ్ఞాని, అతడు మాత్రమే హృదయగ్రంధిని ఛేదించి వ్యక్తిత్వాన్ని బాధామయమయిన బంధాలనుండి తప్పించినవాడు. కఠోపనిషత్తులోనూ ముండకోపనిషత్తు (2-2-8) లోనూ ఈ భావం సుస్పష్టంగా గావించబడింది.
యదా సర్వే ప్రముచ్యన్తో హృదయస్యహే గ్రంధయః
అథ మర్త్యోమృతో భవతి ఏతావదను శాసనమ్ (కఠోపనిషత్తు 2-3-15)
ఈ భూమిమీద జీవిస్తున్నప్పుడే హృదయగ్రంధలను ఛేదించగలిగిన మర్త్యుడు ఇక్కడే అమరుడౌతాడని వేదాంతం ఘోషిస్తోంది.
ఆత్మను గూర్చిన అజ్ఞానం మనిషిలో సత్త్వ, రజస్, తమోగుణాలుగా విస్తరించి మనస్సును పాలిస్తుంది. ఈ మూడు గుణాలే ఆత్మను మన దృక్పథం నుండి మరుగుపరుస్తున్నాయి. ఆత్మ కనిపించకుండా తెరలాగా "ఆవరణ"గా తమోగుణం ఆవరిస్తుంది. అప్పుడు మనస్సును రజోగుణం ఆవరించి సత్యాన్ని గురించి అనేక కల్పనలను రచించి చూపిస్తూ ఉంటుంది---"విక్షేపం" ఈ ఆవరణ విక్షేపాలే మనల్ని అహంకార సహిత జీవులుగా మారి కోరికలూ, ఆశాంతీ కర్మ, బాధా అనుభవింపజేస్తున్నాయి.
రజస్తమోగుణాల ప్రభావం నుండి ముక్తుడయిన సాధకుడు ఆపరోక్షానుభూతిలో అనందంగా ఉండగలుగుతాడు. ఆవరణ విక్షేపం లేకపోవడంతో మనోబుద్ధులు శాంతంగా సహజంగా ఉండగలుగుతాయి. భ్రమాకల్పనలన్సీ నశిస్తాయి? సత్యం స్వతస్సిద్ధంగా ప్రకాశిస్తుంది. రజోగుణాన్ని మనస్సునుండి తొలగించ డానికి బాహ్యసాధనలన్ని ఉపయోగపడతాయి. బుద్ధిలో నుండి తమోగుణాన్ని తొలగించుకోవడానికి సాధకులకు ధ్యాన, శ్రవణ, మనన, నిధిద్యాసలు నిర్దేశించ బడినాయి. దీనినే అభ్యంతర సాధన అంటారు.
ఇక్కడ శిష్యుడయిన జనకునిలో అజ్ఞానం అతి పల్చగా మబ్బువలె ఉంది, సత్యానికి అతి సమీపంలో ఉండి వెలుగును చూస్తున్నా మబ్బు అడ్డు ఉండడంతో స్పష్టంగా జ్ఞాన భాస్కరుని చూడలేక పోతున్నాడు. అటువంటి శిష్యునికి మహర్షి ఇచ్చే సూచనలు మనకు అత్యాశ్చర్యకరంగా అసంబద్ధంగా అనిపించవచ్చు. మానవాళి క్షేమాన్ని కాంక్షించి మహర్షులు విధించిన చతుర్విధ పురుషార్ధాలను, ముముక్షుత్వాన్ని కూడా విడచి పెట్టమని శిష్యునికి బోధిస్తుంటే, అది విన్న సామాన్యులు ఏమనుకుంటారు? సత్యాన్ని సంపూర్ణంగా దర్శించ దానికి అతి పలచని ఆవరణగా అజ్ఞానం రేఖామాత్రంగా మిగిలి ఉన్న సాధకు లకు, గమ్యాన్ని సమీపించినవారికి ఇవ్వబడిన సూచనలను, ప్రయాణం మొదట్లో ఉన్న సాధకులు గ్రహించకూడదు. ప్రాథమికదశలో ఉన్న సాధకులు తమ నిశ్చయాన్ని, చిత్తశద్ధిని, విడవకుండా అసిధారావ్రతంగా సాధనను కొనసాగించి గమ్యాన్ని సమీపించాలి. ఆధ్యాత్మిక మార్గం కత్తి అంచువలె అతి పదునైనదని కఠోపనిషత్తు అంటోంది. అతి జాగ్రత్తగా అడుగడుగునా శాస్త్రజ్ఞాన తేజంతో దారి చూసుకుంటూ ప్రతీ అడుగూ నిశ్చలంగా చిత్తశుద్ధితో వేస్తూ గమ్యాన్ని చేరుకోవాలి.
క్షురస్య ధారా నిశితా దురత్యయా దుర్గం పథస్తత్కవయో వదన్తి (కఠోపనిషత్తు 1-114)
ఈ మార్గం కత్తి అంచువలె అతి పదునైనది. దీనిమీద నడవడం అతి కష్టం, గమ్యాన్ని చేరడం అంతకన్నా కష్టం అని జ్ఞానులంటారు.🙏🙏🙏
No comments:
Post a Comment