Monday, January 26, 2026

 1. ఏసాధనకైనా 'భక్తి' ఆధారం

ఆధ్యాత్మిక సాధనకు ఎవరూ అనర్హులు కారు. ఏ ఆధ్యాత్మిక సాధనకైనా భక్తి పునాదిగా ఉండాలి. అసలు భక్తి అంటే ఏమిటి? భగవంతునిపై ఇష్టం. ఇతర విషయాలపై ఇష్టానికి భగవంతునిపై ఇష్టానికి తేడా ఉంటుంది. దేవుడు మన కష్టాలన్నీ తీరుస్తాడన్న విశ్వాసంతో మొదలై "ఈశ్వరుడు ఇచ్చేవాడు-నేను తీసుకొనేవాడిని” అన్న భావంతో ఏర్పడ్డ ఇష్టం భక్తిగా ఉంటుంది. ఈ భావనతోనే మనకన్నా, ఈ సృష్టిలోని అందరికన్నా మహోన్నత శక్తి ఒకటి ఉన్నదన్న “సత్యం” ఆవిష్కరించబడుతుంది. ఏ రూపంలో, ఏ పేరుతో కొలిచినా స్వార్థం, ఇష్టం, భయం, మోక్షం ఇలా ఏ కారణంతో పూజించినా అంతర్లీనంగా ఉండే భావం మాత్రం "భగవంతుడి అనుగ్రహం-మన శరణాగతి". అదే "భక్తి". మనలో అంకురించిన ఈ భక్తి భావం శ్రవణ, మనన, నిధి, ధ్యాసల ద్వారా పూర్ణానుభవాన్ని అంటే మనం భగవంతుడికి భిన్నంగా లేమన్న అను భూతిని ఇస్తుంది. ఈ నాల్గింటిలో ఏదో ఒక దానితో ఆగిపోతే సాధనకు సంపూర్ణత చేకూరదు. అందుకే మనసుకు శాంతి చేకూర్చే మాటలు వినాలి. వాటిని పదేపదే గుర్తుకు తెచ్చుకోవాలి. వాటిని హృదయంలో నిక్షిప్తం చేసుకోవాలి. సదా ఆ ధ్యాసలో ఉండాలి. ఈ నాలుగు రావాలంటే ముందుగా మనకు దేవుడంటే ఇష్టం, భక్తి ఉండాలి. అవి మన పూర్వ కర్మ వాసనల ఫలితంగానే స్ఫురిస్తాయి. భక్తిభావం పెరిగే కొద్దీ మనకు నిజమైన సుఖసంతోషాలు అవగాహనలోకి వస్తాయి. అది ఎలాగంటే ఆత్మమనసు నిరంతరం ఆనందస్థితిలో ఉంటుంది. సుఖ సంతోషాలు ఈ ఆనందం తాలుకు నీడలే. శరీర సౌఖ్యంవల్ల సుఖానుభూతి, మనసు పొందిన అనుకూలత వల్ల సంతోషం కలగడం మనందరికీ తెలిసి నదే. కాఫీపై నురగ ఏలాంటిదో ఆనందం పై తేలియాడే సుఖ సంతోషాలు అలాంటివే. ఈ సుఖసంతోషాలు శాశ్వతం చేసుకునే ప్రయత్నంలో పరమావధే, చివరిమెట్టు ఆత్మానుభవం. అదే కర్మ, భక్తి, జ్ఞాన, యోగ మార్గాలన్నింటిలోనూ మనం సాధించే తురీయావస్థ. ఈ 'ఆనందం' అనుభవంలో ఉండేదే తప్ప అది వ్యక్తీకరణకు నీడలే. శరీర సౌఖ్యంవల్ల సుఖానుభూతి, మనసు పొందిన అనుకూలత వల్ల సంతోషం కలగడం మనందరికీ తెలిసి నదే. కాఫీపై నురగ ఏలాంటిదో ఆనందం పై తేలియాడే సుఖ సంతోషాలు అలాంటివే. ఈ సుఖసంతోషాలు శాశ్వతం చేసుకునే ప్రయత్నంలో పరమావధే, చివరిమెట్టు ఆత్మానుభవం. అదే కర్మ, భక్తి, జ్ఞాన, యోగ మార్గాలన్నింటిలోనూ మనం సాధించే తురీయావస్థ. ఈ 'ఆనందం' అనుభవంలో ఉండేదే తప్ప అది వ్యక్తీకరణకు సాధ్యం కాదు. మనకు తెలిసిన సుఖ సంతోషాలు కేవలం ఈ ఆనందపు క్రీనీడలు మాత్రమే.

