Monday, January 26, 2026

 🔥అంతర్యామి 🔥

# నువ్వేమిటో నీకు తెలియాలి!....


☘️మనిషి తన జీవితంలో 'ఎరుకను విస్మరిస్తున్నారు ఎక్కడెక్కడో దేనికోసమో నిరంతరం అన్వేషిస్తున్నాడు. కానీ, తనను తాను తెలుసుకోలేకపోతున్నాడు. వెతుకుతున్నది తన దగ్గరే ఉందని గ్రహించడం లేదు. రామాయణ, భారత, భాగవతాలు చెప్పింది ఇదే. 'తెలుసుకోవడం' దగ్గరనే తడబాటు. మహాత్ములు, మహర్షుల కథల నుంచో, ప్రవచనాలు వినో తనని తాను తెలుసుకోవడం లేదు. సాధారణ వ్యక్తులే కాదు. బుద్ధుడు సహితం ఈ విషయం ఆలస్యంగానే గ్రహించాడు. సమాధానం గ్రహించి అవతార పురుషుడయ్యాడు.

☘️మోక్షం కోసం, జ్ఞానసిద్ధి కోసం, దుఃఖం లేని లోకం నిర్మాణం కోసం తన శరీరాన్ని శుష్కింపజేసుకున్నాడు. మరణం కొద్ది రోజులలో తథ్యమనిపించింది. అటువంటి సమయంలో ఓ కళాకారుల బృందం అటుగా ఏ జాతరకో వెళ్తాంది.

☘️ఆ గుంపులో ఓ కుర్రాడు తన తంబురాను సవరిస్తున్నాడు. అతణ్ని ఓ వృద్ధ కళాకారుడు హెచ్చరిస్తూ 'ఒరేయ్ అబ్బాయ్... ఆ తీగల్ని మరీ గట్టిగా బిగిస్తే తెగిపోతాయి. మరీ వదులుగా వదిలేస్తే అపస్వరాలు పలుకుతాయి. ఎలా ఉన్నవాటిని అలానే ఉంచితే కమ్మని స్వరాల్ని వినిపిస్తాయి' అన్నాడు. శరీరం శుష్కించి, నీరసం ఉన్న బుద్ధుడి చెవులను తాకాయి ఆ మాటలు. వాటిలోని సత్యాన్ని ఆయన మనసు గ్రహించింది. తనకు అన్వయించుకుంది. 'నేనూ ఆ తీగ వంటివాడినే. నిన్నటి వరకు రాకుమారుడిగా సుఖాలను అనుభవించాను. వదులైన తీగనయ్యాను. తరవాత శరీరాన్ని కఠోర నియమాలతో శుష్కింపజేశాను. బిగించిన తీగలా అయాను. రెండూ తప్పే. శరీరాన్ని శరీరంలా చూసుకోవాలి' అనుకున్నాడు. జీవితంలో ధ్యానం కాదు... జీవితమే ధ్యానమని గ్రహించాడు బుద్ధుడు. ఆ దిశగా తనను తాను తెలుసుకుని ప్రసిద్ధుడయ్యాడు. ఆ తరవాత ఆయన దగ్గరికి పలు సమస్యలు, కష్టాల గురించి చెప్పుకోవడానికి వచ్చిన వారిని 'జీవితం పట్ల మీకు ఎరుక ఉందా' అని ప్రశ్నించేవాడు.

☘️ఇది జెన్ కథ కావచ్చు. కానీ... వర్తమానంలో ప్రతి ఒక్కరూ ఒక్క క్షణమైనా పునరాలోచన చేసుకోవాలి.
అందరూ తమ గురించి తమకు బాగా తెలుసనుకుంటారు. కానీ... నిజంగా 'ఎరుక అనేది వారికి తెలియదు. అదే ఉంటే అసలు సమస్యలకు, కష్టాలకు పరిష్కారం ఎవరి దగ్గర ఉందో తెలిసిపోవాలి కదా! రాముడు, కృష్ణుడు తదితర అవతారాల్లోని మూల సూత్రాన్ని దేవదేవుడు
ముందుగానే నిర్ణయించుకోబట్టే కదా ఆయా
లక్ష్యాలను పూర్తి చేశారు. 

☘️భగవంతుడి కథలలో తెలుసుకోవాల్సిన నీతి ఎవరిని వారు తెలుసుకోవడమే! అది జరగనంత వరకు మనిషి తనను తాను గుర్తించలేడనేది బుద్ధ భగవానుడి ఉవాచ. 'నిన్ను నువ్వు ప్రేమించాలంటే.. నువ్వేమిటో నీకు తెలియాలి. తెలియకపోతే ప్రేమించలేవు'. ఆ ఎరుక ఇప్పుడు అందరికీ అవసరం.🙏

✍️- భమిడిపాటి గౌరీశంకర్

🌺 శ్రీ రామ జయ రామ జయ జయ రామ 🌺

No comments:

Post a Comment