🕉️అష్టావక్ర గీత 🕉️
అధ్యాయము 18
శ్లోకము 89
శ్లో|| సర్వత్రావధానస్య న కించిద్వాసనా హృది | ముక్తాత్మనో వితృప్తస్య తులనా కేన జాయతే| 89.
ఏ కోరికలూ లేని నిత్యతృప్తి హృదయంతో సర్వాన్ని ఉదాసీన భావంతో వీక్షించగలిగే జ్ఞానికి సాటి యెవరు?
ఈ అధ్యాయపు చివరి శ్లోకాలలో అష్టావక్ర మహర్షి స్పష్టంగా ఒప్పు కుంటున్నారు. బాహ్యాంభ్యంతరాలలో జ్ఞాని జీవితాన్ని ఎంత వర్ణించినా అది కేవలం లేశ మాత్రమే. వర్ణనాతీతమయిన ఆ స్థితిని దూరం నుండి కేవలం చూపించగలిగేనో లేదో అని మునీంద్రులు సంశయిస్తున్నారు. జ్ఞానితో సాటిరాగల వారెవరూ ఉండరు. అతని స్థితిని వర్ణించగలగడం అసాధ్యం. మానవ మేధకొక సవాలుగా జ్ఞాని అంతరంగం సదా శాంతంగా, అతని జీవితమే అందమైన దృశ్య కావ్యాన్ని చూస్తున్నట్టుగా ఉంటుంది. అశాంతికి, కష్టాలకు, సర్వకర్మలకు కారణయిన కోరికలేలేని జ్ఞాని మనోబుద్ధులు సదా శాంతంగా సంతోషంగా 'ఉంటాయి. సర్వత్రా తన స్వరూపాన్నే సదా గుర్తిస్తూ ఉండడంతో అతనికి దేనిమీదా ప్రత్యేకమైన వ్యామోహం ఉండదు. రాయిని, రత్నాన్ని సమభావంతో చూడగల అతని మనస్సును అశాంతి ఎలా సమీపించగలదు? బాహ్యంగా భౌతిక ప్రమాణాల దృష్ట్యా అతడు మనిషిగా మనకు కనిపిస్తున్నా, మన బుద్ధికి అందని ఎత్తుకు ఎదిగిపోయిన అతని మహావ్యక్తిత్వం అనితరసాధ్యం, అపూర్వం, అద్భుతం. అతని అంతరంగ జీవితం కూడా అసాధారణం, అసామాన్యం. అంజలి ఘటించి మౌనంగా నిలబడడమే తప్ప ఏ విధంగానూ ఆ స్థితిని వర్ణించలేము. అందుకే మహర్షి "తులనా కేన జాయతే"--- "సరిపోల్చదగినదేమున్నది?" అని అనడంలో తన అసమర్థతను సమర్థనీయంగా ఒప్పుకుంటున్నారు.🙏🙏🙏
No comments:
Post a Comment