చాలామంది సాధన చేస్తూ తమకు భక్తి కుదరటం లేదని అనుకుంటారు. అసలు సాధనకు ఉపక్రమించటమే భక్తి. భక్తి భావం లేనిదే మనం పూజకో, జపానికో, యోగ సాధనకో ఉపక్రమించం. ఏ సాధనకైనా భక్తే ఆధారంగా ఉంటుంది. సాధన కొనసాగింపులో ఇతర వాసనలు, విషయాలు వాటి బలాన్నిబట్టి అడ్డు తగులుతూ ఉంటాయి. అవిరాకుండా ఉండేంత ఇష్టం మన సాధనపై ఉండాలి. పారాయణాలు, స్తోత్రాలు ఆద్యంతం భక్తితో సాగాలి గానీ అవి చదువుతూ వెళ్ళటమే భక్తికాదు. ఏ సాధనల్లో ఉన్నవారైనా సరే బాహ్య ఆర్భాటాలని బట్టి భక్తుడని, కాదని నిర్ణయించలేము. భక్తుడు అనిపించుకోవడానికి కాదు భక్తుడుగా ఉండటానికి ప్రయత్నించాలి. శ్రీరమణ భగవాన్ చూపే ఆత్మ విచార మార్గం అయినా భక్తితో ముడివడిందే. భక్తి దేవుడి రూపంతో మొదలై దివ్యత్వాన్ని సాధిస్తుంది. ఆత్మవిచారం మన బాహ్య రూపంతో మొదలై స్వస్వరూవ అనుభవాన్ని ఇస్తుంది. దేవుడని పేరుపెట్టక పోయినా విచారణ మార్గంలో కూడా ఆత్మసాధన కోసం భక్తి ప్రధాన భూమిక గానే ఉంటుంది. మనం అనుకున్నా అనుకోకపోయినా మనం ఆత్మరూపులం కాకుండాపోమని శ్రీరమణ భగవాన్ అంటున్నారు. మన దేహం, మనసులు ఆత్మకు రూపాంతరాలేనని ఆ మహర్షి స్పష్టం చేస్తున్నారు. ఒకే నెయ్యి కరిగితే ఒక రూపంలో, గడ్డకడితే మరో రూపంలో ఉన్నట్లే ఇవి కూడా. కనిపించే శరీరం, కనిపించకుండా అనుభవంలో ఉన్న మనసులను విశ్లేషిస్తూ వెళ్ళటమే విచార మార్గం. నిద్రలో ఇవి రెండూ ఉండటం లేదన్నది అందరి అనుభవమే. నిద్రలో ఉన్న సుఖ, శాంతులు మెళకువలో ఎందుకు ఉండటం లేదంటే 'అహమిక' వల్లనే. గాఢనిద్రలో మనసు ఆత్మగా ఉంటుంది. అది స్వప్నావస్థలో తాను దేహమనే భావనతో 'నేను' గా అంకురిస్తుంది. మెళకువ రాగానే పూర్తిగా శరీరంతో మమేకమై తాను ఈ దేహాన్నే అనే భావంలో ఉంటుంది. శరీరం, మనసులు ఆత్మకు భిన్నాలు కావు కానీ మన భావన అక్కడే ఆగిపోతే సత్యం తెలుసుకోలేము. అందుకే 'నేను దేహాన్ని కాదు', 'నేను మనసుని కాదు' అనుకోనక్కర్లేదు. కంటికి కనిపించే దేహాన్ని నిత్యం అనుభవిస్తున్న మనసుని కాదని, లేదని ఎలా అంటాం?. ముందుగా మనసు, దేహాలను విశ్లేషిస్తే 'నేను దేహాన్ని మాత్రమే కాదు'- 'నేను మనసుని కూడా' అని తెలుస్తుంది. ఆ మనసును విశ్లేషించటం ద్వారా దానికి మూలమైన ఆత్మను తెలుసుకోగలుగుతాం. అప్పుడు నేను మనసుని మాత్రమే కాదు చైతన్యాన్ని కూడా అని తెలుస్తుంది. అంతేగానీ మనోదేహాలను ఉన్నపళంగా అసత్యం అనుకోలేము. ముందు అవి అశాశ్వతం అని గుర్తించాలి. అది ఏలాగంటే గాఢనిద్రలో ఇవి రెండు మనకు అనుభవంలో ఉండటం లేదు. అంటే 'నేను' అనే భావన మనను శాశ్వతంగా అంటి పెట్టుకొని ఉండటం లేదు. కాబట్టి ఆ 'నేను' గా వ్యక్తమయ్యే మనో దేహాలు అశాశ్వతం అని అవగాహనలోకి వస్తుంది. ఈ నిజాన్ని గుర్తించటం ద్వారా మనను నిలిపి ఉంచే శాశ్వత వస్తువేదో మనలో ఉన్నదని తెలుస్తుంది. అదే ప్రాణం, ఆత్మ, భగవంతుడు . దాన్ని తెలుసుకోవడమే మానవ జీవిత పరమార్థం. దీనికి అడ్డుగా ఉన్నది మన అహంకారమే. అహంకారం అంటే నేను శరీరాన్ని, మనసుని అన్న భావనలే. మనం శరీరాన్ని, మనసుని వదలనక్కర్లేదు. ఆ భావనలను వదలగలిగితే చాలు. ఈ శరీరం కదలికకు, మనసు కదలికకు ఆత్మ కారణం. మనలో ఉన్న శక్తిని మనం కనుక్కోలేకపోయినా అది మనకు అనుక్షణం అనుభవంలోనే ఉంటుంది. బాహ్యంగా దేన్నీ వదలనక్కర లేకుండానే సదా నేను 'ఆత్మనే' అన్న పెద్దలు చెప్పిన భావనలో ఉండటం, మనసు పోకడలను నిరంతరం గమనించటం, ఈ శరీరం మనసు చేతిలో పరికరమేనన్న విషయం గుర్తించటం ద్వారా ఈ 'అహమిక' క్రమేణ అదృశ్యం అవుతుంది. మనసును పూర్తిగా తెలుసుకోవడమే దాన్ని పోగొట్టుకోవడం. ఈ సృష్టిని అనాదిగా నడుపుతున్న శక్తే నన్ను కూడా నడుపుతున్నదన్న సత్యం గుర్తించటం సదా అది మననంలో ఉంచటమే శరణాగతి.(సశేషము)

No comments:

Post a Comment